వేవ్స్ సమ్మిట్ 2025 ఉత్సవాల్లో టాలీవుడ్ నుంచి దిగ్గజ సెలబ్రిటీలు పాల్గొన్న సంగతి తెలిసిందే. ఈ ఉత్సవాల్లో దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ వేదికపై రాజమౌళి మాట్లాడుతూ..భారతీయ సినిమా కథలకు అవసరమైన సరంజామా మన పురాణేతిహాసాల్లో ఎంతో ఉందని అన్నారు. మన దేశంలో చాలా భాషలు ఉన్నాయి. ప్రతి భాషకు వందల సంవత్సరాల చరిత్ర ఉంది. మన చరిత్రల నుండి లక్షలాది కథలు ఉన్నాయి.
మనకు లెక్కలేనన్ని కళారూపాలు ఉన్నాయి. కాబట్టి వందలు కాదు.. బిలియన్ల కథలు మనకు ఉన్నాయి. అనంతంగా మనం సినిమాల్ని తెరకెక్కించవచ్చని రాజమౌళి అన్నారు. భారతదేశంలోని వైవిధ్యభరితమైన భాషల గొప్పతనాన్ని ప్రశంసిస్తూనే, ప్రతి ఒక్కటి శతాబ్దాల చరిత్ర కలిగి ఉన్నాయని మన దేశ శక్తివంతమైన కళల సంస్కృతికి ప్రపంచంలో మరే దేశం సరిపోలలేదని రాజమౌళి అన్నారు.
ముంబైలో జరుగుతున్న వేవ్స్ కార్యక్రమంలో రాజమౌళితో పాటు, మెగాస్టార్ చిరంజీవి, సూపర్ స్టార్ రజనీకాంత్, కింగ్ నాగార్జున, మోహన్‌లాల్, నాగ చైతన్య, శోభితా ధూళిపాల తదితరులు పాల్గొన్నారు. మే 1 న ముంబైలో వేవ్స్ ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. నాలుగు రోజుల పాటు ఈ ఉత్సవాలు సాగనున్నాయి. ప్రపంచ ఆడియో విజువల్ అండ్ ఎంటర్‌టైన్‌మెంట్ సమ్మిట్ (WAVES) లో ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీప్రముఖులు పాల్గొంటున్నారు.