Advertisement

‘ఎల్లువొచ్చి గోదారమ్మ’పై దర్శకేంద్రుడి రియాక్షన్

Wed 18th Sep 2019 02:15 PM
k raghavendra rao,valmiki movie,elluvochi godaramma,song,promo,launches  ‘ఎల్లువొచ్చి గోదారమ్మ’పై దర్శకేంద్రుడి రియాక్షన్
Valmiki Movie Elluvochi Godaramma Song Promo Released ‘ఎల్లువొచ్చి గోదారమ్మ’పై దర్శకేంద్రుడి రియాక్షన్
Advertisement

‘ఎల్లువచ్చి గోదారమ్మ’ సాంగ్‌ చాలా బావుంది, ‘దేవత’ సినిమాలాగే ‘వాల్మీకి’ చిత్రం కూడా 25 వారాలు ఆడాలి- దర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావు

మెగాప్రిన్స్‌ వరుణ్‌ తేజ్‌, పవర్‌ఫుల్‌ డైరెక్టర్‌ హరీష్‌ శంకర్‌ కాంబినేషన్‌లో 14 రీల్స్‌ ప్లస్‌ బేనర్‌పై రామ్‌ ఆచంట, గోపీ ఆచంట అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన చిత్రం ‘వాల్మీకి’. పూజా హెగ్డే ప్రత్యేక పాత్రలో నటించిన ఈ చిత్రంలో తమిళ హీరో అథర్వ మురళి కీలక పాత్ర పోషించారు. యువ సంగీత దర్శకుడు మిక్కీ జె. మేయర్‌ సంగీతాన్ని అందించారు. సెప్టెంబర్‌ 20న ప్రపంచవ్యాప్తంగా సినిమా విడుదలవుతుంది. 1982లో దర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావు దర్శకత్వంలో శోభన్‌బాబు, శ్రీదేవి జంటగా నటించిన ‘దేవత’ సినిమాలోని ‘ఎల్లువచ్చి గోదారమ్మా’ పాటను ఈ చిత్రంలో రీమిక్స్‌ చేశారు. ఈ పాటను సెప్టెంబర్‌ 17న హైదరాబాద్‌ ప్రసాద్‌ ల్యాబ్స్‌లో దర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావు సమక్షంలో వీడియో ప్రోమోను రిలీజ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో నిర్మాతలు రామ్‌ ఆచంట, గోపీ ఆచంట, కాస్ట్యూమ్‌ డిజైనర్‌ గౌరి పాల్గొన్నారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో...

దర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావు మాట్లాడుతూ - ‘‘ముందుగా ఈ పాటకు ఇంత కీర్తి ప్రతిష్టలు రావడానికి కారణమైన రామానాయుడుగారు, వేటూరి సుందరరామ్మూర్తి, చక్రవర్తిగార్లను తలుచుకుంటున్నాను. ఈ చిత్ర యూనిట్‌ నన్ను ఇరవై అయిదు సంవత్సరాలు వెనక్కి తీసుకెళ్ళారు. ఈ పాట చూస్తుంటే మళ్లీ నాకు ఆరోజులు గుర్తుకొస్తున్నాయి. ఈ పాట తీసేముందు లొకేషన్స్‌ చూడటానికి రాజమండ్రి వెళ్ళాం. అక్కడ ఉండ్రాజవరం అనే ఊళ్లో మా ఫ్రెండ్‌ డాబా మీద మడత మంచం మీద పడుకొని ఈ పాట ఎలా తీయాలా అని ఆలోచిస్తున్నప్పుడు అక్కడ ఊరంతా ఠంగ్‌ ఠంగ్‌మని సౌండ్స్‌ వస్తున్నాయి. ఏమిటా సౌండ్‌ అని అడగగా.. ఇక్కడ బిందెలు తయారు చేస్తారు అని చెప్పారు. వెంటనే చాలా బిందెలుంటాయా అని అడిగాను. ప్రొడ్యూసర్స్‌ బాగుండాలని బిందెలు కొనేబదులు అద్దెకి ఇస్తారేమో అడుగు.. అన్నాను. వారు ఒప్పుకొని పాట షూట్‌ చేసేటప్పటికి 1000 బిందెలు రెడీ చేసి ఇచ్చారు. ఈ సినిమా రివ్యూ రాస్తూ ఒక విలేకరి ‘సినిమా అంతా బావుంది కానీ.. పాట వచ్చేటప్పటికి 1000 బిందెలు ఎట్లా వస్తాయో దర్శకుడికే తెలియాలి’ అని రాశారు. తర్వాత నేనతన్ని కలిసినప్పుడు.. నువ్వుగానీ, మీ ఫ్రెండ్స్‌గానీ ఎవర్నైనా లవ్‌ చేశారా అంటే.. చేశారండీ అన్నారు. వాళ్లెప్పుడైనా డ్యూయెట్‌ పాడటం చూశావా? డ్యూయెట్‌ ఒప్పుకుంటే.. బిందెలు కూడా ఒప్పుకోవాలి అన్నాను. పాట అనేది ప్రేక్షకుల కళ్లకి, చెవులకి ఆనందం కలిగించేది. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో మిక్కీ పాటలే ఎక్కువ వినిపిస్తున్నాయి. ‘గోపికమ్మా’ దగ్గర నుండి నాకు ఫేవరేట్‌ మ్యూజిక్‌ డైరెక్టర్‌. పూజాని చూసినరోజే ఈ అమ్మాయి టాప్‌ హీరోయిన్‌ అవుతుంది అన్నాను. వరుణ్‌ నటన గురించి నేను చెప్పాల్సిన పని లేదు. మీ అందరికీ తెలుసు. 15 ఏళ్ల క్రితం ఈ ప్రొడ్యూసర్స్‌తో ఒక సినిమా చేయాలనుకున్నాను. కానీ కుదరలేదు. ఈవిధంగా అవకాశం వచ్చినందుకు హ్యాపీ. ‘దేవత’ సినిమా 25 వారాలు ఆడినట్టు ‘వాల్మీకి’ సినిమా కూడా 25 వారాలు ఎక్కడో ఒక చోట ఆడుతూనే ఉండాలి’’ అన్నారు.

