Advertisement

ఇక నా తనయుల మీదే నా ఫోకస్: నాగార్జున!

Thu 14th Apr 2016 01:31 PM
oopiri movie thanks meet,nagarjuna,vamshi paidipalli,thamanna  ఇక నా తనయుల మీదే నా ఫోకస్: నాగార్జున!
ఇక నా తనయుల మీదే నా ఫోకస్: నాగార్జున!
Advertisement

కింగ్‌ నాగార్జున, ఆవారా కార్తీ, మిల్కీ బ్యూటీ తమన్నా ప్రధాన పాత్రల్లో పెరల్‌ వి.పొట్లూరి సమర్పణలో పి.వి.పి. సినిమా పతాకంపై వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెలుగు, తమిళ భాషల్లో పరమ్‌ వి.పొట్లూరి, కవిన్‌ అన్నే నిర్మించిన భారీ మల్టీస్టారర్‌ 'ఊపిరి'. తెలుగు, తమిళ భాషల్లో విడుదలై ప్రపంచవ్యాప్తంగా భారీ కలెక్షన్స్‌ సాధించి సూపర్‌హిట్‌ చిత్రంగా నిలిచింది. ఈ సందర్భంగా చిత్రబృందం బుధవారం హైదరాబాద్ లోని శిల్ప కళావేదికలో థాంక్స్ మీట్ ను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో 

దాసరి నారాయణరావు మాట్లాడుతూ.. ''నా అభిమాన నటుడు అక్కినేని నాగేశ్వరావు. తెలుగు సినిమా పరిశ్రమకు ఊపిరి అక్కినేని నాగేశ్వరావు. నాగేశ్వరావు గారికి నాగార్జున ఊపిరి. నాగార్జునకు చైతు, అఖిల్ లు ఊపిరి. పదిహేనళ్ళ ముందు బొమ్మరిల్లు వంటి గొప్ప సినిమా చూశాను. ఆ తరువాత చేసిన గొప్ప సినిమా ఊపిరి. మన తెలుగు వాళ్ళు బాలీవుడ్, తమిళ చిత్రాలకు ధీటుగా సినిమాలు చేయట్లేదని అందరూ బాధపడుతున్న సమయంలో తెలుగువాళ్ళు కూడా గొప్ప సినిమాలు చేయగలరని నిరూపించిన చిత్రం ఊపిరి. పివిపి ఓ మంచి సినిమా చేయాలనే ప్రయత్నం చేశాడు. ఈ సినిమా చేయడానికి ఒప్పుకున్న నాగార్జునకు హ్యాట్సాఫ్. నాకు తెలిసి ఏ కమర్షియల్ హీరో ఈ సినిమా చేయడానికి ఒప్పుకోరు. నటుడు కేవలం తన కళ్ళతో రెండున్నర గంటలు నటించడం మామూలు విషయం కాదు. నటనలో మెచ్యూరిటీ ఉన్నవారు మాత్రమే చేయగలరు. అది నాగార్జునకే సాధ్యం. నేనైతే బెస్ట్ యాక్టర్ అవార్డు ఆయనకే ఇచ్చేస్తాను. తన తండ్రికి ఉన్న వైవిధ్యం నాగార్జునలో కనిపిస్తుంది. వంశీ ప్రతి సీన్ అధ్బుతంగా చేశాడు. ఈ సినిమాలో నటించిన అందరికి నా అభినందనలు'' అని చెప్పారు

అక్కినేని నాగార్జున మాట్లాడుతూ.. ''నాకు ఈ సినిమా ఇచ్చిన ఊపిరి టీంకు నా థాంక్స్. 'సాహసమే శ్వాసగా సాగిపో' నాకు బాగా నచ్చిన టైటిల్. ఆ సాహసమే నాతో ఎన్నో కొత్త ప్రయోగాలు చేసేలా చేసింది. సాహసమే శ్వాసగా సాగిపో టైటిల్ లో శ్వాస మా అభిమానులు. వారి కోసం ఇటువంటి సినిమాలు చేస్తూనే ఉంటాం. రేపటినుండి హతిరాం బాబా సినిమా మొదలుపెట్టనున్నాను. కళ్యాన్ కృష్ణతో నాగచైతన్య సినిమా చేయడానికి ప్లాన్ చేస్తున్నాం. అలానే అఖిల్ కోసం వంశీకృష్ణ డైరెక్షన్ లో కథ ఫైనల్ చేయాలనుకుంటున్నాం. ఇంతకముందు వరకు నా ఇద్దరి కొడుకుల మీద మనసు పెట్టలేదు. ఈ సంవత్సరం అదే పనిలో ఉండాలనుకుంటున్నాను. ఇది నా ప్రామిస్'' అని చెప్పారు. 

