Advertisementt

PR పంచ్ - గంటల పంచాంగం !

Sun 10th Aug 2025 03:36 PM
pr punch  PR పంచ్ - గంటల పంచాంగం !
PR Punch - Gantala Panchangam PR పంచ్ - గంటల పంచాంగం !
Advertisement
Ads by CJ

తిథి - వారం - నక్షత్రం - కరణం - యోగం

ఆ ఐదింటి కలయికని పంచాంగం అంటారు.

కానీ ఇప్పుడు మనం చెప్పుకోబోయేది 

వర్క్ - వర్త్ - స్క్రిప్ట్ - స్ట్రెంగ్త్, - లెంగ్త్ 

అనే ఐదింటి పంచాంగం గురించి.

ఆ పంచాంగం అనేక లెక్కలు వేసి 

గ్రహాల గమనాన్ని సూచిస్తే...

ఈ గంటల పంచాంగం ఓ నిర్మాత 

గ్రహ స్థితిని అమాంతం మార్చేస్తోంది.

ఆ గంటల గందరగోళం ఏమిటో

అసలీ పంచాంగం పంచాయితీ ఎందుకో 

చదవండి మీరే సినీజోష్ స్పెషల్ స్టోరీ !!

నమ్మకమే ఆస్తి - సందేహాలకు స్వస్తి !

మన సినిమా రీచ్ పెరిగింది. స్పాన్ పెరిగింది. బడ్జెట్ పెరిగింది. వాటితో బాటు దర్శకుల చాదస్తమూ పెరిగిపోయింది. తమ సినిమాని అల్ లాంగ్వేజెస్ లో ప్లాన్ చేసేసుకుంటున్నారు కానీ అతి ముఖ్యమైన స్క్రీన్ లాంగ్వేజ్ ని సీరియస్ గా తీసుకోవట్లేదు. మూడు గంటల సినిమాని తీర్చిదిద్దే తపనే తప్ప మూడు వారాలు థియేటర్లలో నిలిచే సినిమాని ఇవ్వలేకపోతున్నారు. దేవర, గేమ్ ఛేంజర్, కన్నప్ప, కుబేర, కింగ్డమ్ వంటి పలు భారీ చిత్రాలు ఆల్ మోస్ట్ మూడు గంటల నిడివితో జనం ముందుకు వచ్చాయి. ఇదే కోవలో మూడు గంటల పైబడి నిడివి కలిగినా ప్రేక్షకులని కట్టిపడేసిన అర్జున్ రెడ్డి, RRR పుష్ప 2  వంటి చిత్రాలు కూడా ఉన్నాయి. ఇక్కడ కంప్లైంట్, కంపేరిజన్ డ్యూరేషన్ గురించి కాదు... కథలో కన్వే అయ్యే ఎమోషన్ గురించి. ఆ సినిమాలు ఆడేసాయి కదా అనే నమ్మకమే ఆస్తిగా సందేహాలకు స్వస్తి చెప్పి అంతా చెక్కుడు పనిలో పడ్డారు కానీ అక్కడ స్ఫూర్తి చెందాల్సింది ఆడియెన్స్ మూడు గంటల సినిమాలని చూసారనే  అంశం కాదు.. అలా వాళ్ళు చూసేలా రాయడం, చేయడం, తీయడం.

డ్యూరేషన్ జాస్తి - ఎమోషన్ నాస్తి !

భారీ క్యాస్టింగ్, టాప్ టెక్నీషియన్స్, కోట్ల కొద్దీ ఖర్చు, సంవత్సరాల తరబడి షూట్ లు.. వెరసి మూడు గంటల సినిమా. మూడు రోజుల రన్. ఇదీ ప్రస్తుత పరిస్థితి. డ్యూరేషన్ జాస్తి - ఎమోషన్ నాస్తి అన్నట్టుగా సాగే సినిమాలతో ప్రేక్షకులు కుదేలవుతున్నారు. నిర్మాతలు కుంగిపోతున్నారు. ప్రతి హీరోకి పోరాట యోధుడిగా కనిపించాలనే తాపత్రయం ఉంటుంది. అందులోంచే దేవర వంటి పాత్రలు ఉద్భవిస్తాయి. భక్తుడైన కన్నప్పతో యుద్ధాలు చేయిస్తాయి. ప్రతి దర్శకుడికి ఫ్రీ హ్యాండ్ ఇచ్చే నిర్మాత అండ కావాల్సి ఉంటుంది. అది దొరికితేనే గేమ్ ఛేంజర్ వంటివి వస్తాయి. కింగ్డమ్ వంటివి సాధ్యమవుతాయి. అయితే పాత్రలకు కొత్త బ్యాక్ డ్రాప్ లు, చిత్రీకరణకు కొంగొత్త లొకేషన్లు వెదుకుతున్నారు తప్ప కథలో కనిపించే కాన్ ఫ్లిక్ట్ సరికొత్తగా అనిపించాలనే సంగతిని విస్మరిస్తున్నారు. అక్కడే తేడా కొడుతోంది. అందుకు తగ్గ రిజల్టే వస్తోంది. ఏదో ఒకట్రెండు ఎపిసోడ్స్ అండతో మూడు గంటల సినిమా బండిని లాగించాలనుకోవడంలోనే ల్యాగ్ బయటపడుతోంది. ఫైనల్ గా సినిమా ట్యాగ్ మారిపోతోంది.