మెగా ప్రిన్స్‌ వరుణ్‌ తేజ్‌ మాట్లాడుతూ - ‘‘పాటలు, డ్యాన్స్‌ నాకు కంఫర్ట్‌ జోన్‌ కాదు. హరీష్‌గారు ఈ సినిమా కథ చెప్పి ఒక రీమిక్స్‌ సాంగ్‌ ఉంది అన్నారు. నేను మా ఫ్యామిలీలో ఎవరి పాట ఉంటుందో అనుకున్నాను. శోభన్‌బాబు, శ్రీదేవిగారి పాట అనగానే చాలా ఎగ్జయిట్‌గా అన్పించింది. చాలాసార్లు మా నానమ్మ, నాన్నగారు ఈ పాట వింటం నేను చూశాను. అదే పాటను అంతే అమేజింగ్‌గా రీక్రియేట్‌ చేయడానికి హెల్ప్‌ చేసిన ప్రతి ఒక్కరికీ బిగ్‌ థాంక్స్‌. నేను ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంగారికి వీరాభిమానిని. ‘ముకుంద’ సినిమాలో ఆయనతో ఒక పాడించాలని నేను, మిక్కీ అనుకున్నాం. కానీ కుదరలేదు. ఇప్పుడు ఆయన ఈ పాట మళ్లీ పాడటం మా అదృష్టంగా భావిస్తున్నాను. తెలుగు సినిమా చరిత్ర ఉన్నంతకాలం రాఘవేంద్రరావుగారి సినిమాలు, పాటల వైభవం అలాగే ఉంటుంది. శోభన్‌బాబుగారు డ్యాన్స్‌ చేసిన షూ నేను వేసుకోవడం అదృష్టంగా భావిస్తున్నాను. శ్రీదేవి, శోభన్‌బాబు అంత కాకపోయినా మా పరిధిమేరకు డ్యాన్స్‌ చేశాం’’ అన్నారు.

పవర్‌ఫుల్‌ డైరెక్టర్‌ హరీష్‌ శంకర్‌ మాట్లాడుతూ - ‘‘ఈ సాంగ్‌ రీమిక్స్‌ చేయాలనేది ఏడెనిమిది సంవత్సరాల కల. ఈ పాటను రీమిక్స్‌ చేయడానికి ప్రాపర్‌ కథ, బ్యాక్‌గ్రౌండ్‌ కోసం ఎప్పటినుంచో వెయిట్‌ చేస్తున్నాను. ఫస్ట్‌డే యానాంలో బిందెలన్నీ పెట్టి మాస్టర్‌ మూవ్‌మెంట్స్‌ చేస్తున్నప్పుడు బాలసుబ్రహ్మణ్యంగారి గొంతులో ఈ పాట వినిపించింది. ఒక్కసారిగా నా కళ్లలోంచి గూస్‌బంప్స్‌తో కూడిన ఆనందభాష్పాలు వచ్చాయి. 80లో సలీం మాస్టర్‌ ఏ స్టైల్‌ అయితే ఫాలో అయ్యారో, శేఖర్‌ మాస్టర్‌ని కూడా అదే స్టైల్‌ ఫాలో అవ్వమని చెప్పాను. ఎక్కడా ఆ ఊపు, గ్రేస్‌ తగ్గకుండా అచ్చం 80ల్లాగానే చేశారు. హ్యాట్సాఫ్‌ శేఖర్‌ మాస్టర్‌. పూజా హెగ్డేని తప్ప ఈ పాటలో ఇంకెవరినీ ఊహించుకోలేదు. ఈ పాట కోసం పూజా చాలా కష్టపడింది. వరుణ్‌ ఎప్పుడూ డ్యాన్స్‌ రాదు.. అంటారు కానీ కొన్ని స్టెప్స్‌ అయితే చింపేశారు. అచ్చం శోభన్‌బాబుగారిలాగే చేశారు. నా ఈ కల నెరవేరడానికి కారణమైన మా నిర్మాతలు రామ్‌ ఆచంట, గోపీ ఆచంటగారికి ధన్యవాదాలు. రాఘవేంద్రరావుగారు తీసిన ఈ పాట ఫీల్‌ పోకుండా ఆర్ట్‌ డైరెక్టర్‌ అవినాష్‌ చాలా సపోర్ట్‌ చేశారు. రాఘవేంద్రరావుగారి ఆశీస్సులు నాకెప్పుడూ ఉంటాయి. ఈ పాట ఓ గురువుగారికి ఓ శిష్యుడు ఇస్తున్న పువ్వులాంటిది. ఒరిజినల్‌ పాటలోని సోల్‌ మిస్‌ అవ్వకుండా అలాగే కంపోజ్‌ చేసిన మిక్కీకి, ఈ పాటను మళ్లీ పాడిన బాలసుబ్రహ్మణ్యంగారికి థాంక్స్‌. డెఫినెట్‌గా ఈ పాట రేపు థియేటర్స్‌లో ఆడియన్స్‌కి కన్నులపండగలా ఉంటుంది. ఈ పాట రాసిన వేటూరిగారు మన మధ్య లేకపోవడం చాలా దురదృష్టకరం. నేను బాధలో, సంతోషంలో ఉన్నా ఎప్పుడూ వేటూరిగారిని తల్చుకుంటూనే ఉంటాను. ఆయన ఆశీర్వాదాలు ఎప్పుడూ నాతోనే ఉంటాయి. మేం పిలవగానే వేటూరిగారి స్థానాన్ని భర్తీ చేస్తూ మమ్మల్ని బ్లెస్‌ చేయడానికి వచ్చిన వేటూరి రవిగారికి కృతజ్ఞతలు. రాఘవేంద్రరావుగారు ఈ పాట చూసి ‘కంగ్రాట్స్‌.. ఐయాం హ్యాపీ’ అన్నారు. అదే మాకు పెద్ద సర్టిఫికెట్‌. రాఘవేంద్రరావుగారు పాటల మాంత్రికులు. ఆయన పాట ఆయనకి చూపించటమే పెద్ద సాహసం. ఈ సాహసాన్ని ఆయన ఆశీర్వదించడం హ్యాపీ’’ అన్నారు.

కొరియోగ్రాఫర్‌ శేఖర్‌ మాస్టర్‌ మాట్లాడుతూ - ‘‘రాఘవేంద్రరావుగారి సినిమాలకి పని చేయకపోయినా, ఆయన సాంగ్‌ను రీమిక్స్‌ చేసే అదృష్టం దొరికినందుకు సంతోషంగా ఉంది. సాంగ్‌ చాలా అద్భుతంగా వచ్చింది. వరుణ్‌, పూజా ఇద్దరూ చాలా బాగా చేశారు. ఈ అవకాశం ఇచ్చిన దర్శక, నిర్మాతలకి థాంక్స్‌’’ అన్నారు.

ఆర్ట్‌ డైరెక్టర్‌ అవినాష్‌ మాట్లాడుతూ - ‘‘నేను మొదటిసారి రాఘవేంద్రరావుగారితో స్టేజ్‌మీద కలిసి నిలబడ్డాను. ‘మహానటి’ సినిమాలో సావిత్రిగారి పాట, ఇప్పుడు శోభన్‌బాబు, శ్రీదేవిగారి పాటకి పని చేసే అవకాశం కలిగించి ఇండస్ట్రీ నన్ను ఆశీర్వదించింది అనుకుంటున్నాను’’ అన్నారు.

