Advertisementt

ఇది కె బి తిలక్ శత జయంతి సంవత్సరం

Thu 22nd Jan 2026 02:00 PM
k b tilak  ఇది కె బి తిలక్ శత జయంతి సంవత్సరం
K B Tilak Birth Centenary ఇది కె బి తిలక్ శత జయంతి సంవత్సరం
Advertisement
Ads by CJ

ఇదేనండి ఇదేనండి భాగ్యనగరం - మూడు కోట్ల ఆంధ్రులకు ముఖ్య పట్టణం.. అన్న గీతం ద్వారా 1956 నవంబరు 1న కొత్తగా ఏర్పాటైన రాజధాని నగరం హైదరాబాద్ గురించి తెలుగు ప్రజలందరికీ తెలియాలనే ఆలోచన నిర్మాత, దర్శకుడు కె. బి. తిలక్ ది. ఈ గీతాన్ని పెండ్యాల నాగేశ్వర రావు స్వర కల్పనలో ఘంటసాల, ఎస్. జానకి గానం చేశారు, ఆరుద్ర వ్రాశారు. ఇది ఎం. ఎల్. ఏ చిత్రంలోనిది. పెద్దమనుషుల ఒప్పందం, రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ చట్టం ద్వారా ఆంధ్రను, హైదరాబాద్ రాష్ట్రంలోని తెలుగు మాట్లాడే ప్రాంతాలను విలీనం చేయడం ద్వారా ఆంధ్రప్రదేశ్ ఏర్పడింది. కొత్త రాష్ట్రానికి హైదరాబాద్ ను రాజధానిగా చేశారు.

19 సెప్టెంబర్ 1957న తిలక్ దర్శకత్వం వహించిన ఎం. ఎల్. ఏ సినిమా విడుదలయ్యింది. ఏడు దశాబ్దాల క్రితం తిలక్, భాగ్యనగర్ చారిత్రక నేపధ్యం, వైభవం గురించి తన చిత్రంలో చూపించడం విశేషం. ఇది హైదరాబాద్ నగరం మీద వచ్చిన మొదటి పాటగా చెప్పుకోవచ్చు. తిలక్ తెలుగు సినిమాలో విలక్షణ దర్శకుడు, వినూత్న నిర్మాత, ప్రయోగ శీలి, ప్రతిభాశాలి, దార్శనికుడు. తిలక్ సామాన్యంగా కనిపించే అసమాన్యుడు. ఇది తిలక్ శత జయంతి సంవత్సరం. (14-01-1926 - 14-01-2026). కె. బి. తిలక్ పూర్తి పేరు కొల్లిపర బాల గంగాధర తిలక్. తిలక్ తండ్రి కొల్లిపర వేంకటాద్రి, వారిది పశ్చిమ గోదావరి జిల్లాలోని దెందులూరు గ్రామం. తల్లి సుబ్బమ్మ. ఈమె ఎల్. వి. ప్రసాద్, అక్కినేని సంజీవి సోదరి. తండ్రి వేంకటాద్రి పై స్వాతంత్య్ర సమర యోధుడు. జాతీయోద్యమ నాయకుడు బాల గాంధార తిలక్ ప్రభావం వుంది. 1926 జనవరి 14న జన్మించిన తన కుమారునికి బాల గంగాధర తిలక్ అని పేరు పెట్టారు. ఎల్. వి. ప్రసాద్ తిలక్ మేనమామ. వీరిది సంపన్నమైన కుటుంబం.

