అష్టకష్టాలు పడి ఎలాగోలా `హరిహర వీరమల్లు` చిత్రాన్ని పూర్తి చేసి రిలీజ్ చేసారు ఏ.ఎం.రత్నం. ఈ సినిమా నిర్మాణం ఐదేళ్ల పాటు సాగింది. ఇంతటి ఆలస్యానికి ప్రధాన కారణం ఆర్థిక సమస్యలేనని కథనాలొచ్చాయి. దర్శకుడి మార్పు, కరోనా క్రైసిస్ వగైరా వగైరా ఆర్థిక వ్యవహారాల్ని తీవ్రంగానే ప్రభావితం చేసాయి.
ప్రాజెక్ట్ అంతకంతకు ఆలస్యమవుతుంటే ఆ టెన్షన్ నిర్మాతనే కాదు చిత్రబృందాన్ని హీరోని కూడా నిలవనీయలేదు. అలాంటి సమయంలో హరిహర వీరమల్లు నిర్మాత ఏ.ఎం.రత్నంని ఆదుకున్నది ఎవరో తెలుసా? రత్నం స్నేహితుడే అయిన చిత్ర కథానాయకుడు పవన్ కల్యాణ్ ఓ ఇద్దరిని సెట్ చేసారు. ఆ ఇద్దరూ మరెవరో కాదు... ఒకరు పవన్ కి అత్యంత సన్నిహితులు అయిన పీపుల్స్ మీడియా అధినేతలు. అలాగే మరో మిత్ర వర్గం మైత్రి మూవీ మేకర్స్ అధినాయకులు. మొత్తానికి పవన్-మైత్రి-పీపుల్ మీడియా మిత్రులు అందరూ కలిసి ఏ.ఎం.రత్నంని రిలీజ్ క్రైసిస్ నుంచి బయటపడేలా చేసారు. రిలీజ్ తర్వాత టాక్ ఎలా ఉన్నా పవన్ మానియాతో ఓపెనింగులు బాగానే వచ్చాయని చెబుతున్నారు.
తాజా సక్సెస్ మీట్ లో పవన్ మాట్లాడుతూ-``వీరమల్లు విజయం సిసలైన విజయమని, ఈ చిత్రంలో తాము చెప్పాలనుకున్నది చెప్పామ``ని అన్నారు. ఏ సినిమాకైనా భావోద్వేగాలు ముఖ్యం. మనం ఒక సినిమాకి వెళ్ళినప్పుడు మనకి గుర్తుండేది.. మనం ఏ ఎమోషన్ ని ఇంటికి పట్టుకొస్తామో దాని గురించే. ఈ కథ మొఘలులకు సంబంధించినది. మనం చదువుకున్న పుస్తకాల్లో ఔరంగజేబు గొప్పతనాన్ని చెప్పారు తప్ప.. అతడి దుర్మార్గాన్ని చెప్పలేదు. మొఘల్స్ 200 ఏళ్ళే పాలించారు. చాళుక్యులు, పల్లవులు, కాకతీయులు, విజయనగర సామ్రాజ్యం కొన్ని వందల ఏళ్ళు పాలించారు. కానీ చరిత్రలో మొఘల్స్ గురించే ఎక్కువ ప్రస్తావన ఉంటుంది. మన చరిత్ర రాసిన వాళ్ళు మన రాజులపైన చిన్నచూపు చూశారు. ఔరంగజేబు పాలన సమయంలో హిందూదేశంలో హిందువుగా బ్రతకాలంటే పన్ను కట్టాల్సిన పరిస్థితి ఉండేది.
ఆ విషయాన్ని ఈ సినిమాలో నిర్భయంగా ప్రస్తావించాము. నాకు తెలిసిన మార్షల్ ఆర్ట్స్, నాకున్న సాంకేతిక పరిజ్ఞానం, ప్రజా సమస్యలపై పోరాడేతత్వం.. ఇవన్నీ కలిసి నన్ను ప్రీ క్లైమాక్స్ లో 18 నిమిషాల ఫైట్ ను డిజైన్ చేయడానికి ప్రేరణ ఇచ్చాయి. సినిమా చూసిన ప్రతి ఒక్కరూ ఆ ఎపిసోడ్ బాగుందని ప్రశంసించడం నాకు సంతోషాన్ని కలిగించింది. ఈ సినిమా మతాలకు సంబంధించింది కాదు. ఇందులో మంచి, చెడుకి మధ్య జరిగిన యుద్ధాన్ని చూపించాము.
కోహినూర్ కంటే విలువైన జ్ఞానం మన దేశం సొంతం అని ఈ సినిమాలో చూపించాము. హరి హర వీరమల్లులో చరిత్రలో దాగి ఉన్న ఎన్నో వాస్తవాలను చెప్పాము. నా దృష్టిలో అదే నిజమైన విజయం. ఇలాంటి గొప్ప సినిమా తీసిన రత్నంకి అండగా నిలబడటం నా బాధ్యతగా భావించాను అని పవన్ అన్నారు. మరీ ముఖ్యంగా ఈ చిత్రం విడుదల విషయంలో రత్నంకి అండగా నిలిచిన మైత్రి మూవీ మేకర్స్ కి, పీపుల్ మీడియా ఫ్యాక్టరీకి నా ప్రత్యేక ధన్యవాదాలు... అని పవన్ అన్నారు. మొత్తానికి పవన్ చొరవతో పీపుల్ మీడియా, మైత్రి మూవీ మేకర్స్ ముందుకు వచ్చి ఆదుకోవడంతో వీరమల్లు సజావుగా రిలీజైంది.