Advertisement

మన నక్షత్రాల నత్త నడక - PR పంచ్

Wed 10th Aug 2022 02:28 PM
cinejosh special article pr punch,pr punch articles fro cinejosh web site,tollywood heroes,star heroes from tollywood  మన నక్షత్రాల నత్త నడక - PR పంచ్
Special Article On Tollywood Stars మన నక్షత్రాల నత్త నడక - PR పంచ్
Advertisement

టాలీవుడ్ లో యాక్టివ్ ప్రొడ్యూసర్స్ గిల్డ్ ప్రతిపాదన మేరకు తెలుగు చిత్రాల షూటింగుల నిలిపివేత కొనసాగుతోంది. మరి ప్రస్తుత ప్రతికూల పరిస్థితులకు ఈ బందు ఎంతవరకూ మందేస్తుందో తెలియదు కానీ దొరుకుతోన్న తీరికతో హీరోలు సేద తీరుతున్నారు.. పెరుగుతోన్న వడ్డీలు తలుచుకుంటూ నిర్మాతలు వణుకుతున్నారు. సరే ఆ సంగతలా వుంచితే.. నిర్మాణ వ్యయాన్ని తగ్గించే క్రమంలో అందరి పారితోషికాలపై కోత విధించాల్సిందే అంటోన్న గిల్డ్ బృందం ఆరుగురు అగ్ర హీరోలకు మాత్రం మినహాయింపు ఇస్తామంటోందట. ఆ ఆరుగురూ నేటి క్రేజీ హీరోలైన పవన్, మహేష్, ప్రభాస్, తారక్, చరణ్, బన్నీలని అందరికీ తెలిసిందే. అయితే వీళ్ళకి విపరీతమైన క్రేజ్ ఉన్నప్పటికీ, రికార్డులతో సత్తా చాటుకోగల స్టార్ ఇమేజ్ పొందినప్పటికీ వాళ్ళ వల్ల నిర్మాతలకి దక్కుతోన్న ఫలితం ఎంత.? పరిశ్రమకి కలుగుతోన్న ప్రయోజనం ఎంత..?

దంచుతున్నారు... పెంచుతున్నారు..!!

ఈ హీరోల సినిమాలకు ఓపెనింగ్స్ దద్దరిల్లుతాయి. హిట్టు పడిందంటే రికార్డులు బద్దలవుతాయి.  

శాటిలైట్ రైట్స్ హై లెవెల్ లో వుంటాయి. డిజిటల్ రైట్స్ స్కై లెవెల్ లో వస్తాయి.

అదంతా మనమూ ఒప్పుకుంటాం, ఘనంగా  చెప్పుకుంటాం కానీ రెవెన్యూ ఏ రేంజ్ లో దంచుతున్నారో.. అందుకు తగ్గట్టే రెమ్యూనరేషన్లు కూడా పెంచుకుంటూ పోతున్నారనేది వాస్తవం. నిన్న మొన్నటివరకూ ఈ హీరోల సినిమాకు ఎంత బడ్జెట్ అయ్యేదో.. ప్రస్తుతం వాళ్ళ పారితోషికమే అంతకు చేరిందనేది సుస్పష్టం. దాంతో అగ్ర నిర్మాతలకైనా, అనుభవమున్న నిర్మాతలకైనా హిట్టు సినిమాకి లాభాలు లక్షల్లోనూ.. ఫ్లాపు సినిమాకి నష్టాలు కోట్లలోనూ కనిపిస్తున్నాయి. అయితేనేం.. డిమాండ్ ఉన్నవాళ్ళదే కమాండ్ అన్న సిద్ధాంతాన్ని పాటించక తప్పట్లేదు - సదరు స్టార్ హీరోలకు చేసే చెల్లింపులు తగ్గట్లేదు.

సాగదీస్తున్నారు... సరిపెడుతున్నారు..!!

సీన్స్ తియ్యాలంటే భారీ సెట్లు వెయ్యాల్సిందే. ఫైట్ చెయ్యాలంటే  బడా సెటప్పులు కావాల్సిందే.

ఇక పాటలకైతే విమానం ఎక్కెయ్యాల్సిందే.. విదేశాలకు చెక్కేయ్యాల్సిందే.!

ఇదీ మన స్టార్ హీరోల సినిమాల తంతు. అంతేకాదు.. కాంబినేషన్ల కోసమని, క్వాలిటీ కోసమని, రిహార్శల్స్ అనీ, రీ షూట్స్ అనీ సినిమా మేకింగ్ టైమ్ ని సాగదీసుకుంటూ పోతున్నారు. చివరికి అతి కష్టంమీద ఏడాదికో సినిమాతో సరిపెడుతున్నారు. ఆ ఒక్కటీ ఆడితే ఆనందమే. లేకుంటే నెక్స్ట్ సినిమా కోసం నెక్స్ట్ ఇయర్ వరకూ ఆగాల్సిందే. ఎన్ఠీఆర్, ఏఎన్నార్, కృష్ణ, శోభన్ బాబుల నుంచి చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్ వరకు అగ్ర తారలు చకచకా సినిమాలు చేయడం వల్ల  పరిశ్రమ కళ కళలాడుతూ ఉండేది - కార్మికుల కడుపు నిండేది. డిస్ట్రిబ్యూటర్లలో ఉత్సాహం నింపేది - థియేటర్లకు ఫీడింగ్ అందేది. కానీ నేటి క్రేజీ స్టార్స్ సంవత్సరానికో సినిమా మాత్రమే సూత్రాన్ని పాటించడం పరిశ్రమలో నిరుత్సాహాన్ని, పంపిణీ రంగంలో నీరసాన్ని మిగుల్చుతోందని అంటున్నారు సీనియర్ నిర్మాతలు.

వరుసగా వచ్చేశారు... మధ్యలోనే వదిలేశారు..!!

కోవిడ్ ఎఫెక్ట్ నుంచి రిలీఫ్ కోసం వెయిట్ చేసారు. టికెట్ రేట్ల కోసం ప్రభుత్వాల్ని రిక్వెస్ట్ చేసారు.

ఆరు నెలల గ్యాప్ లోనే ఆరుగురూ వచ్చేశారు. క్యాలెండర్ లోని మరో ఆరు నెలల్ని అలా వదిలేశారు.

ఇదీ మన ఆరుగురు అగ్ర తారల తీరు. 2021 డిసెంబర్ 17న అల్లు అర్జున్ పుష్ప విడుదలవగా 2022 ఫిబ్రవరి 25న పవన్ కళ్యాణ్ భీమ్లా నాయక్ వచ్చింది. మార్చ్ 11న ప్రభాస్ రాధే శ్యామ్ తో దిగితే అదే నెల 25న తారక్ - చరణ్ ల ఆర్ ఆర్ ఆర్ రిలీజయింది. ఆపై మే 12న సర్కారు వారి పాటని ఇచ్చారు మహేష్. అంతే.! దాంతో ఐదో నెలలోనే ఈ ఏడాది ఈ హీరోల సినిమాలకు ఫుల్ స్టాప్ పడిపోయింది. ఇక ముక్తసరిగా సాగనున్న ఈ ఇయర్ కి మంచి ముగింపుని ఇచ్చే బాధ్యతతో  సీనియర్ హీరోలైన చిరంజీవి గాడ్ ఫాదర్, బాలకృష్ణ NBK 107, నాగార్జున ఘోస్ట్ సినిమాలు రానున్నప్పటికీ.. ప్రస్తుతం ప్రకాశిస్తోన్న తారలు మాత్రం తదుపరి చిత్రంతో తెరపై కనిపించేది 2023 లోనే కావడం గమనార్హం.

స్టార్స్ నాన్చుతున్నారు... ఫ్యాన్స్ నలుగుతున్నారు..!!

ప్రేక్షకులు థియేటర్లకు రావట్లేదని పరిశ్రమంతా గగ్గోలు పెడుతుంటే..

రప్పించగల హీరోల సినిమాలు నత్త నడకన సాగడం దారుణమని అంటున్నారు అనుభవజ్ఞులు.

నిజమే కదా. సినిమాలైతే ప్రకటించేస్తున్నారు కానీ పనులు మాత్రం జరగట్లేదు పవన్ కళ్యాణ్  ప్రాజెక్టులకి. సగంలో ఆగిన హరి హర వీరమల్లు పూర్తయ్యేదెపుడో.. మిగిలిన సినిమాలు పట్టాలెక్కేదెపుడో.!  

త్రివిక్రమ్ - రాజమౌళి వంటి అగ్ర దర్శకులతో  తన తదుపరి రెండు చిత్రాలూ చేయనున్న మహేష్ అసలు మాటల మాంత్రికుడితో  మొదలు పెట్టేదెపుడో.. దర్శక ధీరుడు జక్కన్న చేతికి చిక్కేదెపుడో.!

భారీ క్రేజీ ప్రాజెక్టులని ఏక కాలంలో చేస్తున్నప్పటికీ 2023 జనవరి 12 న రానున్న ప్రభాస్ ఆదిపురుష్ నుంచి కనీసం ఫస్ట్ లుక్ అయినా వచ్చేదెపుడో.. సెన్సేషనల్ సలార్ టీజర్ ని వదిలేదెపుడో.!

కొరటాల శివ, బుచ్చిబాబు, ప్రశాంత్ నీల్, వెట్రిమారన్ వంటి వెర్సటైల్ డైరెక్టర్స్ ని అయితే తారక్ లైనప్ లో పెట్టారు కానీ కొరటాలతో చెయ్యాల్సిన NTR 30 ఆరంభమెపుడో.. ఆ తదుపరి చిత్రాలు కదిలేదెపుడో.!

జీనియస్ డైరెక్టర్ శంకర్ తో పాన్ ఇండియా ఫిలింగా RC 15 చేస్తోన్న రామ్ చరణ్ ఇంకా చాలా బ్యాలన్స్ వున్న వర్కుని కంప్లీట్ చేసేదెపుడో.. గౌతమ్ తిన్ననూరి సినిమాకి క్లాప్ కొట్టేదెపుడో.!

పుష్ప రైజింగ్ చూపించి పూర్తిగా దేశాన్నే మెస్మరైజ్ చేసేసిన అల్లు అర్జున్ మరి పుష్ప రూలింగ్ షూటింగ్ స్టార్ట్ చేసేదెపుడో.. ఆ నెక్స్ట్ సినిమాల న్యూస్ చెప్పెదెపుడో.!

తాము అమితంగా అభిమానించే హీరో సినిమా అప్ డేట్స్ తెలియక ఫ్యాన్స్ గోల చేస్తున్నా, సోషల్ మీడియాలో గగ్గోలు పెడుతున్నా ఈ కథానాయకులు పట్టించుకోవట్లేదనే కంప్లైంట్ ఈమధ్య బాగా వినిపిస్తోంది. సదరు చిత్రాల దర్శక, నిర్మాతలు కూడా సరిగా స్పందించకపోవడం పట్ల నలిగిపోతున్న అభిమానుల నుంచి  ట్రోలింగ్ నడుస్తోంది. ఇప్పుడా ప్రేక్షకాభిమానులు, సినీ కార్మికులు, పంపిణీదారులు, థియేటర్ల యాజమాన్యాలు ఈ హీరోలని కోరుకుంటోంది టాలీవుడ్ కోలుకునేలా చెయ్యమని.. వేడుకుంటోంది వేగం పెంచమని.! 

కాస్త వినండి సార్లూ.. కదలండి స్టార్లూ.!!

Special Article On Tollywood Stars:

Cinejosh Special Article PR Punch

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement