ప్రముఖ నిర్మాత రాకేష్ రోషన్ కుమార్తె సునైనా రోషన్ తన అనారోగ్యం, కష్టాల కడలి గురించి ఇటీవల ఓ ఇంటర్వ్యూలో చెప్పిన విషయాలు విస్మయపరిచాయి. సునైన మద్యానికి అలవాటు పడి దాని నుంచి బయటపడేందుకు ఘోరమైన తపస్సు చేసిందిట. మందు అలవాటు మాన్పించేందుకు చివరికి కుటుంబ సభ్యులు తనను పునరావాస కేంద్రానికి తరలించారని, అక్కడ కొందరు కౌన్సిలర్లు రోజు 7-8 గంటల పాటు టార్చర్ చేసేవారని తెలిపింది. ప్రతిరోజూ ప్రశ్నలతో విసిగించేవారు. శరీరంలో పేరుకుపోయిన చాక్లెట్లు, కెఫీన్, ఆల్కహాలిక్ పదార్థాలను బయటకు తీసేవారని వెల్లడించింది. 28రోజుల పాటు పునరావసకేంద్రంలో తాను అసలు నిద్రపోలేదని వెల్లడించి షాకిచ్చింది.
అంతేకాదు మందు మత్తులో ఉన్నప్పుడు కుర్చీలు బెంచీలపై నుంచి ఇంట్లో మంచంపై నుంచి కింద పడేదానిని అని కూడా సునైన గుర్తు చేసుకుంది. ఆల్కహాలిక్ సైకిల్ లో చిక్కుకున్న తర్వాత నరకయాతన అనుభవించానని వెల్లడించింది. అయితే తాను ఆల్కహాల్ కి బానిసవ్వడానికి కారణం ఒకేసారి క్యాన్సర్- క్షయ తో బాధపడ్డానని ఆ బాధ తట్టుకోలేకే మద్యం సేవించానని సునైన వెల్లడించారు. ``ప్రతి క్షణం నరకం చూసాను. చికిత్స చేసేప్పుడు ఆందోళన, దడ పుట్టుకొచ్చేవని ఆల్కహాల్ మానేయడం వల్ల అలా జరిగేద``ని కూడా తెలిపింది. ఇంతకుముందు తన సోదరుడు హృతిక్ రోషన్ క్రిష్ 4 కి దర్శకత్వం వహిస్తున్నాడని తెలియగానే ఎగిరి గంతేశానని చెప్పిన సునైన, తన తండ్రి ఎమోషన్ తట్టుకోలేక ఏడ్చేశాడని కూడా వెల్లడించింది. సునైన తండ్రి రాకేష్ రోషన్ క్యాన్సర్ కి చికిత్స పొంది బయటపడ్డారు. అలాగే హృతిక్ రోషన్ కూడా ప్రమాదకరమైన హెమటోమియా అనే వ్యాధికి గురై చికిత్సతో తనను తాను కాపాడుకున్నాడు.