హారర్ కామెడీ `స్త్రీ 2` గ్రాండ్ సక్సెస్ తరవాత శ్రద్ధా కపూర్ పేరు ప్రతిచోటా మారుమోగింది. ఏక్తా కపూర్ కొత్త ప్రాజెక్ట్ కోసం సంతకం చేసిందని కథనాలొచ్చాయి. లాభాలలో వాటాతో పాటు రూ. 17 కోట్లు అడుగుతున్నట్లు గుసగుసలు వినిపించాయి. కానీ ఇప్పుడు పరిస్థితులు అకస్మాత్తుగా మలుపు తిరిగాయి.
పేమెంట్ మ్యాటర్స్ లో సమస్య తలెత్తడంతో శ్రద్ధా నిర్ధాక్షిణ్యంగా ఈ ప్రాజెక్టుకు నో చెప్పిందని తెలిసింది. అయితే శ్రద్ధా టూమచ్ కాస్ట్ లీగా ఉందని ఏక్తా భావించిందని కథనాలొస్తున్నాయి. ముఖ్యంగా ఇది నాయికా ప్రధాన చిత్రం కాబట్టి అంత పెద్ద మొత్తం ఒకే పాత్రధారికి చెల్లిస్తే, బడ్జెట్‌ను దెబ్బతీస్తుందని నిర్మాత ఏక్తా భయపడ్డారట.
ప్రస్తుతం ఈ పాత్ర కోసం నిర్మాతలు వెతుకుతున్నారని తెలిసింది. శ్రద్ధా స్థానంలో నటింపజేసేందుకు ఇప్పటికే ఒక అగ్ర నటితో చర్చలు జరుపుతున్నారని తెలుస్తోంది. ఈ చిత్రానికి `తుంబాద్` ఫేం రాహి అనిల్ బార్వే దర్శకత్వం వహిస్తారు. ఈ హై-కాన్సెప్ట్ థ్రిల్లర్ వివరాలు ఇంకా బహిర్గతం కాలేదు.