మాకు కడుపు నిండిపోయింది: అల్లు అరవింద్

Ala Vaikunthapurramuloo Success Celebrations Highlights

Mon 20th Jan 2020 03:20 PM
Advertisement
ala vaikunthapurramuloo,success celebrations,trivikram srinivas,allu arjun,allu aravind,pooja hegde,ss thaman  మాకు కడుపు నిండిపోయింది: అల్లు అరవింద్
Ala Vaikunthapurramuloo Success Celebrations Highlights మాకు కడుపు నిండిపోయింది: అల్లు అరవింద్
Advertisement

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కథానాయకుడిగా, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ డైరెక్ట్ చేసిన ‘అల.. వైకుంఠపురములో’ సినిమా బాక్సాఫీస్ దగ్గర రికార్డుల్ని బద్దలుకొడుతూ దూసుకుపోతోంది. పూజా హెగ్డే నాయికగా నటించిన ఈ చిత్రాన్ని అల్లు అరవింద్, ఎస్. రాధాకృష్ణ (చినబాబు) సంయుక్తంగా నిర్మించారు. మొదటి వారంలోనే ‘అల వైకుంఠపురములో’ మూవీ 180 కోట్ల రూపాయల గ్రాస్ వసూలు చేసి ఆల్ టైమ్ నాన్-బాహుబలి2 రికార్డుల్ని సృష్టించింది. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని చిత్ర బృందం ఆదివారం సాయంత్రం వైజాగ్ లో గ్రాండ్ సక్సెస్ సెలబ్రేషన్స్ నిర్వహించింది.

ఈ ఉత్సవంలో ఆర్ట్ డైరెక్టర్ ఎ.ఎస్. ప్రకాష్ మాట్లాడుతూ.. ‘‘ఆర్ట్ డైరెక్టర్‌గా నా మొదటి సినిమా ‘ఆర్య’. మళ్లీ ఇన్నాళ్లకు అల్లు అర్జున్ సినిమాకు పనిచేసే అవకాశం వచ్చింది. ఈ సినిమాకు నేను వేసిన సెట్స్ అందరికీ నచ్చినందుకు హ్యాపీ’’ అన్నారు.

నటుడు అజయ్ మాట్లాడుతూ.. ‘‘ఈ సినిమా ఒక మ్యాజిక్. ప్రతి డైలాగ్, ప్రతి సీన్ నాకు చాలా బాగా నచ్చాయి. బన్నీ ఈ సినిమాని తన భుజాలపై మోసుకువెళ్లారు’’ అని తెలిపారు.

ఏపీ టూరిజం మినిస్టర్ అవంతి శ్రీనివాస్ మాట్లాడుతూ.. ‘‘బాహుబలి తర్వాత బిగ్గెస్ట్ హిట్ కొట్టిన చినబాబు‌గారు తనపేరును పెదబాబుగా మార్చుకోవాలి. అలాగే మా గురువు, బావగారు అల్లు అరవింద్‌గారు బన్నీ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ ఇచ్చారు. మొన్న ఆడియో ఫంక్షన్‌లో బన్నీ గారు చెప్పినట్లు అరవింద్‌గారు ఒక లెజెండరీ పర్సనాలిటీ. ఇన్ని సంవత్సరాలు సినిమా రంగంలో ఉండటం, ఇన్ని విజయవంతమైన సినిమాలు నిర్మించడం, అదురూబెదురూ లేని జీవనప్రయాణం సాగించడం ఆయన తల్లితండ్రులు చేసిన పుణ్యం. మెగా అభిమానులకు చిరంజీవి‌గారు దేవుడైతే, అరవింద్‌గారు క్షేత్ర పాలకుడులాంటివారు. చిరంజీవి‌గారి జర్నీలో అరవింద్ గారి పాత్ర ఎంతో కొంత ఉంది. ఒక రైటర్ డైరెక్టర్ అయితే ఎలా ఉంటుందో ఇదివరకు దాసరి నారాయణరావు గారిని చూశాం, ఇప్పుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ గారిని చూస్తున్నాం. నంబర్ వన్ స్థానంలో ఉన్న పూజా హెగ్డే రాబోయే రోజుల్లో ఈ విజయ పరంపరను కొనసాగించాలని ఆశిస్తున్నా. అరవింద్‌గారు, చినబాబుగారు విశాఖపట్నంలో ఫిల్మ్ ఇండస్ట్రీని నెలకొల్పడంలో ముందడుగు వెయ్యాలని కోరుతున్నా. సినిమా ఇండస్ట్రీని నెలకొల్పడానికి అనుకూలమైన వాతావరణం ఉన్న నగరం ఇది. అరవింద్‌గారు తన అదృష్టాన్ని విశాఖ నగరానికి కూడా అందించాలని కోరుకుంటున్నా’’ అని అన్నారు.

హీరోయిన్ పూజా హెగ్డే మాట్లాడుతూ.. ‘‘ఈ సినిమా సక్సెస్ గురించి ఇదివరకే ఇంటర్వ్యూల్లో మాట్లాడేశాను. అదే విషయాన్ని మళ్లీ తెలుగులో చెప్తాను. ఏమైనా తప్పులుంటే క్షమించండి. ఒక సినిమాకి సక్సెస్ రావాలంటే అది టీం ఎఫర్ట్ వల్లే సాధ్యమవుతుంది. అందుకే మా మొత్తం బృందానికి కంగ్రాట్స్. నాకు ఇంత పెద్ద హిట్టిచ్చినందుకు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌కు థాంక్స్. నన్ను ఇంత అందంగా చూపించినందుకు థాంక్స్. ‘బుట్టబొమ్మ’ పాట మొత్తం నామీద రాసినందుకు థాంక్స్. ఇప్పుడు నేను తెలుగు అమ్మాయిని అయిపోయాను. షారుఖ్ ఖాన్, సుస్మితా సేన్‌లాంటి ‘ఆరా’ను అల్లు అరవింద్‌గారిలో చూస్తున్నాను. చినబాబు, నాగవంశీ లాంటి అందమైన హృదయమైన నిర్మాతల్ని నేను అదివరకు కలవలేదు. బంటూ (అల్లు అర్జున్‌ను ఉద్దేశించి) మీ గురించి మాట్లాడాలంటే కొంచెం ప్రాబ్లెం ఉంది. ఎందుకంటే ఆడియెన్స్ మీ గురించి ఎప్పుడూ చెప్తూనే ఉంటారు. వాళ్లు మిమ్మల్ని స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ అనీ, మల్లు అర్జున్ అనీ, టిక్ టాక్ స్టార్ అల్లు అర్జున్, గూగుల్ మోస్ట్ సెర్చ్డ్ అల్లు అర్జున్ అని అంటుంటారు. మీతో హీరోయిన్ గా రెండోసారి నటించాను. రాబోయే రోజుల్లో మీరు మరింత సక్సెస్ కావాలని ఆశిస్తున్నా. మళ్లీ మీతో కలిసి నటించాలని ఆశిస్తున్నా. కొన్ని జాతకాలంతే. తమన్ తన మ్యూజిక్ తో సినిమాని ఎలివేట్ చేశారు. ఈ సీజన్ లో అవార్డ్స్ అన్నీ అతనికే వస్తాయి. తెలుగు ఫ్యాన్స్ లాగా ఏ ఫ్యాన్స్ లేరు’’ అని చెప్పారు.

మ్యూజిక్ డైరెక్టర్ తమన్ మాట్లాడుతూ.. ‘‘జనవరికి ఎలా గెలవాలని ఆరు నెలలుగా మానసికంగా పరిగెత్తుతూ వచ్చాం. దాంతో బ్రెయిన్ కొంచెం చిక్కిపోయింది. బన్నీ, త్రివిక్రమ్ వల్లే ఈ ఆల్బమ్ ఇలా వచ్చింది. ఈ భూగ్రహం పైనే కూలెస్ట్ డైరెక్టర్ త్రివిక్రమ్. పదేళ్ల కాలంలో వంద సినిమాలు చేశాను. త్రివిక్రమ్ గారితో పనిచేయడానికి నాకు పదేళ్లు పట్టింది. అందుకే పదేళ్లు గుర్తుండిపోయే పాట ఇచ్చాను. సాధారణంగా ఒక దర్శకుడితో పరిగెత్తడం కష్టం. అదే రైటర్ కూడా అయిన దర్శకుడితో పరిగెత్తడం మరీ కష్టం. ‘రేసుగుర్రం’, ‘సరైనోడు’, ఇప్పుడు ఈ సినిమాతో బన్నీతో హ్యాట్రిక్ సాధించాను. సాధారణంగా సైకిల్ ట్యూబులు పంక్చరవడం మనం చూస్తుంటాం. ఈ సినిమాకి యూట్యూబులే పంక్చరయ్యాయి. ఇండియాని కాపాడడానికి బోర్డర్లో ఆర్మీవాళ్లు ఉంటారు. కానీ మన తెలుగు భాషను కాపాడే ఒకే సోల్జర్ త్రివిక్రమ్ గారు. ఆయన అమ్మలాంటి మనిషి. ఆయనను జాగ్రత్తగా కాపాడుకుందాం. నిర్మాతలు రాధాకృష్ణ, అరవింద్‌గార్లు నాకు చాలా కాన్ఫిడెన్స్ ఇచ్చారు. ఈసారి వంద మిలియన్ కాదు వెయ్యి మిలియన్ వ్యూస్ కొడతాం’’ అని తెలిపారు.

