Advertisementt

సినీజోష్ రివ్యూ: ది రాజా సాబ్

Fri 09th Jan 2026 08:22 AM
the raja saab telugu review  సినీజోష్ రివ్యూ: ది రాజా సాబ్
Cinejosh Review: The Raja Saab సినీజోష్ రివ్యూ: ది రాజా సాబ్
Advertisement
Ads by CJ

సినీజోష్ రివ్యూ: ది రాజా సాబ్ 

నటీనటులు: ప్రభాస్, సంజయ్ దత్, మాళవిక మోహనన్, నిధి అగర్వాల్, రిద్ధి కుమార్, జరీనా వాహబ్, బొమన్ ఇరానీ, విటివి గణేష్, సప్తగిరి, సత్య, సముద్ర ఖని, ప్రభాస్ శ్రీను తదితరులు

ఎడిటర్: కోటగిరి వెంకటేశ్వరరావు 

సినిమాటోగ్రఫీ: కార్తీక్ పళని

సంగీతం: ఎస్ థమన్ 

నిర్మాత: టిజి విశ్వప్రసాద్ 

రచన, దర్శకత్వం: మారుతి

విడుదల తేదీ: 09-01-2026

డిఫరెంట్ డిఫరెంట్ సబ్జెక్టులని ఒప్పుకోవడం 

ప్రభాస్ స్టైల్ !

వెరైటీ వెరైటీ క్యారెక్టర్స్ కై సిద్ధపడడం 

ప్రభాస్ స్ట్రెంగ్త్ !

అందుకే ఈ రెబల్ స్టార్ చేసినన్ని 

విభిన్నచిత్రాలు, వైవిధ్యభరిత పాత్రలు 

ఈ జనరేషన్ లోని మరే స్టార్ హీరో 

ట్రాక్ రికార్డు లోను కనపడవు. 

ఇప్పుడు అదే కోవలో ప్రభాస్ చేసిన 

లేటెస్ట్ ఎక్స్ పెరిమెంట్.. ది రాజా సాబ్

పాన్ ఇండియా స్టార్ అయిన ప్రభాస్ - మారుతి వంటి మిడ్ రేంజ్ డైరెక్టర్ కి ఓకే చెప్పడమే ఒక వింత అనుకుంటే.. అదీ హారర్ మూవీ అంటూ ప్రకటన రావడం అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తింది. అభిమానుల్లో అయితే భయం రేకెత్తించింది. కానీ ఇది కేవలం హారర్ మూవీయే కాదనీ హారర్ ఫాంటసీ అనీ, హారర్ థ్రిల్లర్ అనీ, హారర్ కామెడీ అనీ, యాక్షన్ అండ్ రొమాన్స్ కూడా ఫుల్లుగా వుండే పక్కా కమర్షియల్ సినిమా అనీ చెబుతూ రాజా సాబ్ పై కొంతమేరకు మంచి అంచనాలను రప్పించగలిగారు దర్శకుడు మారుతి. ఇక ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ప్రభాస్ కూడా కాస్త కాన్ఫిడెంట్ స్పీచ్ ఇవ్వడంతో ఫ్యాన్స్ లాట్స్ ఆఫ్ హోప్స్ తో థియేటర్స్ కి కదిలారు. నైజాంలో ప్రీమియర్స్ విషయం గందరగోళానికి గురి చేసినా ఆంధ్రతో సహా ఇతర అన్ని చోట్ల నిన్న నైట్ నుంచే రాజా సాబ్ రచ్చ షురూ అయిపొయింది. మరింతకీ మారుతి తన మాట నిలుపుకున్నారా లేక తన పాత పక్కా కమర్షియల్ బాటలోనే సాగారా అన్నది సమీక్షలో చూద్దాం.

మారుతి ఏం చెప్పి ఒప్పించారు (కథ)

