గత నాలుగు దశాబ్దాలుగా నిర్మాతగా, అభిరుచి ఉన్న చిత్రాలను నిర్మించే ప్రొడ్యూసర్‌గా, వైజయంతి మూవీస్ బేనర్ అధినేత అశ్వనీదత్ పేరు తెచ్చుకున్నారు. తాజాగా ఆయన ఓ ఇంటర్వ్యూలో తన మనసులోని మాటలను బయటపెట్టారు. ఆయన మాట్లాడుతూ, 2009లో మా సిద్దాంతి గారి ఆరోగ్యం బాగాలేకపోతే చూసివద్దామని వెళ్లాను. అప్పుడు ఆయన నాతో నీకు ఏలిననాటి శని నడుస్తోంది. ప్రస్తుతం సినిమాలు తీయవద్దు. దెబ్బతింటావు. త్వరలో మీ నాన్నగారు కూడా కాలం చేస్తారని చెప్పారు. ఆయన చెప్పినట్లుగానే 2010 జనవరి30న మా నాన్నగారు మరణించారు. కానీ నేను మెహర్‌రమేష్ దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా 'శక్తి' చిత్రం తీశాను. ఈ చిత్రానికి అందరం బాగా కష్టపడినా, రాంగ్ సబ్జెక్ట్ కావడం కొంపముంచింది.
అమ్మవార్లు, శక్తిపీఠాలతో సినిమా తీయవద్దని రజనీకాంత్ గారు కూడా చెప్పారు. ఈ చిత్రం వల్ల నాకు 25కోట్ల భారీ నష్టం వచ్చింది. నేను 1974లో స్వర్గీయ ఎన్టీఆర్ గారితో చిత్రం చేయాలనే కసితో మా నాన్న ఇచ్చిన 7లక్షల రూపాయలతో చెన్నై వెళ్లాను. కృష్ణుడి మెడలో ఉండేది వైజయంతి మాల... కాబట్టి నీ బేనర్‌కు వైజయంతి మూవీస్ అనే పేరు పెట్టుకో అని ఎన్టీఆర్‌గారు నా బేనర్‌కు పేరు పెట్టారు. ఆయనతో మాకు కాస్త బంధుత్వం కూడా ఉంది. ఇక ఎన్టీఆర్, ఏయన్నార్, కృష్ణ, శోభన్‌బాబు వంటి వారితో పాటు దాదాపు అందరు స్టార్స్‌తో చిత్రాలు నిర్మించాను. ఎన్టీఆర్, ఏయన్నార్‌ల తర్వాత ఆస్థాయి స్టార్‌డమ్ కలిగిన హీరో మెగాస్టార్ చిరంజీవిగారే అని చెప్పాలి. ఆయనతో నాకు 1988 నుంచి మంచిస్నేహం ఉంది. ఇద్దరం ఒకేసారి హైదరాబాద్ షిఫ్ట్ అయ్యాం. ఇలా ఆయనతో ఉన్న బంధం 'జగదేకవీరుడు అతిలోక సుందరి'తో మరింత బలపడింది.
ఈ చిత్రానికి ఆరోజుల్లో నాకు 40లక్షల దాకా లాభం వచ్చింది. ఇక నాకు ఎక్కువ లాభాలను తెచ్చిపెట్టిన చిత్రం 'ఇంద్ర'. ఈ చిత్రంతో నాకు ఏడు కోట్ల వరకు భారీలాభాలు వచ్చాయి. 'అశ్వమేథం, గోవిందా.. గోవిందా' చిత్రాలకు భారీ నష్టం వచ్చిన తర్వాత నాకు 'శుభలగ్నం, పెళ్లిసందడి, పెళ్లాం ఊరెళితే' వంటి చిన్న చిత్రాల ద్వారా మంచి లాభాలు వచ్చాయి. కృష్ణగారు అడిగితే మహేష్‌ను పరిచయం చేస్తూ 'రాజకుమారుడు' నిర్మించాను, చిరుగారికి అల్లు అరవింద్ ఉన్నప్పటికీ రామ్‌చరణ్‌ను నేనే పరిచయం చేయాలని అడగటంతో 'చిరుత', హరికృష్ణ అడగడటంతో ఎన్టీఆర్‌తో 'స్టూడెంట్ నెంబర్1', అల్లు అర్జున్‌తో 'గంగోత్రి' చిత్రాలు నిర్మించాను. ఇక తండ్రిగా తీసుకుంటే నా పెద్ద కూతురు కులాంతర వివాహం చేసుకోవడంతో ఆ మనస్థాపం నుంచి బయటపడటానికి రెండు మూడు నెలలు పట్టింది.