నిర్మాత అల్లు అరవింద్ మాట్లాడుతూ.. ‘‘మా నాన్న అల్లు రామలింగయ్యగారిని తలుచుకొని మాట్లాడుతున్నా. సినిమా అనేది అందరికంటే గొప్పది. ఇది 2020. 2060లోనూ ఈ సినిమా పాటలు పాడతారని నేను ప్రామిస్ చేస్తున్నాను. ‘శంకరాభరణం’కు నేను పనిచేశాను. ఆ సినిమా పాటలు ఇప్పటికీ పాడుకుంటున్నారు. ఒక గొప్ప సినిమాకు, ఒక గొప్ప సంగీతం తోడైతే, అది వందేళ్లు నిలిచిపోతుంది. అలాగే ఈ సినిమాని వంద సంవత్సరాలు ఉంచుతారు. ఇది వాస్తవం. నేను కర్నూలులో ఈ సెలబ్రేషన్స్ పెట్టుకుందామని బన్నీతో అంటే, నాకు ‘వైజాగే కావాలి’ అన్నాడు. కోట్లాది మంది చూసిన సినిమాలో బన్నీ ఎలా చేశాడో చెబితే అపహాస్యంగా ఉంటుంది. మాకు కడుపు నిండిపోయింది. త్రివిక్రమ్‌కు మాటల మాంత్రికుడు అనే మాట తక్కువగా అనిపిస్తుంది. అతను మాటల మాంత్రికుడు కాదు, సెల్యులాయిడ్ తాంత్రికుడు. తాంత్రికుడు మనను మాయలో ఉంచేస్తాడు. మూడు గంటల సేపు అలా మనల్ని ఉంచే తాంత్రికుడు త్రివిక్రమ్. నా కొడుకుకి ఇలాంటి సినిమా ఇచ్చినందుకు అతనికి కృతజ్ఞతలు. ఈ వయసులో నాకు చినబాబు లాంటి మంచి మిత్రుడు  దొరకడం నా అదృష్టం. మీరు (ప్రేక్షకులు) లేకపోతే మేము లేము, ఈ సినిమా లేదు, ఈ పండగ లేదు. మీకు శిరసు వంచి నమస్కరిస్తున్నాను” అని చెప్పారు.

హైలైట్స్

* శ్రీముఖి వ్యాఖ్యాతగా వ్యవహరించిన ఈ విజయోత్సవంలో స్టేజిపై హుషారుగా సింగర్స్ పాడిన అల్లు అర్జున్ సినిమాల్లోని పాటలు, డాన్సర్ల పర్ఫార్మెన్సులు అమితంగా అలరించాయి.

* హీరోయిన్ పూజా హెగ్డే ‘సామజవరగమన’ పాటలోని ‘నీ కాళ్లను పట్టుకు వదలనన్నవి నా కళ్లు.. నా చూపులనలా తొక్కుకు వెళ్లకు దయలేదా అసలు’ అనే లైన్ పాడి అలరించింది.

* హీరో డైరెక్టర్లు అల్లు అర్జున్, త్రివిక్రమ్ ఒకేసారి వేదిక వద్దకు రావడంతో ఫ్యాన్స్ ఆనందోత్సాహాలతో కేరింతలు కొట్టారు.

* ‘సిత్తరాల సిరపడు’ పాటను ఆలపించిన గాయకుడు సూరన్నను స్టేజిపైకి వచ్చి అల్లు అరవింద్ కౌగలించుకోవడం అందరి దృష్టినీ ఆకర్షించింది.

* ‘ఓ మై గాడ్ డాడీ’ పాటకు ప్రఖ్యాత సంగీతకారుడు డ్రమ్స్ శివమణి పర్ఫార్మెన్స్ ఇవ్వగా, రోల్ రైడా బృందం ఆ పాటను ఆలపించింది.

* హీరోయిన్ పూజా హెగ్డే ‘వైజాగ్ సార్.. వైజాగ్ అంతే’ అంటూ తన స్పీచ్ ను మొదలుపెట్టడంతో కింద కుర్చీలో కూర్చున్న బన్నీ ‘వావ్’ అంటూ గట్టిగా నవ్వేశారు.

* సూరన్న కోసం బన్నీ తెచ్చిన కోటును తమన్ స్వయంగా ఆయనకు తొడగగా, తనకు ఈ సినిమాలో పాడే అవకాశం ఇచ్చిన త్రివిక్రమ్‌కు, తమన్ కు థాంక్ చెప్పి మరో గాయకుడు సాకేత్ తో కలిసి ‘సిత్తరాల సిరపడు’ పాటను ఆలపించారు.

* డ్రమ్మర్ శివమణి ఇచ్చిన పర్ఫార్మెన్స్ ఆహూతులను మెస్మరైజ్ చేసింది. సూట్ కేసు, వాటర్ క్యాన్ వంటి వస్తువులపై కూడా స్వరాలు పలికించడమే కాకుండా అరవింద్, త్రివిక్రమ్, పూజా హెగ్డేల చేత కూడా డ్రమ్స్ పై స్వరాలు పలికింపజేశారు. కిందికి వెళ్లి మరీ బన్నీని స్టేజిపైకి తీసుకు వచ్చారు. అయితే బన్నీ పూజతో కలిసి ‘రాములో రాములా’ సాంగ్ సిగ్నేచర్ స్టెప్ వేసి అలరించారు.

Advertisement

Ala Vaikunthapurramuloo Success Celebrations Highlights:

Celebrities Speech at Ala Vaikunthapurramuloo Success Celebrations 

Advertisement

Loading..
Loading..
Loading..
advertisement