సూపర్ స్టార్ రజనీకాంత్ తన వ్యక్తిత్వం, క్రమశిక్షణతో ఎప్పుడూ ప్రేరణగా నిలుస్తారు. ఆయనలోని ఆధ్యాత్మికత, నిబద్ధత ఇంత పెద్ద స్థాయికి చేర్చాయనడంలో సందేహం లేదు. ఇప్పుడు అతడు భారతీయ యువతరానికి దిశానిర్ధేశనం చేస్తూ ఇచ్చిన స్పీచ్ సర్వత్రా చర్చనీయాంశమైంది. ఆయన ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ.. పశ్చిమ దేశాల ప్రజలు శాంతి, ప్రేరణ కోసం భారతీయ సంస్కృతి వైపు ఆకర్షితులవుతుంటే మన యువత పాశ్చాత్యం వైపు ఆకర్షితులవుతున్నారని ఆవేదన చెందారు. చెన్నైలో తన భార్య లతా రజనీకాంత్ నిర్వహించిన కార్యక్రమంలో వీడియో కాల్ లో మాట్లాడిన రజనీ పై విధంగా స్పందించారు.
నేటి మొబైల్ ఫోన్ల యుగంలో భారతీయ సంస్కృతి సాంప్రదాయాల గురించి మన యువతరం, పెద్దలకు కూడా కొన్ని విషయాలు తెలియలేదని రజనీ అన్నారు. మన దేశ గొప్పతనం వైభవం గురించి తెలియకుండానే పాశ్చాత్య సంస్కృతిని అనుసరిస్తారని ఆయన బాధను వ్యక్తం చేసారు. పాశ్చాత్యులు తమ సొంత సంస్కృతిలో శాంతిని గౌరవాన్ని పొందలేక భారతీయ ఆచారాల్ని పాటిస్తున్నారని అన్నారు.
ధ్యానం, యోగా, సహజ జీవనాన్ని విదేశీయులు అభ్యసిస్తుంటే మనం పాశ్చాత్య పిచ్చి పోకడలకు పోతున్నామని అన్నారు. లత ఇప్పుడు ఎలాంటి జీవనం ముఖ్యమో అవగాహన కల్పించడానికి ప్రయత్నిస్తోందని అన్నారు. కెరీర్ పరంగా రజనీకాంత్ నటించిన కూలీ విడుదలకు రావాల్సి ఉంది. లోకేష్ కనగరాజ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. తదుపరి జైలర్ 2లోను రజనీ నటిస్తున్నారు.