Advertisement

సినీజోష్‌ రివ్యూ: అరవింద సమేత

Fri 12th Oct 2018 03:50 PM
telugu movie aravinda sametha,aravinda sametha movie review,aravinda sametha review in cinejosh,aravinda sametha movie cinejosh review,trivikram movie aravinda sametha  సినీజోష్‌ రివ్యూ: అరవింద సమేత
aravinda sametha movie review సినీజోష్‌ రివ్యూ: అరవింద సమేత
సినీజోష్‌ రివ్యూ: అరవింద సమేత Rating: 3 / 5
Advertisement

హారిక అండ్‌ హాసిని క్రియేషన్స్‌ 

అరవింద సమేత 

తారాగణం: ఎన్టీఆర్‌, పూజా హెగ్డే, ఈషా రెబ్బా, జగపతిబాబు, నాగబాబు, సునీల్‌, రావు రమేష్‌, నవీన్‌ చంద్ర, శ్రీనివాసరెడ్డి, శత్రు, బ్రహ్మాజీ, ప్రియ పాతక్‌, దేవయాని, సితార తదితరులు 

సినిమాటోగ్రఫీ: పి.ఎస్‌.వినోద్‌ 

ఎడిటింగ్‌: నవీన్‌ నూలి 

సంగీతం: థమన్‌ ఎస్‌. 

నిర్మాత: ఎస్‌.రాధాకృష్ణ(చినబాబు) 

రచన, దర్శకత్వం: త్రివిక్రమ్‌ 

విడుదల తేదీ: 11.10.2018 

ఫ్యాక్షన్‌ నేపథ్యంలో గతంలో చాలా సినిమాలు వచ్చాయి. అయితే ప్రతి సినిమాలోనూ ఫ్యాక్షన్‌ గొడవలు ఎలా ఉంటాయి? ఒకరిపై ఒకరు ఎలాంటి కక్షలు పెంచుకుంటారు? ఒకరినొకరు ఎలా చంపుకున్నారు? వంటి అంశాలపైనే దృష్టి పెట్టి సినిమాలు తీశారు. పగలు, పత్రీకారాలు వద్దు.. మనుషులుగా ఉందాం, మానవత్వంతో జీవిద్దాం వంటి సందేశాలు ఇచ్చే సినిమాలు చాలా తక్కువగా వచ్చాయి. అలాంటి సందేశంతో సినిమాలు తీసినప్పటికీ వాటికి కొన్ని కమర్షియల్‌ ఎలిమెంట్స్‌ని కూడా జోడించి సక్సెస్‌ సాధించిన దర్శకులు కూడా ఉన్నారు. ఇక అరవింద సమేత సినిమా విషయానికి వస్తే ఇందులోనూ అలాంటి సందేశమే ఉన్నప్పటికీ కమర్షియల్‌ అంశాల జోలికి వెళ్ళకుండా చాలా లోతుగా సమస్య గురించి చర్చించడం జరిగింది. 

