ఎస్ ఎస్ ఎంబీ 29 సినిమా షూటింగ్ ప్రస్తుతం ఒడిశాలో జరుగుతోంది. రాజమౌళి సెట్‌ను ముందుగానే సిద్ధం చేసుకుని ముఖ్యమైన సన్నివేశాల్ని చిత్రీకరించడం మొదలుపెట్టారు. ఇప్పుడు మహేష్ బాబు కూడా బుధవారం అక్కడకు చేరుకున్నారు. ఆయనతో పాటు మలయాళ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ కూడా ఉన్నారు.
ఈ సినిమాలో పృథ్వీరాజ్ నటిస్తారా? లేదా? అనేదానిపై ఇప్పటివరకు స్పష్టత రాలేదు. కానీ ఆయన ఒడిశాలో మాహేశ్ తో కనిపించడంతో సినిమాలో ఆయన పాత్ర ఉన్నట్టే అని అర్థమైంది. ఈ షెడ్యూల్ ఈ నెల 28 వరకు కొనసాగుతుంది. తోలోమాలి, దేవ్ మాలి, మాచ్ ఖండ్ లాంటి ప్రాంతాల్లో కొన్ని ముఖ్యమైన సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. అందుకోసం అక్కడ ప్రత్యేకంగా సెట్లు కూడా వేశారు. త్వరలో మిగతా నటీనటులు కూడా షూటింగ్ కోసం అక్కడ చేరుకుంటారు.
మహేష్ బాబు చాలా కాలం తర్వాత అడవుల్లో సినిమా చేస్తున్నారనే విషయం ఫ్యాన్స్‌కి ఆసక్తికరంగా మారింది. గతంలో సైనికుడు సినిమా కోసం కొంతకాలం కొండలు, లోయలు కలిగిన ప్రాంతాల్లో షూటింగ్ జరిగింది. అప్పటి నుంచి మహేష్ ఈ తరహా నేచురల్ లొకేషన్లలో సినిమా చేయలేదు. కానీ ఇప్పుడు రాజమౌళి సినిమా కావడంతో మళ్లీ అడవుల్లో షూటింగ్ చేయాల్సి వచ్చింది.
ఈసారి మాత్రం సినిమా మొత్తం అడవుల నేపథ్యంలో సాగనుంది. ఇది పూర్తిగా ఓ అడ్వెంచర్ థ్రిల్లర్ సినిమా. కథ ప్రకారం ఎక్కువ భాగం ఆఫ్రికా అడవుల్లోనే చిత్రీకరణ చేయాల్సి ఉంటుంది. అందుకే ఆఫ్రికాలోని కొన్ని ముఖ్యమైన లొకేషన్లు ఇప్పటికే ఎంపిక అయ్యాయి. ఒడిశా షెడ్యూల్ ముగిసిన తర్వాత చిత్ర బృందం అక్కడికి వెళ్లే అవకాశం ఉంది.
ఇక రామోజీ ఫిలిం సిటీలో కూడా కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరించనున్నారు. ఈ సినిమా కోసం అడవిని పోలి ఉండేలా భారీ సెట్లు నిర్మిస్తున్నారు. మొత్తంగా చూస్తే మహేష్ ఈ సినిమా పూర్తయ్యే వరకు పూర్తిగా అడవుల్లోనే ఉండాల్సిన పరిస్థితి. అంటే ఓ రెండేళ్లపాటు మహేష్ ఫ్యాన్స్ కి పూర్తిగా దర్శనమివ్వరేమో. షూటింగ్ కి వెళ్ళేటప్పుడు ఏ ఎయిర్ పోర్ట్ లోనో కనిపిస్తారంతే. ఈ సినిమా బిగ్ స్క్రీన్‌పై అదిరిపోయే విజువల్స్‌తో ప్రేక్షకుల్ని మెస్మరైజ్ చేయనుంది.