వందల కోట్ల పెట్టుబడులతో విలాసవంతమైన సొంత ఇంటిని నిర్మించుకోవడం అంటే ఆషామాషీనా? కానీ కొందరు బాలీవుడ్ స్టార్లు తమ సొంత ఇంటి కలలను నెరవేర్చుకోవడం కోసం వందల కోట్లు ఖర్చు చేయడం చర్చనీయాంశమైంది. అయితే ఒక్కో సినిమాకి 60కోట్ల నుంచి 100 కోట్ల పారితోషికం అందుకుంటున్న స్టార్లకు ఇలాంటి విలాసవంతమైన గృహాలు నిర్మించుకోవడం అంత కష్టం కాదు.
ఇప్పటివరకూ రణబీర్ కపూర్ తన సొంత ఇంటి కోసం 250 కోట్లు ఖర్చు చేసాడు. ముంబైలోని ఖరీదైన ఏరియాలో కృష్ణరాజ్ బంగ్లా అందమైన భవంతులలో ఒకటి. దీనిని తన కుమార్తె రాహాకపూర్ కి రణబీర్ - ఆలియా గిఫ్ట్ గా ఇచ్చారు. త్వరలోనే ఈ భవంతిని పూజా కార్యక్రమాలతో లాంచ్ చేయనున్నారు. ఈ భవంతి తర్వాత దాదాపు 200కోట్ల బడ్జెట్ తో నిర్మించిన షారూఖ్ ఖాన్ `మన్నత్` టూరిస్ట్ స్పాట్ గా అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. ప్రస్తుతం ఈ భవంతిని ఖాన్ విస్తరిస్తున్నాడు. దీనిపై మరో 100 నుంచి 200 కోట్లు అదనంగా ఖర్చు చేస్తున్నాడని సమాచారం. జుహూలోని అమితాబ్ బచ్చన్ కుటుంబానికి చెందిన జల్సా ఖరీదు రూ.120కోట్లు. అలాగే 100 కోట్లు మించి పెట్టుబడులతో సొంత భవనాలు నిర్మించుకున్న స్టార్లలో రణవీర్ సింగ్- దీపిక జంట, శిల్పాశెట్టి- రాజ్ కుంద్రా జంట ఉన్నారు. శిల్పాశెట్టి కినరా జుహూలో సముద్ర ముఖంగా ఉంది. దీని ఖరీదు 100కోట్లు. రణవీర్ బ్లూమాంటే నివాసం ఖరీదు 119కోట్లు ) అలాగే సల్మాన్ ఖాన్ నివశిస్తున్న గేలాక్సీ అపార్ట్ మెంట్ లు కూడా అత్యంత ఖరీదైనవి.