సల్మాన్ ఖాన్ ఇంట్లోకి అనుమతి లేకుండా ఓ అపరిచిత వ్యక్తి ప్రవేశించడం కలకలం రేపింది. ఈ వారం ప్రారంభంలో ముంబైలోని సల్మాన్ నివాసం - గెలాక్సీ అపార్ట్‌మెంట్స్‌లోకి 23 ఏళ్ల వ్యక్తి అక్రమంగా ప్రవేశించాడని పోలీసులు తెలిపారు. జితేంద్ర కుమార్ సింగ్ అనే వ్యక్తి మే 20న సాయంత్రం 7:15 గంటల ప్రాంతంలో ఇంట్లోకి ప్రవేశించాడు. పోలీసుల వివరాల ప్రకారం.. సింగ్ మొదట ఉదయం 9:45 గంటల ప్రాంతంలో బాంద్రాలోని ఖాన్ ఇంటి చుట్టూ తిరుగుతూ కనిపించాడు. మిస్టర్ ఖాన్ భద్రత కోసం నియమించబడిన పోలీసు అధికారి అతన్ని వెళ్ళిపోవాలని కోరాడు. దీంతో కోపంగా ఉన్న సింగ్ తన మొబైల్ ఫోన్‌ను నేలపైకి విసిరి పగలగొట్టాడు. అదే రోజు సాయంత్రం సింగ్ అదే భవనంలో నివసిస్తున్న ఒక వ్యక్తికి చెందిన కారులో గెలాక్సీ అపార్ట్‌మెంట్స్‌లోకి ప్రవేశించాడు. అయితే అతడిని మళ్ళీ పోలీసులు ఆపారు. ఈసారి అపరిచితుడిని బాంద్రా పోలీసులకు అప్పగించారని అధికారులు తెలిపారు. విచారణ సమయంలో సింగ్ నేరుగా సల్మాన్ ని కలవాలనుకుంటున్నట్లు పోలీసులకు చెప్పాడు. పోలీసులు నన్ను కలవనివ్వలేదు.. కాబట్టి నేను దాక్కోవడానికి ప్రయత్నిస్తున్నాను! అని అతను చెప్పాడు. ఛత్తీస్‌గఢ్ నివాసి అయిన సింగ్‌ను అరెస్టు చేసి, అతనిపై కేసు నమోదు చేశారు. తదుపరి దర్యాప్తు జరుగుతోందని పోలీసులు తెలిపారు.
గతేడాది సల్మాన్ ఖాన్ ఇంట్లో జరిగిన దాడి అనంతరం భద్రతను Y+ భద్రతకు అప్‌గ్రేడ్ చేశారు. కాల్పుల సంఘటన తర్వాత ఈ మార్పు జరిగింది. 2024 ఏప్రిల్ 14న బైక్‌పై వచ్చిన ఇద్దరు వ్యక్తులు మిస్టర్ ఖాన్ బాంద్రా నివాసంపై నాలుగు రౌండ్ల కాల్పులు జరిపి అక్కడి నుండి పారిపోయారు. గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ ముఠా ఫేస్‌బుక్ పోస్ట్‌లో కాల్పులకు బాధ్యత వహించింది. సల్మాన్ ఖాన్‌కు సన్నిహితుడిగా తెలిసిన 66 ఏళ్ల రాజకీయ నాయకుడు - మహారాష్ట్ర మంత్రి బాబా సిద్ధిక్ హత్యకు కూడా తామే కారణమని ఈ గ్యాంగ్ పేర్కొంది. గ్యాంగ్‌స్టర్ బిష్ణోయ్‌కు భాయ్‌తో చాలా కాలంగా వైరం ఉంది. గతంలో సల్మాన్ ని చంపేస్తామని పలుమార్లు బెదిరించాడు. సల్మాన్ నల్ల జింకలను చంపినందున క్షమాపణలు చెప్పాలని ఇప్పటికీ కోరుతున్నారు. కానీ సల్మాన్ సారీ చెప్పడం లేదు.
1998లో కృష్ణ జింకల్ని చంపిన తర్వాత సల్మాన్ కి వరుస బెదిరింపులు ఎదురయ్యాయి. జింకల్ని తుపాకితో వేటాడిన కేసులో ఖాన్ ను దోషిగా తేల్చాక బిష్ణోయ్ అతడిని వెంటాడుతూనే ఉన్నాడు. ఈ సంవత్సరం ప్రారంభంలో వర్లిలోని ముంబై ట్రాఫిక్ విభాగానికి పంపిన వాట్సాప్ సందేశం లో సల్మాన్ కు హత్యా బెదిరింపు వచ్చింది. బెదిరింపు మెసేజ్‌లో నిందితుడు నేరుగా నటుడి ఇంట్లోకి ప్రవేశించి అతడి కారును బాంబుతో పేల్చి చంపేస్తామని హెచ్చరించాడు.