Advertisementt

సినీజోష్ రివ్యూ : అఖండ 2

Fri 12th Dec 2025 06:19 AM
akhanda 2 telugu review  సినీజోష్ రివ్యూ : అఖండ 2
Cinejosh Review: Akhanda 2 సినీజోష్ రివ్యూ : అఖండ 2
Advertisement
Ads by CJ

సినీజోష్ రివ్యూ: అఖండ 2 (అఖండ తాండవం)

నటీనటులు : నందమూరి బాలకృష్ణ (ద్విపాత్రాభినయం), సంయుక్త , హర్షాలీ మల్హోత్రా, ఆది పినిశెట్టి, సర్వదమన్ బెనర్జీ,, మురళీమోహన్ , తరుణ్ ఖన్నా, అనీష్ కురువిల్లా, కబీర్ దుహన్ సింగ్, సస్వత ఛటర్జీ, రోన్సన్ విన్సెన్ట్, శాంఘే, విక్రమ్ జీత్, పూర్ణ, శరత్ లోహితాస్వ, విజీ చంద్రశేఖర్, అయ్యప్ప పి శర్మ,, రచ్చ రవి తదితరులు 

యాక్షన్ కొరియోగ్రఫీ: రామ్ లక్ష్మణ్ మరియు రవి వర్మ 

సినిమాటోగ్రఫీ: సి. రాంప్రసాద్ మరియు సంతోష్ దేటకే

సంగీతం: ఎస్. ఎస్. థమన్  

సమర్పణ: M తేజస్విని నందమూరి  

నిర్మాతలు: రామ్ ఆచంట మరియు గోపీ ఆచంట      

రచన, దర్శకత్వం: బోయపాటి శ్రీను 

విడుదల తేదీ :  12-12-2025

బాలకృష్ణ - బోయపాటి కలిశారంటే 

వెండితెర పైన విధ్వంసం గ్యారంటీ 

వారిద్దరి కాంబినేషనే విజయానికి వారంటీ.

సింహా - లెజెండ్ - అఖండ చిత్రాలతో

సెన్సేషనల్ హ్యాట్రిక్ కొట్టిన ఈ కలయికలో 

ప్రతిష్టాత్మకంగా రూపొందిన తాజా చిత్రం 

అఖండ 2 తాండవం.

విడుదల విషయంలో వాయిదా అనివార్యమై ఒక వారం ఆలస్యమైంది కానీ అభిమానుల అంచనాలు మాత్రం ఇంచు కూడా తగ్గకుండా నిలబెట్టుకున్న అఖండ 2 నేడు పాన్ ఇండియా మూవీగా పలు భాషల్లో ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. మరింకెందుకు ఆలస్యం.. ఉన్నపళంగా సమీక్షలోకి వెళ్ళిపోదాం. ఈ అఖండ తాండవ విన్యాసాలను విశ్లేషించుకుందాం.

అఖండ ముగింపే.. తాండవానికి ఆరంభం !

2021 లో ఆఫ్టర్ పాండమిక్ వచ్చి అద్భుత విజయం సాధించిన అఖండ చిత్రం కథ ఎక్కడ ముగిసిందో ఆ ముగింపునే అఖండ 2 ఆరంభంగా చాలా కన్విన్సింగ్ గా మలిచారు బోయపాటి. అఖండ మూవీని రీ క్యాప్ గా చూపిస్తూ, ఆ క్లైమాక్స్ లో పాపకు అఖండ ఇచ్చిన మాటను ప్రేక్షకుల మనసులపై బలంగా ముద్రిస్తూ మొదలుపెట్టిన ఈ పార్ట్ 2 ప్రారంభంలోనే తిరిగి హిమాలయాలకు చేరుకుంటాడు అఖండ. అక్కడ తన గురువు సూచన మేరకు పాశుపతాస్త్రం కోసం అర్జునుడు తపస్సు ఆచరించిన అష్ట సోపానాలపై తాను కూడా నిష్టగా తపస్సుకి ఉపక్రమిస్తాడు. పూర్తిగా తపోముద్రలోకి వెళ్ళిపోతాడు. దాంతో ఎత్తుగడ పూర్తవుతుంది. ప్రత్యర్థుల్ని, ప్రమాదాన్ని పరిచయం చేసే ప్రహసనం మొదలవుతుంది.