ప్రభాస్ - మారుతి కాంబినేషన్ ఏంటసలు అని ఎందరిలోనో ఎన్నో సందేహాలున్నా... ప్రభాస్ వంటి హ్యూజ్ స్టార్ మోజు పడ్డారంటే మారుతి కథలో ఎంతో కొంత విషయం ఉండే ఉంటుంది అనేది కొందరి నమ్మకం. మరి ఆ సందేహమే సరైనదా లేక నమ్మకం నిజమైందా? కథేంటో తెలిస్తే క్లారిటీ మీకే వచ్చేస్తుంది. అనగనగా ఓ మహల్. అందులో ఒక క్షుద్ర శక్తి వంటి ప్రేతాత్మ. ఆ ప్యాలెస్ లోకి ఎవరు ఎంటర్ అయినా ఎగ్జిట్ ఉండదనే నానుడి. అందులోకి హీరోగారి ప్రవేశం. ఆ ఆత్మతో చేసే పోరాటం. అంతం చేసే విధానం. ఇదీ క్లుప్తంగా కథ. మారుతి గారు నాలుగున్నర గంటల నిడివిని తీసి మూడు గంటలకు కుదించి వదిలిన కఠోర కథ. ఇంతోడిదానికి మూడేళ్లు ఎందుకు చెక్కారో అంతుచిక్కని, అర్ధం కాని, అర్ధం లేని కథ. సరే.. కథదేముంది.. కథనం కదా ముఖ్యం అంటారా. ఆ చక్కని భాగోతాన్నీ చర్చించుకుందాం.

మారుతి తెర పైకి ఏం రప్పించారు (కథనం)

సినిమా ప్రారంభంలోనే ఓ బంగ్లాను చూపించి భయం పుట్టించాలి. ఆపై హీరోగారి ఎంట్రీ. ఒక పాట. ఒక ఫైటు. ఒక నానమ్మ. ఒక అవసరం. హీరోగారు ఆ భయంకర బంగ్లాకు బయలుదేరాలి. మధ్యలో ఒక ఆకర్షణ. ఆ అమ్మాయి అందాల ఆరబోతతో మరొక పాట చిత్రణ. హీరోగారిని ప్రేమించే ఒకమ్మాయిని చూపించి, హీరోగారు ప్రేమించే మరో అమ్మాయినీ తెచ్చేసాం కనుక ఇక మూడో భామని లాక్కొచ్చే తరుణం. మధ్యలో అన్నీ ల్యాగ్ సీన్లు. స్టాకు జోకులు. మొత్తానికి హీరోగారిని మహల్ కి చేర్చాక విరామ సమయమనే విషయం గుర్తొచ్చి విలన్ గారు దర్శనమిస్తారు. ఇంటర్వెల్ లో బయటికి వచ్చిన బ్రిలియంట్ ఆడియన్స్ ఎందుకైనా మంచిదని ఇంటి అడ్రెస్ మొబైల్ లో టైపు చేసుకుని పెట్టుకుంటారు. ఇక సెకండాఫ్ మొదలయ్యాక కూడా అదే లాగుడు.. అవే ల్యాగులు. హర్రర్ సినిమాలో ఎర్రర్ లా చిర్రెత్తించే చిరాకైన కామెడీని, భయపెట్టే ప్రదేశంలో ఉండి కూడా భామలతో రొమాన్స్ చేసే హీరోగారిని చూసి సగటు ప్రేక్షకుడిలో స్పందన కరువవుతుంది. సరిగ్గా జనానికి మతి భ్రమించే సమయానికి మారుతి గారిలో చలనం వచ్చి, జాలి కలిగి కాస్త విషయం ఉన్న క్లయిమాక్స్ తో ముగిస్తారు. చలికాలంలో కూడా నిట్టూర్పులతో వేడెక్కిపోయిన థియేటర్స్ నుంచి జనం దీంతో పోల్చుకుంటే ఎంత చలినైనా భరించెయ్యొచ్చనే భావనతో వేగంగా బయటికి కదులుతారు. ఇదీ మ్యాటర్ !

మారుతి ఏ విధంగా నొప్పించారు (విశ్లేషణ)

