తెలుగు చిత్రసీమలో అద్భుతమైన రచయితలలో ఒకరిగా దివంగత లిరిసిస్ట్ సిరివెన్నెల ప్రత్యేకత గురించి పరిచయం అవసరం లేదు. ఉత్తమ పాటల రచయితగా జాతీయ అవార్డులు అందుకున్న మేటి సృజకుడు ఆయన. ముఖ్యంగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహించిన చాలా సినిమాలకు చార్ట్ బస్టర్ పాటల్ని అందించారు. అలాగే సిరివెన్నెలకు ఆయన అత్యంత సన్నిహిత బంధువు అన్న సంగతి తెలిసిందే.
కొన్నేళ్ల క్రితం సిరివెన్నెల పనితనం గురించి త్రివిక్రమ్ శ్రీనివాస్ చేసిన ఓ ప్రసంగం అహూతుల మనసులను దోచుకోవడమే గాక యూట్యూబ్ లోను మిలియన్ల వీక్షణలతో సంచలనం సృష్టించింది. అయితే ఆ స్పీచ్ ప్రజల్ని అంతగా ఆకర్షించడానికి కారణం, అందులోని భావోద్వేగం. సిరివెన్నెలపై అపరిమితమైన ప్రేమ, అభిమానంతో అతడు చేసిన వ్యాఖ్యానం.
ఇటీవల ఓ టీవీచానల్ కార్యక్రమంలో మరోసారి ఆ స్పీచ్ అంతగా అందరికీ కనెక్టవ్వడానికి కారణాలను త్రివిక్రమ్ విశ్లేషించారు. నిజానికి తాను సిరివెన్నెలను ప్రశంసించానని ప్రజలు అనుకున్నారు. కానీ నేను ఆయనపై నిరాశను వ్యక్తం చేసాను. ఆయన పనికి తగ్గ అవకాశాలు అందుకోలేదని గుర్తు చేసినట్టు త్రివిక్రమ్ తెలిపారు. పాటను సింప్లిఫై చేయాల్సిందిగా సిరివెన్నెలను మేకర్స్ బలవంతం చేసిన సందర్భాలున్నాయని, అయినా అతడు రాజీ అన్నదే లేకుండా పని చేసారని, మెప్పించారని కూడా త్రివిక్రమ్ అన్నారు. పాటలు రాసే అవకాశాల్లేక తీరిగ్గా ఉన్న సిరివెన్నెల పరిస్థితిని కూడా త్రివిక్రమ్ గుర్తు చేసారు. ఆయన స్థాయికి తగ్గ అవకాశాలు రాలేదు ఆరోజు.. కేవలం గీతరచయితగానే కాదు, చాలా ఇతర సృజనాత్మక ప్రక్రియల్లోను ఆయన రాణించగలరని త్రివిక్రమ్ వెల్లడించారు. తాజాగా త్రివిక్రమ్ చేసిన వ్యాఖ్యలు మరోసారి అందరినీ ఆకర్షించాయి.