విదేశాలలో ఉన్న షెల్ కంపెనీలకు డబ్బు పంపడం, దానిని తిరిగి వైట్ గా మార్చేందుకు ఇండియాకు పెట్టుబడుల పేరుతో రప్పించడం వంటి ఆర్థిక నేరాల గురించి ఎక్కువగా వింటున్నాం. ముఖ్యంగా సినీరంగంలో హవాలా సొమ్ములు చెలామణి అవుతున్నాయని ఆరోపణలు ఉన్నాయి. ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు అలీ అబ్బాస్ జాఫర్ ఒక బినామీ కంపెనీని స్థాపించి, మనీ లాండరింగ్ కి పాల్పడ్డాడని, బినామీ కంపెనీ ద్వారా డబ్బును వైట్ చేస్తున్నాడని సంచలన ఆరోపణలు చేసారు నిర్మాత వషు భగ్నానీ. బడే మియాన్ చోటే మియాన్ వంటి డిజాస్టర్ సినిమాని భగ్నానీ అలీ అబ్బాస్ జాఫర్ తో కలిసి నిర్మించారు.
తాను ఈ సినిమాకి ఆర్థిక సాయం అందించానని, సృజనాత్మక విభాగంలో సాంకేతిక అంశాలలో ఇన్వాల్వ్ కాలేదని భగ్నానీ వెల్లడించారు. అయితే బడే మియాన్ చోటా మియాన్ చిత్రీకరణ సమయంలో అలీ అబ్బాస్ జాఫర్ పెద్ద మొత్తంలో ఆర్థిక అవకతవకలకు పాల్పడ్డాడని ఆరోపించారు భగ్నానీ. ఆ తర్వాత ఆ ఇద్దరి మధ్యా గొడవ ముదిరి కోర్టు పరిధికి చేరుకుంది. బడేమియాన్ చోటా మియాన్ డిజాస్టర్ ఫలితం కూడా ఆ ఇద్దరి మధ్యా గొడవను మరింత పెంచింది.
ఇప్పుడు అలీ అబ్బాస్ జాఫర్ బినామీ కంపెనీ పేరుతో మనీ లాండరింగ్ కి పాల్పడ్డారని దీనిపై ఈడీ, సీబీఐ సహా ఆర్థిక నేరాల విభాగానికి ఫిర్యాదు చేస్తున్నానని కూడా భగ్నానీ అన్నారు. జాఫర్ కి సొంతంగా ఒక బ్యానర్ ఉంది.. కానీ అతడికి మరో కంపెనీ కూడా ఉందని నా విచారణలో తేలిందని భగ్నానీ అన్నారు. ఈ కంపెనీ ద్వారా రహస్య కార్యకలాపాలు జరుగుతున్నాయని ఆరోపించారు. ఈ వ్యవహారంపై సీరియస్ గా దర్యాప్తు జరగాలని, మరో నిర్మాతకు తనకు జరిగినట్టు జరగకూడదని కూడా భగ్నానీ తన ఆవేదనను వెల్లగక్కారు. జాఫర్ పై బాంద్రా పోలీస్ స్టేషన్ లో ఎఫ్.ఐ.ఆర్ నమోదైందని కూడా ఆయన వెల్లడించారు. అలీ అబ్బాస్ జాఫర్ దీనిపై ఇంకా స్పందించలేదు.
మనీ లాండరింగ్ అంటే?
మనీ లాండరింగ్ అంటే అక్రమంగా సంపాదించిన డబ్బును చట్టబద్ధంగా మార్చే ప్రక్రియ. ఇది సాధారణంగా విదేశీ బ్యాంకులు లేదా చట్టబద్ధమైన వ్యాపారాలకు సంబంధించిన బదిలీల ద్వారా అక్రమంగా పొందిన డబ్బు సోర్స్ ని దాచి ఉంచడం. దీనిని `బ్లాక్ మనీని వైట్ మనీగా మార్చడం` అని కూడా అంటారు.