ఎన్టీఆర్‌ అంటే కమర్షియల్‌ హీరో. అతని సినిమాల్లో మంచి కథతోపాటు అన్ని కమర్షియల్‌ ఎలిమెంట్స్‌ ఉండాలని ప్రేక్షకులు, అభిమానులు కోరుకుంటారు. త్రివిక్రమ్‌ గురించి చెప్పాలంటే గిలిగింతలు పెట్టే కామెడీ, ఫక్కున నవ్వించే పంచ్‌ డైలాగ్స్‌తోపాటు ఫ్యామిలీ ఆడియన్స్‌ని ఆకట్టుకునే అంశాలతో విజయాలు సాధించిన దర్శకుడు. వీరిద్దరి కాంబినేషన్‌లో సినిమా వస్తోందంటే అంచనాలు భారీగా ఉండడంలో ఆశ్చర్యం లేదు. అయితే వీరిద్దరి నుంచి ఫ్యాక్షన్‌ బ్యాక్‌డ్రాప్‌లో సినిమా వస్తోందనే విషయంలో రిలీజ్‌కి ముందే ప్రేక్షకులకు ఒక క్లారిటీ వచ్చేసింది. కాకపోతే ఆ సినిమా ఎలా ఉండబోతోందనే ఆసక్తి అందరిలోనూ నెలకొంది. ఎన్టీఆర్‌, త్రివిక్రమ్‌ కాంబినేషన్‌లో తొలి సినిమాగా రూపొందిన అరవింద సమేత చిత్రాన్ని ఎస్‌.రాధాకృష్ణ నిర్మించారు. ఈ సినిమా ప్రేక్షకుల ఎక్స్‌పెక్టేషన్స్‌ని ఎంత వరకు రీచ్‌ అయింది? వీరిద్దరి ఫస్ట్‌ కాంబినేషన్‌ సినిమా ఎన్టీఆర్‌ మార్క్‌లో ఉందా? త్రివిక్రమ్‌ మార్క్‌లో ఉందా? అన్నివర్గాల ప్రేక్షకుల్ని ఆకట్టుకునే అంశాలు ఈ సినిమాలో ఉన్నాయా? అసలు అరవింద సమేత సినిమా ద్వారా ప్రేక్షకులకు ఏం చెప్పాలనుకున్నారు? వంటి విషయాలు సమీక్షలోకి వెళ్లి తెలుసుకుందాం. 

అది రాయలసీమ. అక్కడ 30 ఏళ్ళుగా కొమ్మది గ్రామానికి చెందిన నారపరెడ్డి(నాగబాబు), నల్లగొడి గ్రామానికి చెందిన బసిరెడ్డి(జగపతిబాబు) కుటుంబాల మధ్య ఫ్యాక్షన్‌ గొడవలు ఉన్నాయి. ఇదిలా ఉంటే బసిరెడ్డి ఎంతోకాలంగా ఆ ప్రాంతంలో రాజకీయంగా గెలుస్తుంటాడు. అతనికి పోటీగా నారపరెడ్డిని నిలబెడుతుంది. కట్‌ చేస్తే లండన్‌లో చదువు పూర్తి చేసుకొని 12 ఏళ్ళ తర్వాత గ్రామానికి వస్తాడు వీరరాఘవరెడ్డి(ఎన్టీఆర్‌). కొడుకుని రిసీవ్‌ చేసుకొని కారులో వస్తున్న క్రమంలో వారిపై తన మనషులతో ఎటాక్‌ చేసి నారపరెడ్డిని చంపేస్తాడు బసిరెడ్డి. ఆ పోరాటంలో బసిరెడ్డితోపాటు ఎంతో మందిని హతమారుస్తాడు వీరరాఘవరెడ్డి. ఈ ఘటన తర్వాత రియలైజ్‌ అయిన వీరరాఘవ పగ, ప్రతీకారాల స్థానంలో శాంతిని తీసుకురావాలనుకుంటాడు. అందుకే ఎవరికీ చెప్పకుండా గ్రామాన్ని వదిలి సిటీకి వెళ్తాడు. అక్కడ అనుకోకుండా అరవింద(పూజా హెగ్డే) పరిచయమవుతుంది. రాయలసీమలోని ఫ్యాక్షనిజంపై ఓ డాక్యుమెంటరీ చెయ్యాలన్నది అరవింద లక్ష్యం. ఫ్యాక్షనిజాన్ని రూపుమాపి శాంతిని నెలకొల్పేందుకు అరవింద ఆలోచనలు వీరరాఘవకు ఉపయోగపడతాయి. మరోపక్క చనిపోయాడనుకున్న బసిరెడ్డి బ్రతికి బయటపడతాడు. వీరరాఘవను చంపేందుకు తన కొడుకు బాల్‌రెడ్డి(నవీన్‌చంద్ర)ను పంపుతాడు. ఫ్యాక్షన్‌ను అంతమొందించాలని ప్రయత్నిస్తున్న వీరరాఘవ బాల్‌రెడ్డిని ఎలా ఎదుర్కొన్నాడు? తమ ప్రాంతంలో గొడవలు జరగకుండా ఎలాంటి ఆలోచన చేశాడు? పగ, ప్రతీకారాలే జీవితంగా బ్రతుకుతున్న బసిరెడ్డికి వీరరాఘవ ఎలా సమాధానం చెప్పాడు? అనేది మిగతా కథ. 