ప్రథమార్ధం పరమార్ధం.. అఖండ ఆగమనానికి సర్వం సిద్ధం !

టిబెట్ లో ఒక చైనా ఆర్మీ అధికారి చేసే పాశవిక దాడిని చూపించి, ఆ క్రూరుడికి మరో తెలివైన మూర్ఖుడిని జతపరిచి, వీరిద్దరికీ సహకరించే మన దేశపు రాజకీయ నాయకుడిని తెర పైకి తెచ్చి, భారతదేశ వినాశనానికై వారు చేసే వ్యూహ రచనతో ఒక పదిహేను నిముషాలు గడిచిపోతాయి. ఇక ఆపై అనంతపురం MLA బాల మురళీకృష్ణగా ఒక భారీ ఫైట్ తో ఎంట్రీ ఇచ్చి మాస్ ని మెప్పించే కొన్ని డైలాగులు చెబుతాడు మరో బాలకృష్ణ. DRDO లో పని చేసే యువ శాస్త్రవేత్తగా అతడి కూతురు జనని (హర్షాలీ) , ఆమెకు సీనియర్ గా అర్చన (సంయుక్త) పాత్రల పరిచయం, ఆపై బర్త్ డే పార్టీ సందర్భంగా వచ్చే ఒక మాస్ సాంగ్ తో కాసేపు కాలక్షేపం పంచే ప్రయత్నం జరిగింది. ఇక దుష్ట త్రయం మహా కుంభ మేళాలో వైరస్ వ్యాప్తి చేసే ప్లాన్ వెయ్యడం, ఆ వైరస్ కి జనని యాంటీ డోట్ కనిపెట్టడంతో ఆ అమ్మాయిపై దాడికి తెగబడతారు. అటు అభిమానులకే కాదు సగటు ప్రేక్షకుడికీ కావాల్సింది అదే. ప్రథమార్ధం పరమార్ధం అంతా అఖండ ఆగమనానికి సర్వం సిద్ధం చేయడమే అన్నట్లుగా సాగడంతో అంతా అసలు సిసలు ఘట్టం కోసం ఎదురుచూస్తూ ఉంటారు. అన్ని బోయపాటి సినిమాల్లాగే ఇందులోనూ ఆ విధ్వసం ఇంటర్వెల్ ఎపిసోడ్ గా డిజైన్ చేయబడింది. అందరి అంచనాలకు తగ్గట్లే అది అమోఘంగా రూపొంది ద్వితీయార్ధంపై అంచనాలను పెంచేసింది.

ద్వితీయార్ధమంతా తాండవం.. ఆద్యంతం అఖండ ప్రతాపం !