రైటింగ్ కి సుస్తీ - ఎడిటింగ్ కి కుస్తీ !

ఇప్పుడు అసలైన గంటల పంచాంగం అంశంలోకి వద్దాం. “Films are created on two tables. The first being the writing table (while the screen-play is being written) and the second is the editing table!” అనేది దిగ్దర్శకుడు అకిర కురోసవా వెల్లడించిన విలువైన అభిప్రాయం. ప్రతి దర్శకుడు పాటించి తీరవలసిన సూత్రం. ఇప్పటివరకు మనం మూడు గంటల నిడివి గురించి చెప్పుకున్నాం కదా. ఆ మూడు గంటలు కాకుండా సదరు దర్శకులు మరెంత ఫుటేజ్ ని తెరకెక్కిస్తున్నారో తెలుసా...? గేమ్ ఛేంజర్ కోసం సీనియర్ డైరెక్టర్ శంకర్ కోట్లు తగలేసి తీసిన టోటల్ రష్ లెంగ్త్ ఏడున్నర గంటలట. దేవర కోసం స్టార్ డైరెక్టర్ శివ కొరటాల నాలుగు గంటలకు పైగా సినిమాని చెక్కారట. కుబేర, కింగ్డమ్ తదితర పలు చిత్రాలకీ ఎంతెంతో మిగిలిపోయిన ఫుటేజ్ ఎడిటింగ్ రూమ్స్ లో పడి ఉంది. విశేషం ఏంటంటే, రైటింగ్ టేబుల్ పైన సుస్తీ చేసిందా అనిపించేట్లు వ్యవహరించే దర్శకులు చివరికి ఎడిటింగ్ టేబుల్ పై కుస్తీ పడుతూ ఉంటారు. నటీ నటుల శ్రమనీ, నిర్మాత ఖర్చునీ పట్టించుకోకుండా పాటల్ని లేపేస్తూ ఉంటారు. దేవర, గేమ్ ఛేంజర్, కుబేర, కింగ్డమ్ వంటి సినిమాలు అన్నిట్లోనూ అప్పటికే విడుదలై పాపులర్ అయిన పాటలు ఫైనల్ ఎడిట్ లో కోతకి బలయ్యాయి. తాజాగా ప్రభాస్ రాజా సాబ్ గురించి మాట్లాడుతూ నిర్మాత విశ్వప్రసాద్ ఇప్పటికే నాలుగున్నర గంటల నిడివి వచ్చిందని, ఇక పాటల చిత్రీకరణే బ్యాలెన్స్ అనీ చెప్పుకొచ్చారు. మరి దర్శకుడు మారుతి ఆ చిత్ర రాజాన్ని ఎలా కుదిస్తారో చూడాలి. ఇదే కాదు.. ఇదే కోవలో చిరంజీవి విశ్వంభర, బాలకృష్ణ అఖండ 2  వంటివి చాలానే ఉన్నాయి.

ఏమిటి శాస్తి - ఎప్పుడు మస్తీ !

బాహుబలి తో పాన్ ఇండియా సినిమా జోరు మొదలైతే, బాహుబలి 2 - KGF 2 చిత్రాల భారీ సక్సెస్ తో పార్ట్ 2 ల ప్రభావం, ప్రాభవం, ప్రాబల్యం పతాక స్థాయికి చేరిపోయింది. ప్రతి ఒక్క ఫిలిం మేకర్ పార్ట్ 2 కూడా ఉంటుందనే ఉద్దేశ్యంతోనే ప్రేక్షకుల ముందు ఈ గంటల పంచాంగం పరిచేస్తున్నారు. అయితే దీనికి ప్రేక్షకుల తీర్పు తగిన శాస్తినే చేస్తున్నా కూడా దర్శకులే అది గమనించట్లేదు. నిర్మాతలకు కాస్తయినా మస్తీని మిగల్చట్లేదు. ఒకప్పుడు ఓ మంచి కాన్ ఫ్లిక్ట్ కలిగిన కథ అనుకోవడం, అది చక చకా తెరకెక్కించడం, ఫైనల్ గా లెంగ్త్ సరిపోక స్పెషల్ సాంగ్ నో, సెపరేట్ కామెడీ ట్రాక్ నో జత చేయడం జరిగేది (ఇప్పటి వారికి తెలియాలి అంటే ఇడియట్ లో అలీ ట్రాక్, సై లో వేణు మాధవ్ ట్రాక్ వంటివి). బట్ నేటి ట్రెండ్ ఏంటంటే సంవత్సరాల పాటు తీసింది వద్దనుకుని పక్కన పారెయ్యడం లేదా పార్ట్ 2 కోసం అంటూ పక్కన దాచెయ్యడం. 

ఇదంతా చూస్తుంటే, మూడు పాత్రల్లో నటిస్తూ, దర్శకత్వం వహిస్తూ, నిర్మాతగా వ్యవహరిస్తూ నలభై అయిదు రోజుల్లో నాలుగున్నర గంటల దాన వీర శూర కర్ణ ఎలా తీశారు మహానుభావా అని అన్న ఎన్టీఆర్ ని స్మరించుకోవాల్సి వస్తోంది. అదే ఈ రోజుల్లో అయ్యుంటే అదీ రెండు పార్టులుగా వచ్చేది కదా అనిపిస్తోంది.!

-  పర్వతనేని రాంబాబు ✍️

PR Punch - Gantala Panchangam:

Cinejosh Special Article PR Punch

Tags:   PR PUNCH
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