విషయం వీక్ గా ఉన్నప్పుడే పబ్లిసిటీ పీక్ లో ఉంటుందనే పాపులర్ డైలాగ్ ఒకటుంది. మరి అదే ఫాలో అయ్యారో లేక తాను తీసిందే అద్భుతమనే ఫీలింగ్ లో ఉన్నారో కానీ, రాజా సాబ్ ప్రమోషన్స్ లో చాలా పెద్ద పెద్ద స్టేట్ మెంట్స్ ఇచ్చేసారు మారుతి. చివరికి పబ్లిక్ గా తన ఇంటి అడ్రెస్ కూడా చెప్పేసేంత వరకూ వెళ్ళింది వ్యవహారం. వెయ్యి కోట్లు అలవోకగా తెచ్చిపెట్టగల హీరో.. వందల కోట్లను ధారపోసిన నిర్మాత, మూడేళ్ళ సమయం.. ఇన్ని దొరికినా విషయం లేని కథని విస్తరించుకుంటూ పోయి, వీక్షకులను విసిగించే అవుట్ ఫుట్ పట్టుకొచ్చి, మంచి అవకాశాన్ని మన్ను పాలు చేసుకున్నారు మారుతి. అసలీ సినిమాకి ముగ్గురు హీరోయిన్లు ఎందుకో ఆయనకే తెలియాలి. అసలు సినిమాలోనే లేని ప్రభాస్ ఓల్డ్ గెటప్ ని మోషన్ పోస్టర్ చేయించి మరీ ఎందుకు రిలీజ్ చేసారో ఆయనే చెప్పాలి. స్కై లెవెల్ క్రేజ్ ఉన్నా, హై లెవెల్ డిమాండ్ ఉన్నా స్వీట్ హార్ట్ తో గ్రేట్ ఛాన్స్ ఇచ్చిన డార్లింగ్ ప్రభాస్ కీ - ముఖ్యంగా రేపటినుంచీ రెచ్చిపోయే ప్రభాస్ ఫ్యాన్సుకీ ఆయనే సమాధానం ఇవ్వాలి.

ప్రభాస్ ఏ మేరకు మెప్పించారు (వివరణ)

ఈ సినిమాకు ఏకైక సేవింగ్ గ్రేస్.. డార్లింగ్ ప్రభాస్. చాలా సంవత్సరాల తరువాత మాంచి స్టైలిష్ లుక్ లో కనిపించిన ప్రభాస్ తన ఇన్ బిల్ట్ గ్లామర్ తో కవ్వించారు. నవ్వించారు. మారుతి తప్పిదాన్ని తన స్క్రీన్ ప్రెజన్స్ తో కాస్తయినా కప్పిపుచ్చే ప్రయత్నం చేసారు. కానీ బాగా ఫైట్స్ చేసే ప్రభాస్ అక్కడున్నపుడు అవి ఆ స్థాయిలో డిజైన్ చేసుకోవాలి కదా. చాలాకాలానికి చిందేసేందుకు ప్రభాస్ సిద్ధపడ్డప్పుడు ఆ పాటల్లో అంతటి మ్యాటర్ పెట్టుకోవాలి కదా. అవేమీ జరగలేదు. అందుకే అభిమానులకి ఆశించిన ఊపు రాలేదు. అసలు ప్రభాస్ ఒక్కొక్క సీన్ లో ఒక్కొక్కలా కనిపించడం ఏంటనేది ఎవ్వరికీ అర్ధం కావట్లేదు. అయితే సినిమా మొదట్లో తనదైన కామెడీ టైమింగ్ చూపించిన ప్రభాస్ ఆపై హాస్పిటల్ సీన్ లోను, క్లయిమాక్స్ పార్ట్ లోను అభినయంతో బాగా ఆకట్టుకున్నారు. రెండు పాటల్లో చలాకీగా స్టెప్పులేసి ఫ్యాన్సుకి తనవంతు కనువిందు చేసారు.

ప్రమాదాన్ని టీమ్ ఎంతవరకు తప్పించారు (విచక్షణ)

సినిమాటోగ్రాఫర్ కార్తీక్ పళని బాగానే కష్టపడ్డారు కానీ విలక్షణత లేవి VFX వల్ల విజువల్ క్వాలిటీలో లోపాలు కనిపించాయి. ముఖ్యంగా సెట్స్ అన్నీ సెట్స్ లాగే తెలిసిపోవడం ఈ తరహా సినిమాలకు అసలు సెట్ కాదు. సీనియర్ ఎడిటర్ కోటకిరి వెంకటేశ్వరరావు నాలుగున్నర గంటల ఫుటేజ్ ని మూడు గంటలకు కుదించారు కానీ అందులోని మరో అరగంట అక్కర్లేని నసని వదిలేసారు. థమన్ ఏదో దంచేసే ప్రయత్నం చేసినా నేపథ్య సంగీతం అంతంత మాత్రంగానే వుంది. పాటలైతే ప్రభాస్ లాంటి హీరోకి ఇవ్వాల్సినవి కావు. ఆ మాటకొస్తే ప్రస్తుతం వున్న ఫామ్ లో థమన్ చెయ్యాల్సినవే కావు. రాజా సాబ్ కోసం ముందు కంపోజ్ చేసిన పాటలను పక్కన పెట్టి ఫ్రెష్ గా మళ్ళీ చేస్తున్నానని ప్రకటించిన థమన్ బహుశా ముందే బాగా చేసి ఉంటారేమో. నిన్న తను రిలీజ్ చేసిన పాట వింటే మీరూ ఇదే మాట అంటారు. ఇక ఇతర సాంకేతిక వర్గమంతా పారితోషికాలకి, మారుతి గారి విధానాలకి, విజువల్ సెన్స్ కి తగ్గట్టే పనిచేసారు. 