అక్కినేని అఖిల్ మాట్లాడుతూ.. ''పివిపి గారు గట్స్ తో ఇలాంటి సినిమా చేశారు. మా నాన్నగారిని వీల్ చైర్ లో చూసిన నేను బాధపడలేదు. అంత బాగా సినిమాను చిత్రీకరించారు వంశీ గారు. నాన్నే మా ఊపిరి'' అని చెప్పారు.

వంశీ పైడిపల్లి మాట్లాడుతూ.. ''ఇప్పటివరకు నేను చేసిన సినిమాలకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి నా థాంక్స్. అలానే నాగార్జున గారు ఈ సినిమాపై పెట్టుకున్న నమ్మకాన్ని తెలుగు ప్రేక్షకులు నిలబెట్టారు. ఆయన సినిమాపై పెట్టుకున్న నమ్మకమే ఈ సినిమాను నిలబెట్టింది. ఊపిరి సినిమాకు నాగార్జున గారే ఊపిరి. అలానే ఈ సినిమా స్థాయిని పెంచిన పివిపి అన్నకు థాంక్స్'' అని చెప్పారు.

పివిపి మాట్లాడుతూ.. ''ఈ సినిమాకు ఊపిరి ప్రేక్షకులే. మా సంస్థ తరఫున అందరికి కృతజ్ఞతలు. ఇలానే ఎప్పటికి సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నామని'' చెప్పారు. 

తమన్నా మాట్లాడుతూ.. ''ఈ సినిమాలో నా లుక్ బావుందని అందరు చెబుతున్నారు. ఆ లుక్ రావడానికి హెల్ప్ చేసిన అందరికి థాంక్స్. ఈ సినిమాలో నేను నటించడం సంతోషంగా ఉందని'' చెప్పారు. 

సుశాంత్ మాట్లాడుతూ.. ''మొదటిరోజు సినిమా చూశాను. ఈ సినిమా చేయడానికి గట్స్ కావాలి. సినిమా చూస్తున్నంతసేపు కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి. ఇలాంటి సినిమా ఈ మధ్యకాలంలో రాలేదు. శివ, గీతాంజలి, అన్నమయ్య, నిన్నేపెళ్ళాడతా, సోగ్గాడే ఛిన్ని నాయన వంటి చిత్రాలు నాగార్జున గారి కెరీర్ లో ఎలా మైలురాయిగా నిలిచాయో.. ఊపిరి కూడా అలానే నిలిచిపోతుంది. కమర్షియల్ ఎలిమెంట్స్ ఉంటూనే వంశీ గారు కథను చాలా చక్కగా ప్రెజంట్ చేసారని'' చెప్పారు. 

సిరివెన్నెల సీతారామశాస్త్రి మాట్లాడుతూ.. ''ఊపిరి సినిమాలో పాటలు రాసే అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకు థాంక్స్. నూతన పద్ధతిలో సినిమా చేశారు. ఈ సినిమా చేయడానికి కావాల్సింది గట్స్ కాదు నమ్మకం. కొత్తదనాన్ని నమ్మి సినిమా చేస్తే ప్రేక్షకులు ఆదరిస్తారనే విషయాన్ని ఈ సినిమా నిరూపించింది. కార్తి, తమన్నాలకు మించి నాగార్జున గారు ఈ సినిమాలో నటించారు. ఇలాంటి చిత్రాన్ని నిర్మించిన పివిపి గారిని అభినందిస్తున్నానని'' అన్నారు.

కళ్యాణ్ కృష్ణ మాట్లాడుతూ.. ''ఏ సినిమా చూసిన ఎంజాయ్ చేస్తాం కానీ ఈ సినిమాతో మంచి అనుభవం కలిగింది. ఏడిపిస్తూ.. నవ్వించే సినిమా. గత 25 సంవత్సరాలుగా తెలుగు ఇండస్ట్రీలో చూసుకుంటే.. తెలుగు సినిమా చరిత్రను మార్చిన సినిమాల్లో ఎక్కువ శాతం నాగ్ సర్ సినిమాలే ఉంటాయి. ఆయన అభిమానులు గర్వపడాల్సిన విషయమిది. ప్రయత్నం గొప్పగా ఉంటే ఫలితం కూడా గొప్పగా ఉంటుందని'' చెప్పారు. 

దిల్ రాజు మాట్లాడుతూ.. ''బ్యాక్ టు బ్యాక్ తెలుగు ఇండస్ట్రీలో సక్సెస్ లు అందుకున్నారు. కొత్త కథలను ఎన్నుకుంటూ.. కొత్త సినిమాలు రావడానికి దోహదపడుతున్న నాగార్జున గారికి నా థాంక్స్'' అని చెప్పారు.

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement