అంతర్ముఖులు ఎక్కువమందిని కలవలేరు. దీనికారణంగా అవకాశాలు తగ్గిపోతాయని అన్నారు విజయ్ దేవరకొండ. ప్రతి నటుడు తమ వ్యాపార అవకాశాలకు పరిధిని విస్తరించాలనే అభిప్రాయాన్ని వ్యక్తం చేసారు. వేవ్స్ 2025 సమ్మిట్ లో కరీనా-కరణ్‌లతో పాటు చర్చా గోష్ఠిలో పాల్గొన్న విజయ్ దేవరకొండ ఒక కీలకమైన అంశంపై మాట్లాడారు.
అంతర్ముఖంగా ఉండటం వల్ల ఎక్కువమందిని కలవలేకపోవడం వల్ల అవకాశాలు తగ్గుతాయని దేవరకొండ అన్నారు. సినిమాలపై ఉత్సాహంగా ఉన్న వివిధ దేశాల వ్యక్తులను కలిశారా? అని కరణ్ ప్రశ్నించగా, తన అంతర్ముఖ స్వభావం కారణంగా కలవలేదని విజయ్ బదులిచ్చారు. చిన్న సర్కిల్‌కు మించి చాలా మందిని కలవకపోవడానికి ఈ స్వభావం ఒక కారణమని అన్నారు. నేను అలాంటివారిని చాలా అరుదుగా కలుస్తాను. నాకు చాలా చిన్న సర్కిల్ ఉంది. నేను చాలా తక్కువగా బయటకు వెళ్తాను.. అలా తల దించుకుని నడుస్తాను.. అని విజయ్ అన్నాడు.
అలాగే కమ్యూనికేషన్ భాషగా ఇంగ్లీషును ఉపయోగించడం పశ్చిమ దేశాలకు అదనపు శక్తిగా ఎలా పనిచేసిందో కూడా దేవరకొండ చెప్పారు. హాలీవుడ్‌లో బ్రాడ్ పిట్ వంటి నటుడికి తన కంటే 100 రెట్లు ఎక్కువ జీతం రావడానికి కారణం ఆంగ్ల భాషలో సినిమాలను చూసే ప్రేక్షకులు అధికంగా ఉండటమేనని అన్నారు. నేను సినిమా చేస్తాను.. బ్రాడ్ చేస్తాడు.. కానీ అతడికి ఎక్కువ పారితోషికం లభిస్తుందని అన్నాడు. వేతన వ్యత్సాసానికి కారణం కమ్యూనికేషన్ అని కూడా హైలైట్ చేసాడు. అయితే ప్రజలు భారతీయ భాషల సినిమాల కంటే ఆంగ్ల సినిమాలను చూడటానికి ఇష్టపడడాన్ని విజయ్ విమర్శించాడు.