మొదలైంది అఖండ తాండవం అంటూ ఇంటర్వెల్ కార్డ్ వేసినట్టుగానే ద్వితీయార్ధం మొత్తం తాండవమే.. ఆద్యంతం అఖండ ప్రతాపమే కనిపిస్తుంది. ఫస్టాఫ్ లో మురళీకృష్ణ ఇంట్రో ఫైట్, అఖండ చేసే ఇంటర్వెల్ ఫైట్ మాత్రమే చూపించిన బోయపాటి సెకండాఫ్ లో మాత్రం చెలరేగిపోయారు. మురళీకృష్ణ పాత్ర చితకొట్టేందుకు గంజాయి బ్యాచ్ ని, అఖండ అంతం చేసేందుకు ఏకంగా పక్క దేశపు ప్రత్యర్థుల్ని ప్లాన్ చేసిన బోయ మాస్ అక్కడితో ఆగలేదు. తాంత్రిక విద్యలు నేర్చిన నేత్ర (ఆది పినిశెట్టి) పాత్రను తెర పైకి తెచ్చింది. క్షుద్ర పూజలు భగ్నం చేసే నేపథ్యంతో అఖండ చేత అరివీర భయంకర విన్యాసాలు చేయించింది. ఆ పోరాటమే ఒక స్థాయిలో ఉంటే, ఆ తర్వాత మరింత తాంత్రికుడిగా తయారై వచ్చిన నేత్రను హనుమంతుడిగా మారి అఖండ అతడిని వధించే విధానం అబ్బురపరుస్తుంది. అలాగే అఖండ తల్లి మరణించినపుడు, తనకు తలకొరివి పెట్టాలనే ఆమె చివరి కోరికను అఖండ నెరవేర్చలేని పరిస్థితిలో ఉన్నపుడు సాక్షాత్తు ఆ శివుడి లీలగా చూపబడ్డ దృశ్యం సైతం చక్కగా కుదిరింది. ఇక క్లయిమాక్స్ లో అయితే ఆకాశమే హద్దుగా తాండవం ఆడిన అఖండ భారీ యాక్షన్ ఎపిసోడ్ తో ప్రత్యర్థుల కిరాతకాన్ని, ఈ పార్ట్ 2 కథనీ ముగించాడు. మళ్ళీ తన తపో దీక్ష వైపు సాగుతూ  జై అఖండ పేరుతో పార్ట్ కూడా ఉండొచ్చనే సంకేతానిచ్చాడు.

అఖండగా  బాలకృష్ణ.. మరింత పెరిగింది అభినయ తృష్ణ !

నట విన్యాసం, నట విధ్వంసం, నట విలక్షణం, నట విశ్వరూపం వంటి ఎన్నో ఉపమానాలకు సరితూగేలా సాగింది అఖండ పాత్రలో నందమూరి బాలకృష్ణ అభినయం. దేశం, ధర్మం, దైవం తన ఉచ్వాస నిశ్వాసలుగా భావించే అఘోరా పాత్రను ఆ స్థాయిలో ఆయన తప్ప మరెవరూ చేయలేరు అనేంతగా జీవించారు బాలయ్య. ఆయనకు మాత్రమే సొంతమైన ఆంగికం, వాచకం అందుకు ఎంతగానో సహకరించాయి. ముఖ్యంగా సనాతన హైందవ ధర్మం గురించి జనాలకు హితబోధ చేసేటపుడు, మన దేశ ప్రాశస్త్యం గురించి ప్రత్యర్థులకు చెబుతూ దుష్ట శిక్షణ చేస్తున్నపుడు బాలయ్య డైలాగ్స్ కి ప్రతి థియేటర్ లోను కచ్చితంగా క్లాప్స్ వినిపిస్తాయి. అలాగే కొన్ని రాజకీయ, ప్రస్తుత పరిస్థితులను ప్రతిబింబించేలా ఉన్న డైలాగ్స్ కూడా బాగా పేలాయి. ఇక మురళీకృష్ణగా తెల్లని పంచె కట్టుతో, అచ్చమైన తెలుగింటి నందమూరి అందగాడిగా అభిమానులకు కనువిందు చేయడంతో బాటు ఉన్న ఒకే ఒక్క మాస్ సాంగ్ లో నేటికీ తనలోని ఊపు, ఉత్సాహం తగ్గలేదని చలాకీ స్టెప్పులతో చాటుకున్నారు బాలయ్య.

నటీ నట సాంకేతిక వర్గం.. శ్రమించి కట్టింది అఖండ దుర్గం !

