ఇటీవల హిందీ సినిమాలు ఆడకపోవడంపై బిగ్ డిబేట్ నడుస్తోంది. వేవ్స్ 2025 సమావేశాల్లో అమీర్ ఖాన్ కి దీనిపై ప్రశ్న ఎదురైంది. అసలు సినిమాలు ఆడకపోవడానికి కారణమేమిటో చెప్పాలని మీడియా ప్రశ్నించింది. దానికి స్పందించిన సినీదిగ్గజం, అగ్రనిర్మాత అమీర్ ఖాన్ ఈ వెనకబాటుకు రెండు ప్రధాన కారణాలున్నాయని విశ్లేషించారు.
వీటిలో ఓటీటీల రాక థియేట్రికల్ రంగానికి ముప్పుగా మారిందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేసారు. సినిమా విడుదలకు, ఓటీటీ రిలీజ్ కి మధ్య గ్యాప్ చాలా తక్కువగా ఉందని, కేవలం 45 రోజుల్లోనే ఓటీటీల్లో సినిమాని స్ట్రీమింగ్ చేసేప్పుడు ప్రజలు థియేటర్లకు ఎందుకు వస్తారని అన్నారు. మన వ్యాపారాన్ని మనమే చంపుకున్నామని ఆవేదన వ్యక్తం చేసారు. దీనితో పాటు, అమెరికా, చైనాలతో పోలిస్తే భారతదేశంలో థియేటర్ల సంఖ్య చాలా తక్కువగా ఉందని అన్నారు. ప్రజలకు థియేటర్లు అందుబాటులో లేనప్పుడు సినిమాలను చూడలేరని విశ్లేషించారు. థియేట్రికల్ రంగంలో పెట్టుబడులు పెట్టాల్సిన అవసరం ఉందని నొక్కి చెప్పారు. దేశంలో కనీసం 10వేల థియేటర్లు కూడా అందుబాటులో లేవు. దశాబ్ధాలుగా ఇదే దురదృష్టకర పరిస్థితి ఉందని అమీర్ అభిప్రాయపడ్డారు.
అయితే అమీర్ ఖాన్ మాత్రమే కాదు... కింగ్ ఖాన్ షారూఖ్ కూడా ప్రజలకు థియేటర్లు మరింతగా అందుబాటులోకి రావాలని అన్నారు. చిన్న పట్టణాలలో థియేటర్ల సంఖ్య పెరిగితే ప్రజలు ఎక్కువగా విజిట్ చేస్తారని అభిప్రాయపడ్డారు. అయితే అమీర్ ఖాన్ కానీ, షారూఖ్ కానీ ఈ రంగంలో పెట్టుబడులు పెట్టేందుకు తమ వంతు ప్రయత్నాలు ఏం చేస్తారో చెప్పలేదు. పీవీఆర్ ఐనాక్స్ లేదా ఏషియన్ సినిమాస్ లేదా ఇతరులు ఎగ్జిబిషన్ రంగం సానుకూలంగా లేకపోవడంతో స్క్రీన్లు తగ్గించడంతో పాటు, వేరే ఆదాయ మార్గాలను అన్వేషించడం ఇటీవల చర్చగా మారింది. ఇందుకు భిన్నంగా అమీర్, షారూఖ్ తమ అభిప్రాయాల్ని వెలిబుచ్చారు.