నా రెండో కూతురు విషయానికి వచ్చేసరికి అది అలవాటైపోయింది. మూడో కూతురు మాత్రం తన పెళ్లిని నాకే వదిలేసింది. నా కూతుర్లు తీసిన 'ఎవడే సుబ్రహ్మణ్యం' చిత్రాన్ని మొదటిసారి నేను థియేటర్‌లోనే చూశాను. ఇంత మంచి చిత్రాన్ని 20ఏళ్ల తర్వాతైనా నేను తీయగలనా? అనిపించి నా కూతుర్ల పట్ల గర్వపడ్డాను. 2017, 2018 సంవత్సరాలలో ఆరేడుచిత్రాలు నిర్మించాలనుకుంటున్నారు. చిరంజీవి, మహేష్‌బాబు, ఎన్టీఆర్‌లతో చిత్రాలు తీయడానికి సన్నాహాలు చేస్తున్నారు. 2018 తర్వాత నిర్మాతగా రిటైర్ అవుతాను, ఆ తర్వాత వైజయంతి బేనర్‌ను నా పిల్లలే చూసుకుంటారు. మా కూతురు స్వప్న మహానటి సావిత్రి బయోపిక్‌ను నిర్మిస్తోంది. ఇందులో ప్రధాన పాత్రను కీర్తిసురేష్ చేయనుండగా, కథను నడిపించే కీలకపాత్రలో సమంత నటించనుంది.
ఇక సావిత్రితో అనుబంధం ఉన్న ఎన్టీఆర్, ఏయన్నార్, ఎస్వీరంగారావు, గుమ్మడి, జెమిని గణేషన్, శివాజీగణేషన్ వంటి మహామహుల పాత్రలకు ఎవరిని తీసుకుంటారో అని ఎదురుచూస్తున్నాను. కానీ నా కూతుర్లు అనుకున్నది సాధిస్తారనే నమ్మకం నాకుంది. రాజకీయాల విషయానికి వస్తే నాకు ఆదర్శం చంద్రబాబు నాయుడు గారే, ఆయన కష్టపడే విధానం, ఆయన ఆలోచనా విధానం వంటివి నాకు ఇన్‌స్పిరేషన్. అందుకే ఆయనతో నడవాలని నిర్ణయించుకున్నాడు. 2004 ఎన్నికల్లో ఎంపీగా పోటీ చేయాలని ఆశపడినా, చంద్రబాబును అడగటానిక మొహమాటపడ్డాను. నా మనసులోని మాటను చిరు, రాఘవేంద్రరావులకు చెప్పాను. చిరు గారు చంద్రబాబు గారికి ఫోన్ చేసి, నా మనసులోని మాటను ఆయనకు చెప్పడంతో విజయవాడ ఎంపీ సీటును బాబు నాకిచ్చారు.
నేను బతికి ఉన్నంతకాలం టిడిపిని ప్రమోట్ చేయడంలో ముందుంటాను. చిరు ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు నన్ను మరోసారి విజయవాడ నుంచి పోటీ చేయమన్నారు. కానీ నేను అంగీకరించలేదు. ఇక నేను 1974లో సినిమాల నిర్మాణం కోసం మద్రాస్ వెళ్లినప్పుడు యం.యస్.రెడ్డిగారు ఇంత పెద్ద మొత్తం సినిమాలలో పెట్టడం దేనికి. టి.నగర్‌లో ఒక్కో గ్రౌండ్ విలువ రూ.4,800 రూపాయలు మాత్రమే. వాటిని కొనమని సలహా ఇచ్చినా నేను వినలేదు. అదే ఆ డబ్బుతో అప్పుడు రియల్‌ఎస్టేట్‌లో పెట్టి ఉంటే 125 గ్రౌండ్స్ కొనగలిగే వాడిని. నేడు దాని విలువ 400కోట్లకు పైగా ఉండేది. కానీ సినిమాలపై నాకున్న అభిమానమే నన్ను నిర్మాతను చేసింది. హైదరాబాద్‌కు షిఫ్ట్ కావడం నాకు ఇష్టంలేకపోయినా దాని వల్ల నాకు మేలే జరిగింది. సినిమా తప్ప ఏమీ తెలియని నేను రియల్‌ఎస్టేట్ రంగంలోకి ప్రవేశించాను.....అంటూ తన మనసులోని మాటలను పంచుకున్నాడు.