బాలకృష్ణ - బోయపాటి సినిమా అంటేనే భారీ తారాగణానికి, సమర్థులైన సాంకేతిక నిపుణులకి పెట్టింది పేరు. ఈసారి కూడా ఆ నటీ నట సాంకేతిక వర్గం శ్రమించి కట్టింది ఈ అఖండ దుర్గం. ఇందులో బాలకృష్ణ తరువాత అతి కీలకమైన పాత్రలో కనిపించిన భజరంగీ భాయీజాన్ ఫేమ్ హర్షాలీ మెహతా ఆ పాత్రకు అందంగా అమరింది. అర్చన పాత్ర పరిమితమే అయినా ఉన్నంతలో ఓ మాస్ సాంగ్ చేసి, చిన్న యాక్షన్ సీన్ లో పాల్గొని తన ఉనికిని చాటుకుంది సంయుక్త. తాంత్రికుడిగా ఆది పినిశెట్టి ఆహార్యం భయపెడుతుంది. తల్లి పాత్రలో విజీ చంద్రశేఖర్ నటన ఆకట్టుకుంటుంది. శివుడిగా కనిపించిన తరుణ్ ఖన్నా ప్రయత్న లోపం లేదు కానీ, మంచు విష్ణు కన్నప్పలో అక్షయ్ కుమార్ లాగా ఇందులోనూ ఆ పాత్రకి ప్రామినెంట్ యాక్టర్ ని ఎంచుకుని ఉంటే ఆ సీన్ ఆడియన్సుకి మరింత కనెక్ట్ అయ్యేదేమో అనిపించింది. పద్మావతిగా పూర్ణ, ప్రధానమంత్రిగా సర్వదమన్ బెనర్జీ, అలాగే విలన్ పాత్రధారులు అందరూ బోయపాటి సూచనల మేరకు తమ పని నిర్వర్తించారు. అన్నట్టు బోయపాటి వారి తనయుడు బోయపాటి హర్షిత్ ఈ చిత్రంలోని ఒక నాటకీయ సన్నివేశంలో ప్రహ్లాదుడిగా కనిపించడం విశేషం. ఇక ఎప్పట్లాగే టెక్నిషియన్స్ లో మొదట చెప్పుకోవాల్సింది థమన్ గురించే. బాలయ్య సినిమా అంటేనే పూనకంతో ఊగిపోయే థమన్ మరోమారు అదే సీన్ రిపీట్ చేసాడు. కథలోని ప్రధాన అంశం సనాతన ధర్మానికి తగ్గట్టే శ్లోకాలతో, శాస్త్రీయ సంగీతంతో సినిమాని హోరెత్తించాడు. మాస్ సాంగ్ అయితే ఇక చెప్పక్కర్లేదు. అయితే ఈసారి భావోద్వేగాలు పెంచడానికి బదులు సంగీతంలో శబ్దాలను పెంచడానికే ఎక్కువ మక్కువ చూపినట్లుగా ఉంది థమన్ BGM. సి. రాంప్రసాద్ మరియు సంతోష్ దేటకే అందించిన ఛాయాగ్రహణం నిండుగా ఉంది. ముఖ్యంగా హిమాలయాల దృశ్యాలు, కుంభమేళా దృశ్యాలతో బాటు తాంత్రికుడు నేత్ర క్షుద్ర పూజను భగ్నం చేసే ఘట్టంలోనూ విజువల్స్ ఆకట్టుకుంటాయి. రామ్ లక్ష్మణ్ మరియు రవి వర్మ డిజైన్ చేసిన యాక్షన్ ఎపిసోడ్స్ బోయపాటి శైలికి అనుగుణంగా, బాలయ్యకు మాత్రమే నప్పుతాయి అనుకునేలా ఉన్నాయి. తమ్మిరాజు ఎడిటింగ్ లో ఇంకాస్త శ్రద్ధ చూపించాల్సింది. సినిమా కోసం భారీగానే ఖర్చు పెట్టిన నిర్మాతలు VFX విషయంలో కూడా కాంప్రమైజ్ కాకుండా ఉండాల్సింది. 

దర్శకుడిగా ఘనాపాటి.. రచయితగా రాణించని బోయపాటి !