వీరరాఘవగా ఎన్టీఆర్‌ సెటిల్డ్‌ పెర్‌ఫార్మెన్స్‌ ఇచ్చాడు. డైలాగ్‌ డెలివరిలోనూ, యాక్షన్‌లోనూ ఎంతో వైవిధ్యాన్ని ప్రదర్శించాడు. అరవింద పాత్రలో నటించిన పూజా హెగ్డే తన పాత్ర పరిధి మేరకు పర్వాలేదు అనిపించింది. అయితే ఆమె క్యారెక్టరైజేషన్‌లో డెప్త్‌ లేకపోవడం వల్ల క్యారెక్టర్‌ తేలిపోయింది. ఆమె ఆలోచనలతోనే వీరరాఘవ ముందుకెళ్తాడు. కానీ, ఆమె క్యారెక్టర్‌లో అంత విషయం లేదు అనిపిస్తుంది. ఎన్టీఆర్‌ తర్వాత పెర్‌ఫార్మెన్స్‌ పరంగా ఆకట్టుకున్న నటుడు జగపతిబాబు. అతని క్యారెక్టర్‌లోని వివిధ రకాల షేడ్స్‌ను అద్భుతంగా ప్రదర్శించాడు. చాలా గ్యాప్‌ తర్వాత త్రివిక్రమ్‌ సినిమాలో నటించిన సునీల్‌కి అంత ప్రాధాన్యం లేదు. అతని క్యారెక్టర్‌ చాలా సాదాసీదాగా ఉంటుంది. ఆ క్యారెక్టర్‌ని సునీల్‌ చెయ్యాల్సిన అవసరమే లేదు. బసిరెడ్డి కొడుకు బాల్‌రెడ్డిగా నవీన్‌ చంద్ర కూడా ఫర్వాలేదు అనిపించాడు. బసిరెడ్డి గ్యాంగ్‌లోని మనిషిగా నటించిన బ్రహ్మాజీ క్లైమాక్స్‌ ముందు వచ్చే సీన్‌లో తన పెర్‌ఫార్మెన్స్‌తో ఆకట్టుకున్నాడు. రాజకీయ నాయకుడిగా రావు రమేష్‌ క్యారెక్టర్‌ రెగ్యులర్‌గానే అనిపిస్తుంది. మిగతా క్యారెక్టర్లు చేసిన నటీనటుల గురించి ప్రత్యేకంగా చెప్పుకోవడానికి ఏమీ లేదు. 

