14 వేల మంది సినీకార్మికుల కుటుంబాలకు తలసాని ట్రస్ట్ ద్వారా నిత్యావసరాల సరుకుల పంపిణీ ప్రారంభం
సినీ-టీవీ కార్మికులకు సాయం అందించేందుకు వచ్చిన తెలంగాణ రాష్ట్ర సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్, తలసాని సాయికిరణ్ యాదవ్ ముందుకు వచ్చారు. 14 వేల మంది సినీకార్మికుల కుటుంబాలకు తలసాని ట్రస్ట్ ద్వారా నిత్యావసరాల సాయం ఈ కార్యక్రమాన్ని గురువారం ఉదయం ప్రారంభించారు. వారిలో 12 వేల మంది సినీ, 2 వేల మంది టీవి కార్శికులకు మొత్తం 14 వేల మందికి నిత్యావసరాల పంపిణీ అన్నపూర్ణ 7ఎకర్స్‌లో ప్రారంభమైంది. సినీ ప్రముఖులు అక్కినేని నాగార్జున, రాజమౌళి, త్రివిక్రమ్, దిల్ రాజు, కొరటాల శివ, రాధాకృష్ణ, రామ్ మోహనరావు, తలసాని సాయి, ఎన్.శంకర్ , సి.కళ్యాణ్ చేతులమీదుగా కార్మిక యూనియన్ నాయకుల ద్వారా నిత్యావసర వస్తువులను అందించారు. ఈ కార్యక్రమంలో మెగాస్టార్ చిరంజీవి పాల్గొనాల్సి ఉండగా కారణాంతరాన ఆయన రాలేకపోయారు. ఈ సందర్భంగా ఒక వీడియో సందేశాన్ని పంపారు.
తలసాని గారి కృషి అభినందనీయం: మెగాస్టార్ చిరంజీవి
మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ.. ‘‘మా మిత్రులు, శ్రేయోభిలాషులు మన సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ గారు తలసాని సేవా ట్రస్ట్ ద్వారా 14 వేల మంది సినీ-టీవీ కార్మికుల్ని ఆదుకునేందుకు ముందుకు వచ్చినందుకు సంతోషం. కేవలం సినీరంగంలోని వారే కాకుండా టీవీ రంగంలోని వారికి సాయం చేస్తుండడం మంచి విషయం. సినీపరిశ్రమ తరపున ధన్యవాదాలు. నిజానికి ఈరోజు కార్యక్రమానికి నేను కూడా హాజరు కావాల్సి ఉంది. కానీ సమీప బంధువులు చనిపోవడం వల్ల రాలేకపోయాను. పరిశ్రమకు కష్ట కాలంలో తలసాని గారి కృషి అభినందనీయం. గత నెలలో సీసీసీ ద్వారా నిత్యావసరాల సాయం అందించిన విషయం తెలిసిందే. పరిశ్రమకు ప్రభుత్వానికి సంధాన కర్తలుగా కావాల్సిన సాయం అందిస్తున్న ఆయన ఇప్పుడిలా సేవా కార్యక్రమం చేయడం సంతోషాన్ని కలిగిస్తోంది. కష్టకాలంలోనూ అన్నివిధాలా చేదోడువాదోడుగా ఉంటున్నందుకు ప్రత్యేక కృతజ్ఞతలు’’ అని అన్నారు.