లేనిది ఉన్నట్టుగా భ్రమింపజేస్తే అది మొదటికే మోసం తేవొచ్చు! టికెట్ బుకింగుల విషయంలో, కార్పొరెట్ బుకింగులు, సెల్ఫ్ బుకింగులతో సినీనిర్మాతలు తమకు తాముగానే చేతులు కాల్చుకుంటున్నారన్న సమాచారం ఉంది. ప్రజలు అంతగా ఆదరించని సినిమాలకు కూడా కార్పొరెట్ బుకింగుల పేరుతో హైప్ తేవాలని ప్రయత్నించి చాలా మంది విఫలం అయ్యారు. తొలి వీకెండ్ ముగిసి, నాలుగో రోజు తర్వాత ఏ సినిమా అయినా థియేటర్లలో నిలబడాలంటే అందులో కంటెంట్ వర్కవుట్ కావాల్సి ఉంది. కానీ ఇటీవలి కాలంలో అలా జరగడం లేదు.
బుకింగులు సరే కానీ, ప్రజలు ఇలాంటి తప్పుడు ప్రొపగండాకు పాల్పడే మేధావుల కంటే తెలివైన వారు అని అర్థం చేసుకోవాలి. అసలే జనం థియేటర్లకు రాకుండా, ఓటీటీల్లో సినిమాలు చూసేందుకు అలవాటు పడ్డారు. ఇలాంటి సమయంలో కృత్రిమ హైప్ క్రియేట్ చేసేందుకు థియేటర్లలో సగం సీట్లను కార్పొరెట్ బుకింగులు చేస్తున్నారు. నిర్మాత లేదా హీరోలు సొంత డబ్బు పెట్టి బల్క్ బుకింగులతో ప్రజల్ని మోసం చేయాలని అనుకుంటున్నారా? ఇది సరైనదేనా? పర్యవసానంగా ప్రజలు కూడా ఇలాంటి మోసాన్ని కనిపెట్టి, దానికి తగ్గట్టే నడుచుకుంటున్నారు. నిజానికి థియేటర్లకు కంటెంట్ ఇచ్చే పనిమంతుల కంటే, ఓటీటీలకు పని చేసే జెన్ జెడ్ ట్యాలెంట్ గొప్పది అనే అభిప్రాయం కూడా ఇటీవల ఉంది.
ఇకపోతే ఇలాంటి అడ్డగోలు కార్పొరెట్ బుకింగులతో ఇకపై పనవ్వదని ప్రముఖ దర్శకనిర్మాత కరణ్ జోహార్ సైతం విమర్శిస్తున్నారు. సొంతంగా బుకింగులు చేసుకుని థియేటర్లు నిండాయని భజన చేయడం ద్వారా ఎలాంటి ప్రయోజనం ఉండదని ఆయన అన్నారు. సినిమాలో మ్యాటర్ ఉందో లేదో ప్రజలు థియేటర్లలో చూసి చెబుతారని, ఒకరి నుంచి మరొకరికి మంచి పాజిటివ్ ఫీడ్ బ్యాక్ ఉన్నప్పుడే ప్రజలు థియేటర్ల వరకూ వస్తున్నారని విశ్లేషించారు. బల్క్ బుకింగులు పేరుతో అనవసర హైప్ క్రియేట్ చేయడం దండగ వ్యవహారం అని కూడా చెబుతున్నారు. ఇటీవలి కాలంలో బుక్ మై షో లేదా ఇంకేదైనా ఆన్ లైన్ వేదికపై టికెట్ కొనుక్కునేవారందరికీ ఇలాంటి అనుభవాలు నిజంగా షాక్ లిస్తున్నాయి. కొనని టికెట్లను కొనేసారు అని నమ్మబలికితే వినడానికి చెవిలో పువ్వులు పెట్టుకుని ఎవరూ థియేటర్లకు రావడం లేదు! వెనక సీట్లకు మాస్కులు వేస్తే తెలుసుకోలేనంత వెర్రిబాగుల జనం ఇప్పుడు లేరు!!