గత కొన్ని నెలలుగా పెద్ద సినిమాలు లేక థియేటర్స్ వెల వెల బోతున్నాయి. థియేటర్ యజమానులు కూడా రెంట్ పద్దతిలో థియేటర్స్ ని రన్ చెయ్యలేక గగ్గోలు పెడుతున్నారు. అద్దె చెల్లింపు పద్దతిలో థియేటర్స్ రన్ చేయలేమని చెబుతున్నారు. తాజాగా తెలుగు రాష్ట్రాల్లో ఎగ్జిబిటర్లు(థియేటర్ ఓనర్లు) కీలక నిర్ణయం తీసుకున్నారు.
ఈరోజు ఆదివారం తెలుగు ఫిల్మ్ ఛాంబర్ లో తెలంగాణ, ఆంధ్రా ఎగ్జిబిటర్ల సంయుక్త సమావేశం నిర్వహించారు, ఈ సమావేశానికి హాజరైన 65 మంది ఎగ్జిబిటర్లు అద్దె ప్రాతిపదికన సినిమాలను ప్రదర్శించలేమని తేల్చి చెప్పడం హాట్ టాపిక్ అయ్యింది. ఎగ్జిబిటర్ల నిర్ణయాన్ని ప్రొడ్యూసర్ కౌన్సిల్, ప్రొడ్యూసర్ గిల్డ్ లకు తెలపనున్న తెలుగు ఫిలిం ఛాంబర్.
ఒకవేళ ప్రొడ్యూసర్లు తమకు సహకరించకపోతే జూన్ 1 నుంచి సినిమా థియేటర్లు బంద్ చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ ఎగ్జిబిటర్లు సమావేశానికి దిల్ రాజు, సురేష్ బాబు కూడా హాజరయ్యారు. ఇప్పటికే పెద్ద సినిమాలు లేక బోర్ కొడుతున్న ప్రేక్షకులకు జూన్ నుంచి భారీ బడ్జెట్ సినిమాల హడావిడి మొదలు కానున్న తరుణంలో ఇలా ఎగ్జిబిటర్లు థియేటర్స్ బంద్ చేస్తామని చెప్పడం మూవీ లవర్స్ కు షాక్ తగిలేలా చేసింది.