పాత్ర‌ల వెనుక అనారోగ్య ర‌హ‌స్యాలు!

Hidden Secrets Behind Different Roles

 

విభిన్నమైన పాత్రలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న  నటి కృతి సనన్ నటీనటుల మానసిక .. భావోద్వేగ ఆరోగ్యానికి సంబంధించిన కీలక విషయాలను పంచుకున్నారు. తెరపై విభిన్నమైన పాత్రలను రక్తి కట్టించే క్రమంలో నటులు నిరంతరం  భావోద్వేగాలతో ప్రయోగాలు చేయాల్సి ఉంటుందని  తెలిపారు.  ఈ ప్రక్రియలో నటీనటులు  వ్యక్తిగత జీవితం నుంచి..పోషించే పాత్రల నుంచి మానసికంగా బయటపడటం  ఎంతైనా అవసరమని  అభిప్రాయపడ్డారు.

తొలినాళ్లలో తాను నటించే పాత్రలు  నిజ జీవితంపై ఎలాంటి ప్రభావం చూపవని భావించేదానినని.. కానీ కొన్ని ప్రత్యేకమైన చిత్రాలు తన ఆలోచనలపై లోతైన ముద్ర వేసినట్లు కృతి సనన్ వెల్లడించారు. తాము పోషించే భావోద్వేగభరితమైన పాత్రలు కొంతకాలం తర్వాత మనస్తత్వంపై లేదా ప్రతిస్పందనలపై పరోక్ష ప్రభావాన్ని చూపుతాయని  గుర్తించాన‌న్నారు. ఒకవైపు వ్యక్తిగత జీవితంలో ఇబ్బందులు ఎదుర‌వుతున్నా? తెరపై నవ్వుతూ హాస్య పాత్రల్లో నటించాల్సిన సందర్భాలు ఎదురవుతుంటాయని తెలిపారు.  వృత్తిపరమైన సవాళ్లను అధిగమించడానికి మానసిక ప్రశాంతతను కాపాడుకోవడం చాలా ముఖ్యమని  పేర్కొన్నారు.

నటీనటులు  అంతర్గత సమతుల్యతను కాపాడుకోవడానికి ధ్యానం, థెరపీ వంటి పద్ధతులు ఎంతో తోడ్పడతాయని కృతి  సూచించారు. నిరంతరం భావోద్వేగాలతో ఆడుకునే  రంగంలో మానసిక ఆరోగ్యాన్ని కాపాడుకోవడం కోసం కొంత విరామం తీసుకోవడం అత్యంత అవ‌స‌ర‌మ‌ని  స్పష్టం చేశారు. వృత్తిపరమైన ఒత్తిళ్ల నుంచి బ్రేక్ తీసుకోవడం వల్ల నటులు  పనితీరును మెరుగుపరచుకోవడంతో పాటు సంతోషకరమైన జీవితాన్ని గడపవచ్చని  అభిప్రాయపడ్డారు.

Hidden Secrets Behind Evrey Actor