కొత్త కొత్త హీరోయిన్లు పరిచయం అవుతున్నప్పటికీ టాలీవుడ్‌లో హీరోయిన్ల కొరత కొనసాగుతూనే ఉంది. ఒకే హీరోయిన్‌తో పలు చిత్రాల్లో నటించడానికి మన స్టార్ హీరోలు సిద్దంగా లేరు. దీంతో ప్రతి సినిమాకి హీరోయిన్ల కొరత ఏర్పడుతూనే ఉంది. కొందరేమో నటించిన వారితోనే నటిస్తుంటే, మరికొందరేమో కాంప్రమైజ్ అయ్యేది లేదని నిర్మాత దర్శకులకు స్పష్టం చేస్తున్నారు. తాజాగా ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందనున్న 'జనతా గ్యారేజ్' చిత్రంలో ఇప్పటివరకు హీరోయిన్ కన్‌ఫర్మ్ కాలేదు. చివరకు సమంత పేరే వినిపిస్తున్నప్పటికీ ఇప్పటివరకు ఆమెతో ఎన్టీఆర్ చాలాసార్లు జోడీ కట్టివున్నాడు. ఈ చిత్రానికి ముహూర్తం కుదిరి రెండు నెలలు పూర్తయింది. కానీ ఇప్పటికీ ఎన్టీఆర్‌కు జోడీగా ఎవరిని తీసుకోవాలి? అనే విషయంలో యూనిట్ ఫైనల్ డెసిషన్‌కు రాలేకపోతోంది. ఇక రామ్‌చరణ్ విషయానికి వస్తే ఆయన తమిళ హిట్ చిత్రం 'తని ఒరువన్' రీమేక్‌లో నటించడానికి నిర్ణయం తీసుకొని చాలా కాలం అయింది. వచ్చే నెలలో ఈ చిత్రం సెట్స్‌పైకి వెళ్లనుందని సమాచారం. కానీ ఈ చిత్రంలో కూడా ఇప్పటివరకు హీరోయిన్ కన్‌ఫర్మ్ కాలేదు. ఇక ఒకసారి నటించిన హీరోయిన్‌తో మరో సారి కలసి నటించడానికి ఉత్సాహం చూపని మహేష్ సైతం తన 'బ్రహ్మోత్సవం' చిత్రంలో సమంత, కాజల్ వంటి వారితో కలిసి నటిస్తుండటం హీరోయిన్ల కొరతకు నిలువెత్తు సాక్ష్యంగా నిలుస్తుంది. మరి స్టార్‌హీరోల జోడీ సమస్యను మన దర్శకనిర్మాతలు ఎంత తొందరగా పరిష్కరిస్తే అంత మంచిదని విశ్లేషకుల అభిప్రాయం.