రాజకీయ నాయకుల గురించి చెప్పేదేముంది? ఏ పని చేసినా కూడా అందులో రాజకీయ కోణమైతే తప్పని సరిగా ఉంటుంది. ముఖ్యంగా యూత్‌ను ఆకట్టుకునేందుకు నాయకులు బాగా యత్నిస్తుంటారు. వారిని పడేస్తే చాలు.. ఆటోమేటిక్‌గా ఓట్లు ఆ నేత ఖాతలో జమై పోతాయి. మరి ఈ ఆలోచనతో చేశారో మరొకటో కానీ ఏపీ సీఎం జగన్మోహన్‌రెడ్డి ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో ఏపీకి ఒక జట్టు ఉండాలని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అభిప్రాయపడ్డారు. తద్వారా ఏపీకి కావల్సినంత పేరు కూడా వస్తుంది. అయితే ఆయన ఆశ నెరవేరే సూచనలు ఏమీ కనిపించడం లేదు.
ఆంధ్రప్రదేశ్‌కు ఓ ఫ్రాంచైజీ జట్టు ఉంటే.. రాష్ట్రంలోని ఆటగాళ్లకు మంచి అవకాశాలు వస్తాయని ఏపీ ముఖ్యమంత్రి జగన్ భావిస్తున్నారు. కానీ అది ఆచరణకు నోచుకోవడం కాస్త కష్టంగానే కనిపిస్తోంది. దీనికి కారణం లేకపోలేదు. నిజానికి ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ ఏర్పాటై 70 ఏళ్లు పూర్తయ్యాయి. ఈ నేపథ్యంలో విశాఖలో 70వ వార్షికోత్సవ వేడుక జరిగింది. ఈ కార్యక్రమానికి బీసీసీఐ అధ్యక్షుడు, 1983 వరల్డ్ కప్ విజేత జట్టు సభ్యుడు రోజర్ బిన్నీ, టీమిండియా మాజీ దిగ్గజం మదన్‌లాల్ హాజరయ్యారు. ఈ సందర్భంగా రోజర్ బిన్నీ.. తన రంజీ ట్రోఫీ రోజులను ముఖ్యంగా విశాఖపట్నంలోని రైల్వే స్టేడియంలో ఆంధ్ర జట్టుతో ఆట ఆడినప్పటి జ్ణాపకాలను గుర్తు చేసుకున్నారు.
ఆంధ్రా క్రికెట్ సంఘం ప్రోత్సాహం మాటల్లో చెప్పలేనిదని.. ఆ ప్రోత్సాహంతోనే ఏపీ క్రికెటర్లు జాతీయ స్థాయిలో సత్తా చాటుతున్నారని రోజర్ బిన్నీ తెలిపారు. అయితే ఈసారికి మాత్రం కొత్త ఫ్రాంచైజీకి అవకాశం లేదని తేల్చి చెప్పారు. ఈ లీగ్‌కు ప్రపంచ వ్యాప్తంగా బీభత్సమైన పాపులారిటీ ఉందని.. కాబట్టి ఐపీఎల్ ప్రమాణాలను పాటించడంలో భాగంగా లీగ్‌లో పాల్గొనే ఫ్రాంచైజీల సంఖ్య మీద నియంత్రణ ఉండాలన్నారు. ఈ క్రమంలోనే ఇప్పట్లో కొత్త ఫ్రాంచైజీకి అవకాశం లేదని రోజర్ బిన్నీ తేల్చి చెప్పారు. దీంతో ఏపీ సీఎం జగనే కాదు.. ఆంధ్ర క్రికెట్ అభిమానులు తీవ్ర నిరాశకు గురయ్యారు.