మాజీ ప్రపంచ సుందరి ఐశ్వర్యారాయ్ కి కేన్స్ ఉత్సవాలతో ఉన్న విడదీయరాని బంధం గురించి తెలిసిందే. ఈ ఉత్సవాలలో ప్రతిసారీ భారతీయ సుందరి ఐష్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. కొన్నేళ్లుగా ఐశ్వర్యారాయ్ తనతో పాటే, తన కుమార్తె ఆరాధ్య బచ్చన్ ని కూడా కేన్స్ ఉత్సవాలకు తీసుకుని వెళుతోంది. కేన్స్ 2025 ఉత్సవాల్లోను ఆరాధ్యతో పాటు ఐష్ ప్రత్యక్షమైంది.
తాజాగా ఐశ్వర్యారాయ్ రెడ్ కార్పెట్ నడకలకు సంబంధించిన ఫోటోలు ఇంటర్నెట్ లో వైరల్ గా మారాయి. ఐష్ ధరించిన వెండి చీర తళుకుబెళుకులు వీక్షకులను కట్టి పడేస్తున్నాయి. ఇది బనారసీ చీర. ఈ చీరలో ఐశ్వర్యారాయ్ డిగ్నిటీకి కేరాఫ్ గా కనిపించింది. కేన్స్ లో భారతీయత ఉట్టిపడేలా ఎంతో హుందాగా కనిపించారు ఐశ్వర్యారాయ్. ఇది సాంప్రదాయం, ఆధునికతల మేళవింపు అని ప్రశంసలు కురుస్తున్నాయి. ఇది మాత్రమే కాదు ఐశ్వర్యారాయ్ నుదిటిన సిందూర్ (ఎర్రని కుంకుమ)ను దిద్దుకుని ప్రత్యేకంగా కనిపించింది. ఈ రూపం వెనక ఒక అర్థం అంతరార్థం ఉన్నాయి. పాకిస్తాన్ పై భారత సైన్యం అసాధారణ విజయాన్ని, ఆపరేషన్ సిందూర్ జైత్రయాత్రకు మద్ధతు పలకడమే. భారతీయ మహిళల సిందూరాన్ని చెరిపేసిన పాకిస్తానీ ముష్కరుల అంతం చూసిన భారత సైన్యానికి ఇది నివాళి.
మరోవైపు ఐశ్వర్యారాయ్ ధరించిన 500 కేరట్ల మోజాంబిక్ అన్ కట్ డైమండ్ నెక్లెస్ కూడా ప్రత్యేక ఆకర్షణగా కనిపించింది. ప్రస్తుతం ఈ ఫోటోగ్రాఫ్ ఇంటర్నెట్ లో వైరల్ గా మారుతోంది.ఐశ్వర్య ధరించిన ఈ అద్భుతమైన హై జ్యువెలరీ సెట్‌లో 500 క్యారెట్ల మొజాంబిక్ కెంపులు, 18-క్యారెట్ల బంగారంతో అమర్చిన అన్‌కట్ వజ్రాలు ఉన్నాయి. మల్టీ స్ట్రాండ్ రూబీ నెక్లెస్, డైమండ్ లాకెట్టుతో అలంకరించబడిన రూబీ చోకర్ నెక్లెస్ మూడు వరసల డైమండ్ నెక్లెస్ ఎంతో ఆకర్షణీయంగా కనిపిస్తోంది. ఈసారి ఐశ్వర్యారాయ్ తో పాటు కేన్స్ లో జాన్వీ కపూర్, అదితీరావ్ హైదరీ తదితరులు సందడి చేస్తున్న సంగతి తెలిసిందే.