నటీనటుల్లో ప్రభాస్ తరువాత ప్రముఖ పాత్రలు బాలీవుడ్ ఆర్టిస్టులు సంజయ్ దత్, జరీనా వాహబ్, బొమన్ ఇరానీలకు దక్కాయి. ముఖ్యంగా జరీనా వాహబ్ హీరో నాయనమ్మ పాత్రకు ప్రాణం పోశారు. సంజయ్ దత్ స్థాయికి తగ్గ స్ట్రెంగ్త్ ఆ పాత్రలో కొరవడింది. బొమన్ ఇరానీకి ఇలాంటి పాత్రల పోషణ ఎప్పుడో కేక్ వాక్ లాగా మారింది. సముద్రఖని పాత్ర పరిమితం. కమెడియన్లు ఎంతోమంది వున్నా కామెడీ ఎందుకు పండలేదన్నది ప్రశ్నర్ధాకం. ఇక ఒక హిట్టుకి మూడు ప్లాపులు అన్నట్టుగా సాగుతున్న పీపుల్ మీడియా ఫ్యాక్టరీ కి, నిబద్ధత కలిగిన నిర్మాత TG విశ్యప్రసాద్ పయనానికి ఈ సినిమా కఠినమైన పరీక్షే.. కాస్తంత ప్రమాదమే.!

ప్రేక్షకులతో ఫైనల్ గా ఏం చెప్పించారు (విచారణ)

సకాలంలో రాలేకపోయినా సంక్రాంతి బరిలోకి దిగే మొదటి స్లాట్ దక్కించుకున్నాడు రాజా సాబ్. ఇదే తొమ్మిదో తేదికి రిలీజ్ డేట్ ప్రకటించి ఓవర్సెస్ లో ఓ రేంజ్ లో రెచ్చిపోతోన్న క్రేజీ తమిళ్ చిత్రం జననాయగన్ ఉన్నట్టుండి వాయిదా పడడంతో రాజా సాబ్ రచ్చకు రంగం మరింత మెరుగుపడింది. అయితే రీజనబుల్ టాక్ వచ్చినా రికార్డులు గల్లంతు చేసే మహత్తర అవకాశాన్ని చేజేతులా చెడగొట్టుకున్నారు దర్శకుడు మారుతి. గంపెడాశతో వచ్చిన ప్రేక్షకాభిమానులను గందరగోళానికి గురి చేసి ప్రీమియర్ షోస్ నుంచే డ్యామేజ్ రిపోర్ట్స్ తో స్టార్ట్ అయిన ఈ రాజాసాబ్ జర్నీని ఇక ప్రభాస్ ఇమేజు, సీజన్ అడ్వాంటేజులే నడిపించాలి. అన్నట్టు ఈ చిత్ర రాజానికి సీక్వెల్ కూడా ఉంటుందంటూ, ప్రభాస్ ని జోకర్ గెటప్ లో చూపిస్తూ రాజాసాబ్ సర్కస్ 1935 అనే టైటిల్ ని కూడా ప్రకటించేసారు మావెరిక్ డైరెక్టర్ మారుతి.

(PS: ఎంతో ఆర్భాటంగా రిలీజ్ చేసిన ప్రభాస్ ఓల్డ్ గెటప్ ఇందులో లేకపోవడానికి కారణం.. బహుశా మొదట్లో ఆ లుక్ సీక్వెల్ కోసం అనుకుని, ప్రభాస్ అలా ఎప్పుడు కనిపిస్తారా అని అందరూ ఎదురుచూసేలా చేసి, ఎండ్ లో దాన్ని రివీలింగ్ తో పార్ట్ 2 ఎనౌన్స్ మెంట్ ప్లాన్ చేసి ఉంటారు. అయితే సడెన్ గా మారుతికి సర్కస్ చేయాలని అనిపించడంతో జోకర్ లుక్ లాక్ అయి ఉంటుంది అనేది ఒక విశ్లేషకుడి మాట) 

పంచ్ లైన్ : ది రాజాసాబ్.. నాసిరకం నవాబ్ !

సినీజోష్ రేటింగ్ : 2/5

Cinejosh Review: The Raja Saab:

Cinejosh Telugu Review: The Raja Saab

Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