తన హీరోలని అత్యంత శక్తివంతులుగా చూపడంలో, అందుకు తగ్గట్టుగా యాక్షన్ పార్ట్ డిజైన్ చేయడంలో ఘనాపాటి బోయపాటి. అదీ బాలయ్యతో అంటే ఇక చెప్పక్కర్లేదు. మాస్ సినిమాలపై మోజు పడే బోయపాటికి బాలకృష్ణ భయంకరమైన మాస్ ఇమేజ్ వరంలా మారింది. అందుకే సింహాలో ఫ్యాక్షనిస్టులని నరికించాడు. లెజెండ్ లో పొలిటీషియన్స్ ని ఉరికించాడు. అఖండలో ఏకంగా దైవత్వాన్ని జోడించి మరింత విజృంభించమన్నాడు. ఇక ఈ సినిమాకి వచ్చేసరికి ఎంతటి ప్రమాదాన్ని చూపాలి, ఎలాంటి ప్రత్యర్థుల్నిపెట్టాలి అనే మీమాంసతో సరిహద్దుల వరకు వెళ్లి సర్జికల్ స్ట్రయిక్ చేయించాల్సి వచ్చింది. అది ఆలోచనగా బాగుందేమో కానీ ఆన్ పేపర్ బిగువుగా రాలేదు. ఆన్ స్క్రీన్ బిలీవబుల్ గా అనిపించలేదు. తరచుగా సోషల్ మీడియా జనం చేసే సెన్స్ లెస్ బోయ మాస్ అనే కామెంట్ ని కాంప్లిమెంట్ గా ఫీలైనట్టు అఖండ 2 మేకింగ్ లో లాజిక్స్ ని పూర్తిగా పక్కన పెట్టేసారు బోయపాటి. ఆ అంశమే సినిమా సక్సెస్ స్థాయిని పరిమితం చేయడం మన దగ్గర పరిపాటి.! 

ఫైనల్ గా ఇదీ అఖండ వివరణ.. తాండవంపై విశ్లేషణ !

బాలకృష్ణ ఫాన్స్ అంటేనే ఎలా ఉంటారో అందరికీ తెలుసు. వారికి తెరపై బాలయ్యే కనిపించాలి. వినిపించాలి. అలాంటిది ఈ చిత్రంలోని ఫస్టాఫ్ లో బాలయ్య రెండు పాత్రల నిడివి కేవలం నలభై నిముషాలు మాత్రమే అంటే అభిమానులకి నీరసం రాదా. మొదట్లో తపస్సుకు వెళ్లిన అఖండ పాత్ర ఇంటర్వెల్ ఫైట్ వరకు కనిపించదు. మురళీ కృష్ణ పాత్రకు ఒక ఫైట్, ఒక సాంగ్, రెండు, మూడు సీన్స్ మాత్రమే. ఇక సినిమా అంతా విలన్ల ప్లాన్లు. ప్రధానమంత్రి ఆఫిసులో టెన్షన్లు. వైరస్ సోకిన జనాల గగ్గోలు. సరే అఖండ ఎంట్రీతో సెకండాఫ్ సర్దుకుంటుంది కదా అనుకుంటే, అయితే ఫైట్లు చేయడం లేదా సుదీర్ఘంగా డైలాగులు చెప్పడం తప్ప అఖండ ప్రభావం పార్ట్ 1 పోల్చుకుంటే పదో వంతు కూడా ఉండదు. ఎటెటో సాగే కథనంతో ఎక్కడా ఎవ్వరికీ ఎమోషనల్ కనెక్టివిటీ ఏర్పడదు. ఇటీవల కొన్ని డివోషనల్ టచ్ ఉన్న సినిమాలకు దేశవ్యాప్తంగా దక్కుతున్న ఆదరణ చూసి శివుడితో బాటుగా నరసింహస్వామిని, ఆంజనేయస్వామిని కూడా ఇందులో ఇరికించేసి, తాంత్రిక శక్తుల తాలింపు వేసేసి కథ అనే వంటకాన్ని పూర్తి చేసారు కానీ తెరపై దాన్ని వడ్డించడంలో విఫలమయ్యారు. అందుకే అఖండ 2 బాలకృష్ణ - బోయపాటిల వీకెస్ట్ సినిమా అంటున్నారు వీక్షకులు అండ్ అభిమానులు !

పంచ్ లైన్ : అఖండ 2 - లాజిక్ లెస్ అండ్ మేజిక్ మిస్ !

సినీజోష్ రేటింగ్ : 2.5/5

 

Cinejosh Review: Akhanda 2:

Cinejosh Telugu Review: Akhanda 2

Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