చిన్నప్పుడే తిలక్ మీద స్వాతంత్య్ర ఉద్యమ ప్రభావం వుంది. 1942లో బ్రిటిష్ పాలను వ్యతిరేకంగా రైళ్లను ఆపడం, పట్టాలను తొలగించడం, టెలిఫోన్ వైర్లను కత్తిరించడంతో తిలక్ ను భీమడోలులో అరెస్టు చేసి రాజమండ్రి జైలుకు పంపించారు. 16 ఏళ్ళ వయసులో జైలులో సాటి మనుషుల దుర్భర జీవితం చూసి చలించిపోయాడు. రాజమండ్రి జైలు నుంచి విడుదలయిన తరువాత చేతిలో డబ్బు లేకవడంతో దెందులూరు వరకు నడచి వెళ్ళాడు. చదువు పట్ల ఆసక్తి లేదు. ప్రజా కళలంటే ఇష్టం ఏర్పడింది. ముదిగొండ జగ్గన్న శాస్త్రి ప్రోత్సహంతో ప్రజానాట్యమండలిలో చేరాడు. డప్పులు వాయిస్తూ, నాటకాలు ఆడుతూ, విప్లవ గీతాలు పాడుతూ గ్రామాల్లో తిరిగేవాడు. ఆ తరువాత ముంబై లో వున్న మేనమామ ఎల్. వి. ప్రసాద్ దగ్గరకు వెళ్ళాడు. అప్పటికి ప్రసాద్ సినిమా రంగంలో స్థిరపడలేదు. తిలక్ అనేక చిన్న ఉద్యోగాలు చేశాడు. తరువాత పీపుల్స్ థియేటర్ లో చేరి బలరాజ్ సహానితో తో కలసి నాటకాలు ఆడటం మొదలు పెట్టారు.

అప్పటికే మేనమామ ఎల్ .వి .ప్రసాద్ ముంబైలో సినిమా రంగంలో వున్నాడు. 1945లో ఎల్. వి ప్రసాద్ కు గృహ ప్రవేశం సినిమాలో నటించడానికి అవకాశం వచ్చింది. తిలక్ ప్రసాద్ తో కలసి మద్రాస్ వచ్చాడు. మద్రాసు వచ్చిన తరువాత ఎం. వి. రాజన్ అనే ఫిలిం ఎడిటర్ దగ్గర చేరాడు. ఈ ఇద్దరు కకలసి సినిమాలకు ఎడిటర్లుగా పనిచేస్తున్నారు. నవయుగ ప్రొడక్షన్స్ సంస్థ సి. వి. శ్రీధర్ దర్శకత్వంలో జ్యోతి అనే సినిమా మొదలు పెట్టారు. ఈ సినిమాలో జి. వరలక్ష్మి, సావిత్రి, శ్రీరామ మూర్తి, కశ్యప నటించారు. అయితే దర్శకుడు శ్రీధర్ కు నిర్మాతలకు మాట పట్టింపు వచ్చి అతను దర్శకత్వం నుంచి తప్పుకున్నారు. అప్పుడు నిర్మాతలు ఎడిటర్ గా వున్న తిలక్ ను దర్శకత్వం వహించమని కోరారు. రాజన్ కూడా ప్రోత్సహించారు. ఆలా ఆగిపోయిన జ్యోతి సినిమాను తిలక్ పూర్తి చేశారు. ఈ సినిమా 30 ఏప్రిల్ 1954లో విడుదలయ్యింది. ఇందులో శ్రీధర్ తో పాటు దర్శకుడుగా తిలక్ పేరు కూడా వేశారు. అలా అనుకోకుండా తిలక్ దర్శకత్వం వైపు వచ్చారు.

ఆ తరువాత దర్శకుడుగా కొనసాగాలని నిర్ణయించుకొని అనుపమ ఫిలిమ్స్ సంస్థను ప్రారంభించి ముద్దు బిడ్డ అన్న సినిమాను ప్రారంభించారు. జ్యోతి సినిమాలో ప్రధాన పాత్రలో నటించిన జి. వరలక్ష్మి ని తీఎంపిక చేసుకున్నారు. సినిమా షూటింగ్ సగం అయిన తరువాత ఒక డైలాగ్ విషయంలో ఆమెకు తిలక్ కు మనస్పర్థలు వచ్చాయి. తిలక్ రాజీపడనని చెప్పారు. వరలక్ష్మి సినిమా నుంచి తప్పుకుంది. తిలక్ ఆమె స్థానంలో లక్ష్మి రాజ్యం ను ఎంపిక చేసి మళ్ళీ షూటింగ్ ప్రారంభించారు. ఆ తరువాత దర్శకుడుగా తిలక్ ప్రస్థానం మొదలయ్యింది. ఎం. ఎల్. ఏ (1957) అత్తా ఒకింటి కోడలే (1958) చిట్టి తమ్ముడు (1962) ఉయ్యాల జంపాల (1965) ఈడుజోడు (1967) పంతాలు పట్టింపులు (1968) ఛోటీ బహు, కంగన్ (1971) భూమి కోసం (1974) కొల్లేటి కాపురం (1976) ధర్మవడ్డీ (1982) చిత్రాలను రూపొందించారు. ఎం. ఎల్. ఏ చిత్రం ద్వారా జె. వి. రమణ మూర్తి ని, అదే సినిమాలో నీ ఆశా అడియాస చేజారే మణిపూస అన్న పాటతో గాయని ఎస్. జానకి ని, భూమి కోసం చిత్రం ద్వారా జయప్రదను తెరకు పరిచయం చేశారు. తన తమ్ముడు కొల్లిపర రామ నరసింహా రావు నక్సలైట్ ఉద్యమంలో చనిపోయాడు. అతని స్మృతికి భూమి కోసం సినిమాను అంకితం చేశారు. 1974లో వచ్చిన భూమికోసం తెలుగులో వచ్చిన తొలి నక్సలైట్ సినిమా. కె. బి తిలక్ నిర్మించిన సినిమాలకు సంగీత దర్శకుడు పెండ్యాల నాగేశ్వర రావు కాగా పాటల రచయిత ఆరుద్ర కావడం విశేషం. ఈ ముగ్గురి కలయికలో చిరస్మరణీయమైన ఎన్నో పాటలు వచ్చాయి.

1982లో ధర్మ వడ్డీ దర్శకుడుగా చివరి చిత్రం. నిర్మాత, దర్శకుడు యు.విశ్వేశ్వర రావు 1979లో రూపొందించిన నగ్నసత్యం సినిమాలో తిలక్ ఓ ముఖ్య పాత్రలో నటించాడు. తిలక్ పై ప్రజానాట్యమండలి, వామపక్ష భావ జాలం ఎక్కువగా వుంది. ఆయన నిర్మించిన సినిమాలు కుటుంబ విలువలు, సామాజిక న్యాయం, సమకాలీన సమస్యలను ప్రతిబింబించేవి. భారత, పాకిస్తాన్ రాజకీయంగా విడిపోయినా, ఐదు దేశాల ప్రజలు సోదర భావంతో వుండాలని కోరుకున్నాడు. ఈ రెండు దేశాల మధ్య సాంస్కృతిక అనుబంధం వుండాలని కృషి చేసిన అభ్యుదయవాది తిలక్. కాంగ్రెస్ పార్టీతో ఆయనకు సన్నిహిత సంబంధాలు ఉండేవి. అప్పటి గవర్నర్ శ్రీమతి కుముద్ బెన్ జోషి, నాటి ప్రధాని రాజీవ్ గాంధీతో తిలక్ కు పరిచయాలు ఉండేవి. అయితే తన పరిచయాలను తిలక్ ఏరోజు తన స్వతానికి వాడుకోని నిస్వార్ధ జీవి, నిరాడంబరుడు. తెలుగు సినిమా కార్మికుల కోసం నిరంతరం, పరిశ్రమించేవారు, పరితపించేవారు తెలుగు సినిమాకు వైతాళికుడు రఘుపతి వెంకయ్య నాయుడు విగ్రహాన్ని ఫిలింనగర్ లో పెట్టించడానికి అవిశ్రాంతంగా కృషిచేసి, ఫిలింనగర్ హౌసింగ్ సొసైటీ ఎదురుగా 19-01-2010న అప్పటి ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య గారితో ఆవిష్కరింపజేసిన కార్యశూరుడు తిలక్. తెలుగు సినిమాలో తిలక్ ముద్ర ఎప్పటికీ చెరిగిపోదు. తిలక్ తన 84వ ఏట సెప్టెంబర్ 23, 2010లో ఇహలోక యాత్ర ముగించారు.

 >✍️భగీరథ, సీనియర్ జర్నలిస్ట్.

K B Tilak Birth Centenary:

This is the year of K. B. Tilak birth centenary.

Tags:   K B TILAK
Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