హైదరాబాద్ అమీర్‌పేట నడిబొడ్డున ఒకప్పుడు తెలుగు సినీ వైభవానికి ప్రతీకగా నిలిచిన సారథి స్టూడియోస్ అమ్మకం వెనుక ఉన్న చేదు నిజాలను సీనియర్ నటుడు జీవీ నారాయణరావు తాజాగా బయటపెట్టారు. వేల కోట్ల విలువైన ఈ చారిత్రక ఆస్తిని కేవలం కుటుంబ సభ్యుల మధ్య వచ్చిన అంతర్గత విభేదాల వల్లే వదులుకోవాల్సి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. నవయుగా ఫిలిమ్స్ అధినేతల్లో ఒకరైన తన తండ్రి, 1964లో చల్లపల్లి రాజా నుంచి ఈ స్టూడియోలో 45 శాతం వాటాను కొనుగోలు చేసారు. దశాబ్దాల పాటు దాని నిర్వహణను బాధ్యతగా చూసుకున్నారని ఆయన గుర్తుచేసుకున్నారు.
అయితే తర్వాతి తరంలో భాగస్వాముల కుటుంబాల మధ్య సఖ్యత లోపించడం ఈ వినాశనానికి దారితీసిందన్నారు. ఒకరంటే ఒకరికి పడకపోవడం, ఉమ్మడి నిర్ణయాలు తీసుకోలేకపోవడంతో చివరకు ఆస్తుల పంపిణీ అనివార్యమైందన్నారు. ఈ క్రమంలోనే 1984 ప్రాంతంలో అమీర్‌పేటలోని 12 ఎకరాల విలువైన ఈ భూమిని అమ్ముకో వాలని నిర్ణయించుకున్నారు. ఆ సమయంలో దాని విలువ కోట్లలో ఉన్నప్పటికీ, కుటుంబ సభ్యుల మధ్య ఉన్న మనస్పర్థల వల్ల ఆనాటి మేటి స్టూడియో కనుమరుగైపోయింది.
ప్రస్తుత మార్కెట్ ధరల ప్రకారం అమీర్‌పేట వంటి కీలక ప్రాంతంలో ఉన్న ఆ 12 ఎకరాల స్థలం విలువ వేల కోట్లకు పైగానే ఉంటుందని నారాయణరావు పేర్కొన్నారు. కేవలం అహాలు, విభేదాల కారణంగా తెలుగు సినిమాకు కేరాఫ్ అడ్రస్‌గా ఉన్న ఒక గొప్ప నిర్మాణ కేంద్రాన్ని కోల్పోవాల్సి రావడం బాధాకరమని ఆయన అభిప్రాయపడ్డారు. సారథి స్టూడియోస్ అమ్మకం నాటి సినీ పరిశ్రమలో ఒక తీరని లోటుగా మిగిలిపోయిందని మరోసారి స్పష్టమైంది.





మేకర్స్ వినలేదు..అందుకే ఈ రచ్చ

Loading..