అప్పట్లో సుమారు దశాబ్ద కాలం పాటు హిట్ లేక అల్లల్లాడిన కళ్యాణ్ రామ్ 'పటాస్' తో మంచి ఫామ్ లోకి వచ్చాడు. ఒక రకంగా 'పటాస్' చిత్రం కళ్యాణ్ కు నూతన ఉత్తేజాన్ని ఇచ్చిందనే చెప్పాలి. ఆ తర్వాత వచ్చిన కళ్యాణ్ చిత్రాలు 'షేర్, ఇజం' వంటివి కళ్యాణ్ ను తీవ్ర నిరాశకు గురి చేశాయి. షేర్ చిత్రం గురించి విడిచిపెట్టి పూరి దర్శకత్వంలో వచ్చిన ఇజం చిత్రంపై బాగానే ఆశలు పెట్టుకున్నాడు కళ్యాణ్. ఈ చిత్రాన్ని అద్భుతంగా రూపొందించాలన్న భావంతో భారీగానే ఖర్చుపెట్టాడు కళ్యాణ్. అయితే ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద భారీస్థాయి నష్టాలను మిగిల్చింది. దీంతో చాలా నిరాశకు లోనైన కళ్యాణ్, ఇజం తర్వాత సినిమా గురించి కొత్త ప్రకటన అంటూ ఏదీ చేయలేదు. ఆ తర్వాత జీ నాగేశ్వర్ రెడ్డి దర్శకత్వంలో ఓ సినిమా చేద్దామని భావించినా.... అది ఎందుకో అర్ధాంతరంగా ఆగిపోయింది. ఆ తర్వాత నారా రోహిత్ తో సావిత్రి సినిమా చేసిన పవన్ సాధినేనితో ఓ సినిమా చేయాలని భావించి ఒప్పందం కుదుర్చుకున్నాడు కళ్యాణ్.
అయితే అంతటితో ఆగకుండా.. ఉపేంద్ర అనే మరో కొత్త దర్శకుడు చెప్పిన కథను కూడా ఓకే చేసి తనతో ముందుగా సినిమా చేయాలని కళ్యాణ్ భావిస్తున్నట్లు తెలుస్తుంది. శ్రీను వైట్ల దగ్గర సహాయ దర్శకుడిగా ఉపేంద్ర పని చేశాడు. ఈ మధ్య దర్శకుడు ఉపేంద్ర, కళ్యాణ్ రామ్ ను కలసి కథ చెప్పడంతో ఆ కథ కళ్యాణ్ కు బాగా నచ్చిందని వెంటనే కళ్యాణ్, ఉపేంద్రతో సినిమా చేస్తానని మాట ఇచ్చినట్లు కూడా వార్తలు వస్తున్నాయి. కాగా కళ్యాణ్ రామ్ మొదట పవన్ సాధినేనితో సినిమా చేసిన తర్వాతే ఉపేంద్రతో సినిమా చేస్తాడని కూడా సమాచారం అందుతుంది. చూద్దాం ఏం జరుగుతుందో.