మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) ఎన్నికలు రంజుగా మారుతున్నాయి. ఆదివారం ఎన్నికలు జరగనున్న నేపధ్యంలో శివాజీరాజా, నరేష్‌ల ప్యానెల్స్ తమ వంతుగా ఓట్లను తమ వైపు మరలించుకోవడంలో బిజీగా ఉన్నాయి. తాజాగా శివాజీ రాజా ఈ ఎన్నికల్లో తన పోటీకి కారణమిది అంటూ ఓ విషయం చెప్పుకొచ్చాడు.
ఆయన మాట్లాడుతూ, నరేష్ ప్యానెల్ నాపై తప్పుడు ఆరోపణలు చేస్తోంది. నిజానికి ఈ ఎన్నికల్లో పోటీ చేయకూడదనే భావించాను. కానీ ప్యానెల్ సభ్యుల బలవంతం మీదనే ఎన్నికల్లోకి దిగాను. వచ్చే ఎన్నికల్లో ఆ దేవుడే శాసించినా పోటీ చేయను. పద్మ అనే మహిళ నేను పోటీ చేయకుంటే ఆత్మహత్య చేసుకుంటానని చెప్పింది. ‘మా’ ఇచ్చే పింఛన్ కూడా తీసుకోనని చెప్పడంతోనే ఈ ఎన్నికల్లో పోటీ చేస్తున్నాను. ఎన్నికల సమయంలో టివీ చానెల్స్‌లో ఎవరు మాట్లాడకూడదనే నిబంధన ఉంది. కానీ సోదరుడు నరేష్, బావ రాజశేఖర్, అక్క జీవిత టివీలలో మాట్లాడుతూ, మాపై బురద జల్లుతున్నారు. నా వల్ల శ్రీకాంత్ మాటలు పడుతున్నాడు. నాకు మద్దతు ఇచ్చేందుకే ఎస్వీకృష్ణారెడ్డి వంటి దర్శకుడు వచ్చి నాకు మద్దతిచ్చాడు. ఇటీవల నరేష్ నన్ను చాలా బాధపెట్టాడు. దాంతో కుటుంబ సభ్యులతో కలిసి పర్మినెంట్‌గా అరుణాచలం వెళ్లిపోవాలని భావించాను.. అన్నారు.
దర్శకుడు ఎస్వీకృష్ణారెడ్డి మాట్లాడుతూ, నావంతుగా శివాజీరాజాకి మద్దతు ఇచ్చేందుకే నేను ఉపాధ్యక్షునిగా పోటీ చేస్తున్నాను. రూ.2.90 కోట్లు ఉన్న ‘మా’ సంక్షేమ నిధిని శివాజీరాజా 5.70కోట్లకు పెంచాడని ఎస్వీ.. శివాజీరాజాపై ప్రశంసల వర్షం కురిపించాడు. నా నామినేషన్‌ని సరిగా లేదని తిరస్కరించారు. సరైన కారణం లేకుండానే ఆ పని చేశారు. బహుశా నేను ట్రెజరర్‌గా ఉండటం నరేష్‌కి ఇష్టం లేదేమో అంటూ పరుచూరి వెంకటేశ్వరరావు చురకలు వేశాడు. ‘మా’కి సొంత భవనం కావాలంటే శివాజీరాజాని గెలిపించాలని హీరో శ్రీకాంత్ కోరాడు. ఈ సందర్భంగా శివాజీరాజా కన్నీళ్ల పర్యంతం అయ్యాడు. ఎదుటి వారి కళ్లలో నేను కన్నీరు చూడలేను. అలాంటిది నేనే ఇప్పుడు కన్నీరు పెడుతున్నాను. అయితే కన్నీరు పెట్టేంత పిరికితనం లేదని, కేవలం ఆవేదనతోనే కన్నీరు పెట్టానని శివాజీరాజా చెప్పుకొచ్చాడు. మొత్తానికి ఈ పోటీలో ఎవరు ఫైనల్ విన్నరో తెలియాలంటే కొంతకాలం వేచిచూడక తప్పదనే చెప్పాలి.