ప్రజంట్ టాలీవుడ్ నెంబర్ 1 హీరో ఎవరు?

Who will be the No 1 Hero in Tollywood?

Thu 10th Sep 2020 09:08 PM
mahesh babu,allu arjun,ram charan,jr ntr,tollywood,no 1 hero,  ప్రజంట్ టాలీవుడ్ నెంబర్ 1 హీరో ఎవరు?
Who will be the No 1 Hero in Tollywood? ప్రజంట్ టాలీవుడ్ నెంబర్ 1 హీరో ఎవరు?
Advertisement

టాలీవుడ్‌లో ఎప్పటికీ ఓ సమస్య నడుస్తూనే వుంటుంది అదే ఎవరు నెం1 అనేది. సీనియర్ ఎన్‌టి‌ఆర్, ఎఎన్ఆర్‌ల నుండి ఈ సాంప్రదాయం కొనసాగుతూనే వుంది. అయితే ఎన్టీఆర్, ఎఎన్ఆర్ లు విషయానికొస్తే స్వచ్ఛందంగా ఎఎన్ఆర్ కాంపిటేషన్ నుండి తప్పుకున్నాడనే చెప్పాలి. కమర్షియల్ సినిమాలన్ని ఎన్టీఆర్ మాత్రమే చేస్తూ సూపర్ హిట్స్ కొట్టి ప్రేక్షకుల్లో తన ఇమేజ్‌ని పెంచుకున్నారు. అయితే ఎఎన్ఆర్ మాత్రం భక్తిరస చిత్రాలు, ప్రేమకథలు చేసి ఫ్యామిలీ ఆడియన్స్‌ని ఆకట్టుకున్నారు. అయితే తెలుగు సినిమా పరిశ్రమకి వీరద్దరూ రెండు కళ్ళుగా మిగిలిపోయారు. తిరుగులేని ఎన్టీఆర్‌కి నెంబర్ 1 స్థానానికి సూపర్ స్టార్ కృష్ణ రూపంలో గట్టి పోటీనే వచ్చింది. అయినా ఎన్టీఆర్, సూపర్ స్టార్ కృష్ణకి ఏమాత్రం తగ్గకుండా అడవిదొంగ లాంటి కమర్షియల్ చిత్రాలు ఇచ్చి ఆయనే నెంబర్1 గా తిరుగులేని హీరోగా ఎదిగారు. పెద్దాయనకి ఏమాత్రం తగ్గకుండా గట్టి పోటి ఇచ్చారు కృష్ణ. రకరకాల ప్రయోగాలు మొదటిగా కలర్ ప్రింట్, 70ఎంఎం, కౌబాయ్ చిత్రాలు తీసుకువచ్చి ప్రేక్షకుల్లో డేరింగ్ డాషింగ్ హీరోగా మార్కులు తెచ్చుకున్నారు. అంతేకాకుండా పోటాపొటీగా దేవదాసు, అల్లూరి సీతారామరాజు, కురుక్షేత్రం, సింహాసనం లాంటి చిత్రాలతో ఎన్టీఆర్‌ని ఎదుర్కున్నాడు. ఎంత పోటి ఇచ్చినా కూడా తనతో పాటు వచ్చిన శోభన్ బాబు, కృష్ణం రాజు లాంటి హీరోల్ని బీట్ చేశారు కానీ నెంబర్1 గా ఎదగలేదు. 

ఆ తరువాత జనరేషన్‌కి చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్‌లు ఇండస్ట్రికి నాలుగు స్తంభాలుగా నిలిచారు. వీరిలో చిరంజీవి ఎక్కువ కమర్షియల్ చిత్రాలు చేస్తూ తన డ్యాన్స్‌లతో, ఎనర్జీతో, మేనరిజంతో తెలుగు ప్రేక్షకుల్ని విపరీతంగా ఆకట్టుకున్నాడు. వరస విజయాలతో వయసుతో సంబందం లేకుండా అన్ని వయసుల వారి అభిమానాన్ని అవలీలగా పొందాడు. గత 25 సంవత్సరాలుగా చిరంజీవి నెంబర్‌వన్ ప్లేస్‌లో వున్నాడు. ఎన్టీఆర్ నటవారసుడిగా బాలకృష్ణ రెండవ స్ణానానికే పరిమితం అయ్యాడు. చిరంజీవి తర్వాత వచ్చిన పవన్ కళ్యాణ్, కృష్ణ నటవారసుడిగా వచ్చిన మహేష్ బాబు పోటాపొటీగా చిత్రాలు చేసి సెపరేట్ ఇమేజ్ ని సొంతం చేసుకున్నారు తప్ప నెంబర్ 1 ప్లేస్ పొందలేదు. రాజకీయంగా గ్యాప్ తీసుకువచ్చిన చిరంజీవి ఖైదీ నెంబర్ 150 చిత్రంతో మళ్లీ మాస్ ఇమేజ్‌ని పరిచయం చేశారు. ఇకపోతే పవన్ కళ్యాణ్, మహేష్ బాబు తరువాత జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్, రామ్ చరణ్, ప్రభాస్‌ రేస్‌లోకి వచ్చారు.

బాహుబ‌లి సిరీస్ త‌ర్వాత ప్ర‌భాస్‌ని ప్యాన్ ఇండియా స్టార్‌గా పిలుస్తున్నారు కాబ‌ట్టి ప్ర‌భాస్‌ని తెలుగు వ‌ర‌కూ ప‌రిమితం చేయ‌టం క‌రెక్ట్ కాదు. ప‌‌వ‌న్ క‌ళ్యాణ్ రాజ‌కీయ ప్ర‌వేశం త‌ర్వాత మ‌హేష్ బాబు ఒక్క‌రే నెంబ‌ర్ వ‌న్‌గా వుండే ఛాన్స్ వ‌చ్చింది. శ్రీమంతుడు, భ‌ర‌త్ అనే నేను, మ‌హ‌ర్షి లాంటి చిత్రాల‌తో త‌న ఫ్యాన్ బేస్‌ని పెంచుకున్నార‌నే చెప్పాలి. అలాగే ఎన్టీఆర్ వ‌రుస‌గా వైవిధ్య‌మైన క‌థ‌లు టెంప‌ర్‌, నాన్న‌కి ప్రేమ‌తో, జ‌న‌తా గ్యారేజ్, అర‌వింద స‌మేత వంటి చిత్రాలతో కామ‌న్ ప్రేక్ష‌కుల్లో మంచి మార్కులు వేసుకున్నారు కానీ.. బాక్సాఫీస్ ద‌గ్గ‌ర మాత్రం అనుకున్నంతగా నెంబర్‌వన్ క్రేజ్‌ని పొందలేకపోయారు. ఇక‌పోతే వ‌రుస మూస చిత్రాలు చేస్తున్న రామ్‌చ‌ర‌ణ్‌కి రంగ‌స్థ‌లం ద్వారా అతి పెద్ద బ్రేక్ రానే వ‌చ్చింది. నెక్ట్స్ సినిమాల స‌క్స‌ెస్‌ల‌తో మెగాస్టార్ వార‌సుడిగా నెం 1 స్టానంలో ఉంటాడు అనుకునేంత‌లో ‘విన‌య విధేయ రామ’ అంటూ డిజాస్ట‌ర్ ఇవ్వటం మళ్లీ క‌థ మొద‌టికే వ‌చ్చింది. ఇక స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ న‌టించిన‌ 2018వ‌ సంవ‌త్స‌రంలో వ‌చ్చిన‌ నా పేరు సూర్య చిత్రం ఫెయిల్యూర్ అయ్యింది. 

2020లోకి అడుగుపెట్టాక చూస్తే ఎస్‌.ఎస్‌. రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో ‘ఆర్ఆర్ఆర్’ చిత్రంలో ఎన్టీఆర్‌, రామ్ చ‌ర‌ణ్‌లు క‌లిసి న‌టిస్తున్నారు. ఈ చిత్రం 2021లో విడుద‌లకానుంది. బాహుబ‌లి చిత్రం విడుద‌ల‌య్యాక కూడా ద‌ర్శ‌కుడికి వ‌చ్చిన పేరు హీరోల‌కి రాలేదు. ఈసారి కూడా అదే జ‌రుగుతుందో భిన్నంగా జ‌రుగుతుందో చూడాలి. దీని త‌రువాత ఎన్టీఆర్.. త్రివిక్ర‌మ్‌, కెజిఎఫ్ ద‌ర్శ‌కుడు ప్ర‌శాంత్ నీల్ కాంబినేష‌న్‌లో చేయ‌బోతున్న‌ట్టు వార్త‌లు వ‌చ్చాయి. అలాగే రామ్ చ‌ర‌ణ్.. కొర‌టాల శివ‌, చిరంజీవి కాంబినేష‌న్‌లో వస్తున్న చిత్రంలో గెస్ట్ రోల్‌లో న‌టిస్తున్నార‌ని వార్త‌లు వ‌స్తున్నాయి. ఇదిలా వుండ‌గా జ‌న‌నానుడి ప్ర‌కారం రాజ‌మౌళి హీరోకి త‌రువాత చిత్రం ఫ్లాప్ అవుతుంద‌నేది వుంది. మ‌హేష్ బాబు విష‌యానికి కొస్తే 2020లో స‌రిలేరు నీకెవ్వ‌రు చిత్రం ద్వారా సూప‌ర్‌హిట్‌ని కొట్టారు కానీ కాంపిటేష‌న్‌లో విడుద‌లైన అల్లు అర్జున్ ‘అల వైకుంఠ‌పురములో’ చిత్రం పైచెయ్యిగా నిల‌వ‌టం కొంచెం మహేష్ బాబు ఇమేజ్‌కి అడ్డం ప‌డిన‌ట్టే. అయితే త‌ర్వాత ‘గీత గోవిందం’ వంటి ఫ్యామిలి చిత్రాల‌తో హిట్స్ కొడుతున్న ప‌రుశురామ్ కాంబినేష‌న్‌లో స‌ర్కారు వారి పాట చిత్రంలో న‌టిస్తున్నారు. ఆ తర్వాత రాజమౌళి దర్శకత్వంలో మహేష్ సినిమా ఉంటుందని అనుకుంటున్నారు. 

ఇక అల్లు అర్జున్ ఇప్ప‌టికే ‘అల వైకుంఠ‌పురములో’ చిత్రంతో రికార్డులు మూటక‌ట్టుకుని ఉషారుగా వున్నాడు. అలాగే సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో ‘పుష్ప’‌, కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో చిత్రం అనౌన్స్ చేయ‌గా మ‌రో ప‌క్క త్రివిక్ర‌మ్ కాంబినేష‌న్‌లో కూడా మ‌రో చిత్రం రానున్న‌ట్టు స‌మాచారం. దీని త‌రువాత మురుగుదాస్ ద‌ర్శ‌క‌త్వంలో చిత్రంతో పాటు సురేందర్ రెడ్డితో కూడా చ‌ర్చ‌లు జ‌రుగుతున్నట్టు స‌మాచారం. అల్లు అర్జున్ ‘అల వైకుంఠ‌పురములో’ త‌ర్వాత గ‌ట్టి లైన‌ప్‌తో వెలుతున్నాడ‌నే చెప్పాలి. 2020 వ‌ర‌కు అల్లు అర్జున్‌దే హ‌వా సాగింది. త‌ర్వాత వ‌చ్చే రెండు సంవ‌త్స‌రాల్లో ఈ న‌లుగురు హీరోల లైన‌ప్‌ని బట్టి, స‌క్సెస్ రేట్‌ని బ‌ట్టి నెం1 స్థానం సంపాదించుకుంటార‌నేది వాస్త‌వం. ప్రస్తుతానికైతే ప్రభాస్‌ని పక్కన పెడితే రికార్డుల పరంగా బన్నీదే టాప్ ప్లేస్.

Who will be the No 1 Hero in Tollywood?:

Mahesh Babu, Allu Arjun, Ram Charan, Jr NTR in Tollywood No 1 Race


Loading..
Loading..
Loading..
advertisement