పాకిస్తాన్‌తో ఇండియా వార్ నేపథ్యాన్ని అడ్డు పెట్టుకుని బాంబే హైకోర్టులో తమ వాదనల్ని బలపరుచుకోవాలనుకున్న మడాక్ ఫిలింస్ కి పెద్ద ఎదురు దెబ్బ తగిలింది. పీవీఆర్ తో ఒప్పందాన్ని మీరి ఓటీటీలో అకస్మాత్తుగా `భూల్ చుక్ మాఫ్`ని రిలీజ్ చేయాలన్న నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాల్సిందిగా కోర్టు ఆజ్ఞాపించింది.
అప్పటికే పీవీఆర్ ప్రీబుకింగులు నిర్వహించి ప్రజలకు టికెట్లు అమ్మిందని, ప్రచారం కోసం పెద్ద మొత్తంలో డబ్బును ఖర్చు చేసిందని కోర్టు వివరించింది. పీవీఆర్ తో నిర్మాతల ఒప్పంద కాలంతో సంబంధం లేకుండా, ఒప్పందం రద్దయినా ఇలా అర్థాంతరం గా థియేట్రికల్ రిలీజ్ ని ఆపేసి, ఓటీటీలో సినిమాని రిలీజ్ చేస్తాననడం సరికాదని హైకోర్టు మడాక్ కి అక్షింతలు వేసింది. నిజానికి థియేట్రికల్ రిలీజ్‌ని దాటవేసి, ఓటీటీలో భూల్ చుక్ మాఫ్ ని విడుదల చేస్తున్నామని అకస్మాత్తుగా మడాక్ సంస్థ ప్రకటించడంతో పీవీఆర్ అత్యవసర విచారణకు కోర్టును అభ్యర్థించింది. కోర్టు దీనికి అనుమతించి విచారణ చేపట్టింది. పీవీఆర్ సమర్పించిన ఆధారాలను పరిశీలించిన కోర్టు తీర్పును అనుకూలంగా వెలువరించింది.
అయితే మడాక్ సంస్థ ప్రస్తుతం ఇండియా- పాకిస్తాన్ వార్ నేపథ్యంలో సినిమాని థియేట్రికల్ గా విడుదల చేసినా జనం ఎవరూ థియేటర్లకు రాలేరని వాదించే ప్రయత్నం చేసింది. కానీ కోర్టు దానిని తోసిపుచ్చింది. ఒప్పందాన్ని ఉల్లంఘించడాన్ని తప్పు పట్టింది. ప్రస్తుతం ఓటీటీ రిలీజ్ వాయిదా పడింది. మరోవారంలో తదుపరి విచారణకు కోర్టు ఆదేశించింది. రాజ్ కుమార్ రావు నటించిన `భూల్ చుక్ మాఫ్` ఇకపై థియేట్రికల్ గా విడుదల కావాల్సి ఉంటుంది.