సాంకేతిక నిపుణుల గురించి చెప్పుకోవాల్సి వస్తే పి.ఎస్‌.వినోద్‌ ఫోటోగ్రఫీ చాలా బాగుంది. యాక్షన్‌ సీన్స్‌లో అతని కెమెరా వర్క్‌ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. థమన్‌ చేసిన పాటల్లో మూడు పాటలు బాగున్నాయి. విజువల్‌గా ఆ పాటలు అంతగా ఆకట్టుకోవు. ఇక బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ సిట్యుయేషన్‌కి తగ్గట్టుగా బాగా చేశాడు. చాలా సీన్స్‌ అతని మ్యూజిక్‌తోనే ఎలివేట్‌ అయ్యాయి. నవీన్‌ నూలి ఎడిటింగ్‌ బాగానే ఉన్నప్పటికీ కొన్ని లెంగ్తీ సీన్స్‌ వల్ల ల్యాగ్‌ అనిపించింది. కొంత ట్రిమ్‌ చేసి ఉంటే బాగుండేది. ముఖ్యంగా సెకండాఫ్‌లోని కొన్ని సీన్స్‌ లెంగ్తీగా అనిపిస్తాయి. రామ్‌, లక్ష్మణ్‌ ఫైట్స్‌ని అద్భుతంగా కంపోజ్‌ చేశారు. ఏ ఫైట్‌కి ఆ ఫైటే అన్నట్టుగా డిఫరెంట్‌గా అనిపిస్తాయి. హారిక, హాసిని క్రియేషన్స్‌ ప్రొడక్షన్‌ వేల్యూస్‌ బాగున్నాయి. క్వాలిటీ కోసం ఎక్కడా కాంప్రమైజ్‌ అవ్వలేదనేది విజువల్స్‌ చూస్తే అర్థమవుతుంది. ఇక డైరెక్టర్‌ త్రివిక్రమ్‌ గురించి చెప్పాలంటే ఇప్పటివరకు అతను రాసుకున్న కథలకు పూర్తి భిన్నమైన కథ ఇది. ఫ్యాక్షన్‌ బ్యాక్‌డ్రాప్‌లో రాసిన ఈ కథను పక్కదారి పట్టించకుండా, కమర్షియల్‌ ఎలిమెంట్స్‌ జోలికి వెళ్ళకుండా చాలా సీరియస్‌గా సినిమాను నడిపించాడు. అయితే సినిమా స్టార్టింగ్‌ నుంచి ఎండింగ్‌ వరకు స్లో నేరేషన్‌ ఆడియన్స్‌ని అక్కడక్కడా విసిగిస్తుంది. కొన్ని లెంగ్తీ సీన్స్‌ ప్రేక్షకుల సహనాన్ని పరీక్షిస్తాయి. త్రివిక్రమ్‌ సినిమా అంటే ఎంటర్‌టైన్‌మెంట్‌ని ఆశించి వచ్చే ప్రేక్షకులకు ఈ సినిమా నిరాశనే మిగులుస్తుంది. అక్కడక్కడా సిట్యుయేషన్‌ పరంగా వచ్చే కామెడీ తప్ప సినిమాలో రిలీఫ్‌ అనేది ఉండదు. సినిమాలో ఎన్టీఆర్‌ మార్క్‌ కనిపించదు, అలాగే త్రివిక్రమ్‌ మార్క్‌ కూడా కనిపించదు. అయితే త్రివిక్రమ్‌ రాసిన కొన్ని డైలాగ్స్‌ బాగున్నాయి. సీన్స్‌ పరంగా చూస్తే హీరోయిన్‌, ఆమె తమ్ముడు కిడ్నాప్‌ అయినపుడు ఫోన్‌లోనే ప్రత్యర్థుల్ని హీరో బెదిరించే సీన్‌, నవీన్‌చంద్రతో కాంప్రమైజ్‌ సీన్‌, క్లైమాక్స్‌లో జగపతిబాబుతో చేసిన సీన్స్‌ ఆకట్టుకుంటాయి. ఫైనల్‌గా చెప్పాలంటే ఎన్టీఆర్‌, త్రివిక్రమ్‌ తొలి కాంబినేషన్‌లో రూపొందిన అరవింద సమేత ఇద్దరి మార్క్‌తో కాకుండా ఓ డిఫరెంట్‌ మూవీగా అందర్నీ ఆకట్టుకుంటుంది. కలెక్షన్స్‌పరంగా ఈ సినిమాకి ఈ దసరా సీజన్‌లో ఎలాంటి ఢోకా లేదనేది వాస్తవం. అయితే ఈ సినిమా యూత్‌ని, ఫ్యామిలీ ఆడియన్స్‌ని థియేటర్స్‌కి ఎంతవరకు రప్పిస్తుందనేది వేచి చూడాల్సిన విషయం. 

ఫినిషింగ్‌ టచ్‌: ఫస్ట్‌ కాంబినేషన్‌లో డిఫరెంట్‌ మూవీ!

aravinda sametha movie review:

ntr new movie aravinda sametha

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement