ప్రముఖ నిర్మాణ సంస్థ సురేష్ ప్రొడక్షన్స్ కి సుప్రీం కోర్టు షాక్ ఇచ్చింది. విశాఖ రామానాయుడు స్టూడియో భూముల వ్యవహారంపై ఏపీ ప్రబ్బుత్వం ఇచ్చిన షోకాజ్ నోటీసులను ఛాలెంజ్ చేస్తూ సురేష్ ప్రొడక్షన్స్ సంస్థ మధ్యంతర ఉత్తర్వుల కోసం సుప్రీం కోర్టుని ఆశ్రయించగా.. పిటిషన్‍లో జోక్యం చేసుకునేందుకు సుప్రీంకోర్టు ధర్మాసనం నిరాకరించడమే కాదు, మధ్యంతర ఉపశమనం కుదరదని తేల్చి చెప్పింది.
ఫిల్మ్ సిటీ డెవలప్మెంట్ కోసం కేటాయించిన భూములను, ఇతర అవసరాలకు అంటే ఇతర కట్టడాలకు కూడా వాడుకోవచ్చని గత జగన్ ప్రభుత్వం అనుమతులు ఇవ్వడంతో రామానాయుడు స్టూడియోస్ లో సురేష్ ప్రొడక్షన్స్ సంస్థ ఇతర నిర్మాణాలను చేపట్టింది.
దానితో గత ప్రభుత్వ నిర్ణయంపై కూటమి ప్రభుత్వం షోకాజ్ నోటీసులు ఇచ్చింది, అంతేకాకుండా జగన్ ప్రభుత్వ నిర్ణయాన్ని ఎందుకు రద్దు చేయకూడదో చెప్పాలని సురేష్ ప్రొడక్షన్స్ కి ఏపీ ప్రభుత్వం షోకాజ్ నోటీసులు జారీ చేసింది. దానితో సురేష్ ప్రొడక్షన్స్ సంస్థ సుప్రీం కోర్టుకి వెళ్లి స్టే ఇవ్వమని కోరగా.. నేడు విచారణ జరిపిన జస్టిస్ అభయ్ ఎస్ ఓకా ధర్మాసనం.. పిటిషన్లో జోక్యం చేసుకునేందుకు నిరాకరించింది, అలాగే స్టే ఇవ్వడం కుదరదని తేల్చి చెప్పింది.
ఈ తీర్పుతో రామానాయుడుకి స్టూడియోకి కేటాయించిన భూములను కూటమి ప్రభుత్వం స్వాధీనం చేసుకునేందుకు సుప్రీం కోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లైంది.