వేటూరి రవి మాట్లాడుతూ - ‘‘దర్శకులు రాఘవేంద్రరావుగారు 1982లో శ్రీదేవిగారితో తీసిన ఈ పాటను రీమిక్స్‌ చేయడం అనేది మంచి ప్రయత్నం. ప్రోమో చూసిన తర్వాత శ్రీదేవిగారు ఏ వయసులో ఆ సాంగ్‌ చేశారో, పూజా కూడా అదే వయసులో ఈ సాంగ్‌ చేయడం యాదృశ్చికం. శ్రీదేవిగారికి ఒక ట్రేడ్‌ మార్క్‌ అయిన ఈ సాంగ్‌ పూజాకి కూడా అవుతుందని ఆశిస్తున్నాను’’ అన్నారు.

సంగీత దర్శకులు మిక్కీ జె. మేయర్‌ మాట్లాడుతూ - ‘‘దేవత’ చిత్రంలో వేటూరిగారు రచించి చక్రవర్తిగారు కంపోజ్‌ చేసిన బెస్ట్‌ మెలోడి ‘ఎల్లువచ్చి గోదారమ్మా’ సాంగ్‌ను నేను రీమిక్స్‌ చేయడం గౌరవంగా భావిస్తున్నాను. ఎస్‌.పి. బాలసుబ్రహ్మణ్యంగారే మళ్ళీ ఈ పాటను పాడటం మా అదృష్టం. శేఖర్‌ మాస్టర్‌ బెస్ట్‌ కొరియోగ్రఫీ అందించారు. ఈ చిత్రం చేసే అవకాశం ఇచ్చిన దర్శకుడు హరీష్‌ శంకర్‌, నిర్మాతలకి థాంక్స్‌. వరుణ్‌ తేజ్‌, పూజా హెగ్డే ఈ పాట ద్వారా ఆ మ్యాజిక్‌ని మళ్లీ రీక్రియేట్‌ చేశారు. సినిమాలో ఇది ఒక హైలైట్‌గా నిలుస్తుంది. వీళ్లిద్దరి క్యారెక్టర్లకి బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ కూడా బాగా కుదిరింది. టీమ్‌ అందరికీ ఆల్‌ ది బెస్ట్‌’’ అన్నారు.

హీరోయిన్‌ పూజా హెగ్డే మాట్లాడుతూ - ‘‘ఈ పాట కోసం దాదాపు 1500 బిందెలను ఇచ్చిన మా ప్రొడ్యూసర్స్‌కి ముందుగా థాంక్స్‌. ఈ పాటలో వరుణ్‌ ఇచ్చిన కొన్ని రెట్రో ఎక్స్‌ప్రెషన్స్‌ ఆడియన్స్‌ని సర్‌ప్రైజ్‌ చేస్తాయి. అలాగే డ్యాన్స్‌ ఇరగదీశాడు. అలాగే ఈ క్యారెక్టర్‌, ఒకప్పటి ఐకానిక్‌ సాంగ్‌ ఇచ్చిన హరీష్‌ శంకర్‌కి థాంక్స్‌. శ్రీదేవిగారు నాకు ఇన్‌స్పిరేషన్‌. లెజెండరీ డైరెక్టర్‌ రాఘవేంద్రరావుగారు ఈ పాటతో ఒక మ్యాజిక్‌ క్రియేట్‌ చేశారు. ఇప్పుడు ఆయన మా సాంగ్‌ చూసి అభినందించి, మమ్మల్ని ఆశీర్వదించడం మేమెప్పటికీ మర్చిపోలేం. అలాగే ఇప్పటి ట్రెండ్‌కి తగ్గట్లుగా సంగీతాన్నిచ్చిన మిక్కీ, కొరియోగ్రఫీ చేసిన శేఖర్‌ మాస్టర్‌కి థాంక్స్‌’’ అన్నారు.

మెగా ప్రిన్స్‌ వరుణ్‌ తేజ్‌, అధర్వ మురళి, పూజ హెగ్డే, మృణాళిని రవి, బ్రహ్మానందం, సత్య, డింపుల్  చాయ్ బిస్కెట్ ఫేమ్ అరుణ్  తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: మిక్కీ జె.మేయర్‌, సినిమాటోగ్రఫీ: ఐనాంక బోస్‌, ఎడిటింగ్‌: ఛోటా కె.ప్రసాద్‌, ఫైట్స్‌: వెంకట్‌, ఆర్ట్‌: అవినాష్‌ కొల్ల, స్క్రీన్‌ ప్లే: మధు శ్రీనివాస్‌, మిథున్‌ చైతన్య, కాస్ట్యూమ్ డిజైనర్ : గౌరీ,

లైన్ ప్రొడ్యూసర్: హరీష్‌ కట్టా,

నిర్మాతలు: రామ్‌ ఆచంట, గోపి ఆచంట,

దర్శకత్వం: హరీష్‌ శంకర్‌.ఎస్‌

Valmiki Movie Elluvochi Godaramma Song Promo Released:

KRR Launches Valmiki Movie Elluvochi Godaramma Song Promo

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement