Advertisement

విశాల్...ఈసారి వాళ్ళకి స్పాట్ పెట్టాడు..!

Thu 17th Nov 2016 05:10 PM
vishal,tamil film producers council,vishal hero,nadigar sangam  విశాల్...ఈసారి వాళ్ళకి స్పాట్ పెట్టాడు..!
విశాల్...ఈసారి వాళ్ళకి స్పాట్ పెట్టాడు..!
Advertisement

తెలుగువాడైనప్పటికీ చెన్నైలోనే పుట్టి పెరిగిన విశాల్‌ తమిళంలో మంచి యాక్షన్‌ హీరోగా క్రేజ్‌ సంపాదించుకున్నాడు. ఇక అక్కడ తానే నిర్మాతగా తన చిత్రాలను విశాల్‌ ఫిల్మ్‌ఫ్యాక్టరీ బేనర్‌పై నిర్మించి, వాటిని తెలుగులో కూడా అనువాదం చేస్తూ మాస్‌ చిత్రాల ప్రేక్షకులను బాగానే అలరిస్తున్నాడు. కాగా విశాల్‌ ఆమధ్య జరిగిన నడిగర్‌ సంఘం ఎన్నికల్లో సీనియర్‌ తమిళ హీరో శరత్‌కుమార్‌ను బహిరంగంగా ఎదిరించి గెలుపొందాడు. వాస్తవానికి తమిళులపై భాషా, ప్రాంతీయత నరనరాన జీర్ణించుకున్న దురభిమానులనే పేరుంది. కానీ విచిత్రంగా నాటి ఎంజిఆర్‌ నుండి జయలలిత, రజనీకాంత్‌ వరకు తమిళులు విపరీతంగా ఆదరించిన వారందరు తమిళులు కాదు. దాన్ని మరోసారి విశాల్‌ నిరూపించాడు. శరత్‌కుమార్‌ను వ్యతిరేకించి నడిగర్‌ సంఘం ఎన్నికల్లో విశాల్‌ను అంత మంది నటీనటులు ఆదరిస్తారని చాలా మంది ఊహించలేదు. కానీ విశాల్‌ ఈ ఎన్నికల్లో ఘనవిజయం సాధించాడు. తాజాగా ఆయన తమిళ నిర్మాతల మండలి సభ్యులపై మండిపడ్డాడు. తమిళ చిత్రాల పైరసీని అడ్డుకునేందుకు నిర్మాతల మండలికి ఎన్నికైన సభ్యులు ఏ మాత్రం చర్యలు తీసుకోవడం లేదని, పైరసీ జరిగిన చిత్ర నిర్మాతలు నిర్మాతల మండలికి ఫిర్యాదు చేయడానికి వస్తే నిర్మాతల మండలి పట్టించుకోవడం లేదని, బోండాలు, భజ్జీలు తినడానికే వారికి సమయం చాలడం లేదంటూ సెటైర్లు వేశాడు. తాను నిర్మాతను కాబట్టి ఓ చిత్రం పైరసీకి గురయితే ఎంత బాధగా ఉంటుందో? ఎంతగా నష్టలు వస్తాయో? తెలుసునని, కానీ ఈ విషయం నిర్మాతల మండలికి ఎన్నికైన ప్రతినిధులకు అర్ధం కావడం లేదంటూ విరుచుకుపడ్డాడు. దీంతో తమిళ నిర్మాతల మండలి విశాల్‌పై ప్రతీకారం తీర్చుకుంది. ప్రొడక్షన్‌ కౌన్సిల్‌ నుండి విశాల్‌ను సస్పెండ్‌ చేసింది. దీంతో తన సత్తా ఏమిటో తెలియజేసేందుకు విశాల్‌ నిర్ణయించుకున్నాడు. త్వరలో జరగబోయే నిర్మాతల మండలి ఎన్నికల్లో కూడా పోటీ చేస్తానని ప్రకటించాడు. కాగా విశాల్‌ నిర్మాతల మండలి గురించి సరిగానే చెప్పాడని, ఆయన చేసిన ఆరోపణలు అక్షరసత్యాలేనని, కానీ బహిరంగంగా విమర్శిస్తే తమను కూడా విశాల్‌ను చేసినట్లు సస్పెండ్‌ చేస్తారని తాము నోరువిప్పడం లేదని 99శాతం నిర్మాతలు విశాల్‌ మాటలను సమర్ధిస్తున్నారు. కాగా విశాల్‌ను తాము ఓ తెలుగువాడిగా చూడలేదని, చెన్నై వరదల సమయంలోనే గాక ఇటీవల నానా బాధలు పడుతున్న తమిళ రైతులకు ఆయన చేసిన సాయం గొప్పదని, సొంత చెన్నై వాసులు, తమిళుల ఇండస్ట్రీ వారు కూడా ఈ విషయాలలో విశాల్‌ స్పందించినట్లు స్పందించలేదని కొందరు బహిరంగానే వ్యాఖ్యానిస్తున్నారు. మొత్తానికి ఇంట గెలిచి రచ్చ గెలవాలనే సామెతను మార్చి, ఇంటి కంటే రచ్చ గెలవడమే నిజమైన హీరోయిజమని, విశాల్‌ రీల్‌ లైఫ్‌లోనే కాదు.. రియల్‌లైఫ్‌లో కూడా హీరో అని ఎవరైనా ఒప్పుకోవాల్సిందే. 

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement