`ది లంచ్ బాక్స్` సినిమాతో పవర్ ప్యాక్డ్ పెర్ఫామర్ గా నిరూపించిన నిమ్రత్ కౌర్ కెరీర్ లో ప్రయోగాత్మక చిత్రాలతో తనకంటూ ఒక గుర్తింపును తెచ్చుకుంది. ఈ బ్యూటీ ప్రస్తుతం సౌత్ లోను నటించేందుకు మేకర్స్ కి ఫీలర్స్ వదులుతోంది. నిమ్రత్ గత కొంతకాలంగా వ్యక్తిగత జీవితం కారణంగా మీడియా హెడ్ లైన్స్ లో కొస్తోంది. ఈ పంజాబీ బ్యూటీ నటుడు అభిషేక్ బచ్చన్ తో అత్యంత సన్నిహితంగా ఉంటోందని, దీనివల్ల ఐశ్వర్యారాయ్ తో అభిషేక్ కి సమస్యలు వచ్చాయని కథనాలొచ్చాయి.
ఇదిలా ఉండగానే, ప్రస్తుత ఇండియా- పాక్ యుద్ధం నేపథ్యంలో నిమ్రత్ తన వ్యక్తిగత జీవితంలోని ఒక విషాదకర ఘటనను తలచుకుని కలతకు గురైంది. నిమ్రత్ 1994 శీతాకాలంలో తన తండ్రిని కశ్మీర్ లోని ఉగ్రవాదులు అపహరించి హత్య చేసిన దారుణ ఘటనను గుర్తు చేసుకుని తీవ్రంగా ఆవేదన చెందింది. కశ్మీర్ బార్డర్ లో వెరినాగ్ అనే ప్రాంతంలో విధులు నిర్వహిస్తున్న తన తండ్రిని హిజుబుల్ ముజాహుద్దీన్ ఉగ్రవాదులు అపహరించారు. ఆ సమయంలో తన కుటుంబంతో తండ్రి చెంతకు వెళ్లిన నిమ్రత్ దీనిని జీర్ణించుకోలేకపోయింది.
వారం రోజుల పాటు మేజర్ సింగ్ ని దారుణంగా హింసించిన ఉగ్రవాదులు, అసమంజసమైన డిమాండ్లతో వేధించి విసిగించి చివరికి అతడిని చంపేయడంతో అది ఆ కుటుంబంలో తీవ్ర విషాదం నింపింది. దేశవ్యాప్తంగా ప్రజల్ని ఈ ఘటన రగిలించింది. ఆ విషాదం తర్వాత నిమ్రత్ ఇక ఎప్పటికీ కశ్మీర్ వెళ్లకూడదని నిర్ణయించుకుంది. కానీ ది లంచ్ బాక్స్ విడుదలైన తర్వాత కశ్మీర్ వెరినాగ్ లో తన తండ్రి విధులు నిర్వర్తించిన ప్రదేశానికి వెళ్లింది. అక్కడ తన తండ్రి తో ఉన్నప్పటి జ్ఞాపకాలను రీకాల్ చేసుకుంది. ఇప్పుడు మరోసారి యుద్ధవాతావరణం లో ఉన్న సమయంలో నిమ్రత్ తన తండ్రి గురించి తలచుకుని ఆవేదన చెందింది. ముష్కర పాకిస్తాన్ పై ఆపరేషన్ సిందూర్ విజయవంతం అవ్వడంపై ఆనందం వ్యక్తం చేసింది. విధులు నిర్వర్తిస్తూ తీవ్రవాద ఘాతుకానికి బలైన మేజర్ సింగ్ ని గౌరవిస్తూ దివంగతుడైన ఆయనకు ప్రభుత్వం శౌర్య చక్ర పురస్కారం అందించింది.
కెరీర్ పరంగా చూస్తే...నిమ్రత్ కౌర్ ఇటీవల ఓటీటీ సిరీస్ లలో అవకాశాలు అందుకుంటోంది `కుల్: ది లెగసీ ఆఫ్ ది రైజింగ్స్`లో నటించింది. ఈ సిరీస్ జియోహాట్‌స్టార్‌లో అందుబాటులో ఉంది. దీంతో పాటు సెక్షన్ 84 లోను నటించింది. పెద్ద తెర కోసం కొన్ని కథలను ఫైనల్ చేసిందని కథనాలొస్తున్నాయి.