జాతీయ అవార్డు గ్రహీత, మల్టీ టాలెంటెడ్ ధనుష్ మరోసారి తన నటనా ప్రతిభతో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమయ్యాడు. ఈసారి ధనుష్ భారతదేశ ప్రియతమ మాజీ రాష్ట్రపతి, ప్రముఖ శాస్త్రవేత్త డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం జీవితం ఆధారంగా రూపొందుతున్న ఒక భారీ బయోపిక్‌లో నటించనున్నాడు. ఈ సినిమా టైటిల్ పోస్టర్ ప్రతిష్ఠాత్మకమైన కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ఆవిష్కరించబడింది. ఈ చిత్రానికి కలాం అనే టైటిల్‌తో పాటు ది మిస్సైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా అనే ట్యాగ్‌లైన్ ఫిక్స్ చేశారు. ఈ చిత్రాన్ని తానాజీ: ది అన్‌సంగ్ వారియర్, ఆదిపురుష్ లాంటి విజయవంతమైన చిత్రాల దర్శకుడు ఓం రౌత్ రూపొందిస్తున్నారు.
ఈ భారీ ప్రాజెక్ట్‌ను అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్, ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్, మరియు టీ-సిరీస్ ఫిల్మ్స్ బ్యానర్ల కింద అభిషేక్ అగర్వాల్, అనిల్ సుంకర, భూషణ్ కుమార్, కృషన్ కుమార్,
గుల్షన్ కుమార్, తేజ్ నారాయణ్ అగర్వాల్, నిర్మిస్తున్నారు. డాక్టర్ కలాం జీవితం, భారత అంతరిక్ష, రక్షణ కార్యక్రమాలకు ఆయన చేసిన అమూల్యమైన సేవను ఈ చిత్రం ద్వారా ప్రేక్షకుల ముందుకు తీసుకు రానున్నారు.
కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ఆవిష్కరించిన కలాం సినిమా టైటిల్ పోస్టర్ అందరినీ ఆకర్షించింది. డాక్టర్ కలాం యొక్క సిల్హౌట్‌తో పాటు, ఒక మిస్సైల్ చిత్రం ఆవిష్కరణాత్మకంగా రూపొందించబడింది, ఇది ఆయన భారత మిస్సైల్ టెక్నాలజీకి చేసిన కృషిని సూచిస్తుంది.
భారతీయ సినిమాలో మోస్ట్ టాలెంటెడ్ నటులలో ఒకరిగా గుర్తింపు పొందిన ధనుష్, డాక్టర్ కలాం పాత్రను పోషించేందుకు చాలా ఫిజికల్ బాడీ ట్రాన్స్ ఫర్ మిషన్ అయ్యాడు. ప్రస్తుతం ఈ చిత్రంలో ధనుష్ ప్రధాన పాత్రలో నటిస్తున్నట్లు ప్రకటించినా ఇతర తారాగణం, సాంకేతిక బృందం వివరాలు త్వరలో ప్రకటించబడనున్నాయి. ఈ చిత్రం డాక్టర్ కలాం జీవితాన్ని, ఆయన స్ఫూర్తిదాయకమైన జీవన ప్రయాణాన్ని ప్రపంచానికి చాటి చెప్పే ఒక గొప్ప సినిమాగా రూపొందనుంది.