‘‘వైయస్ కలలోకి వస్తే చాలు కాంగ్రెసు నేతలంతా వైసీపీలో చేరతారు’’ ` అన్నారు రాజమండ్రి మాజీ ఎంపీ, ఉండవల్లి అరుణ్ కుమార్.
‘‘ప్రతిపక్షనేత జగన్ ఏదైనా మాట్లాడితే ‘దొంగ’ అని నోరు మూయిస్తున్నారు, ఇంతవరకూ కొత్తగా ఒక్కపైసా అయినా అదనంగా ఆయన అవినీతిని చూపించారా’’ అని సూటిగా ప్రశ్నించారు ఉండవల్లి.
దేశ, రాష్ట్ర రాజకీయాలపైన ` భారత రాజ్యాంగంపైన సమగ్ర అవగాహన వున్న వ్యక్తి ఉండవల్లి అరుణ్‌కుమార్. ఆయన ఏం మాట్లాడినా, ఏం చేసినా రీజనింగ్ వుంటుంది. బొత్స సత్యనారాయణ వైయస్సార్‌సీపీలో చేరనున్న నేపధ్యంలో ఉండవల్లి వ్యాఖ్యలకు రాజకీయంగా చాలా విలువ వుంది. ఇదే సందర్భంలో ఆంధ్రప్రదేశ్‌కి ప్రత్యేకహోదా విషయమై ముఖ్యమంత్రి చంద్రబాబుని, కేంద్రమంత్రి వెంకయ్యనాయుడిని ఎద్దేవా చేశారు ఉండవల్లి. రాష్ట్ర విభజన బిల్లు పార్లమెంటుకి వచ్చినప్పుడు కాంగ్రెసు ఎంపీలు, కేంద్రమంత్రులు ఏంచేశారు? రాష్ట్ర విభజన ఆగదు ` మీకేం కావాలో చెప్పండి అని సోనియా పదే పదే చెప్పినా ఈ ఉండవల్లి ఏం చేశారు? రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రభుత్వం పంపిన తీర్మానం ఏమయింది ఉండవల్లి గారూ! సుప్రీం కోర్టులో రాష్ట్ర విభజనని సవాలు చేశారు. పర్యవసానం ఏమిటి ఉండవల్లిగారూ! ఏపీకి ప్రత్యేకహోదా ఇవ్వాలన్న కేబినెట్ తీర్మానం ఆర్డినెన్సుగా రాకపోవడానికి కారణాలేమిటో మీకు తెలియవా ఉండవల్లిగారూ! భూసేకరణ బిల్లుని రాజ్యసభలో తీవ్రంగా ప్రతిఘటిస్తున్న కాంగ్రెసు ఉభయ సభలలో ఆంధ్రప్రదేశ్‌కి ఇచ్చిన హామీలపై ఆందోళన ఎందుకు చేపట్టడంలేదు? రాష్ట్ర విభజన విషయమై నాటి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, ‘సభా సామ్రాట్’ ఉండవల్లి, ‘మెరుపులేని ఉరుము’ లగడపాటి ఏదో చేస్తారని ఆశలు పెంచుకున్న ఆంధ్రులకి మీరేం చేశారో సెలవియ్యండి మహాశయా! ‘ఆంధ్రజ్యోతి’ చెబుతూనే వుంది ‘విభజన జరిగితీరుతుంది, ఆంధ్రాకి ఏం కావాలో కోరుకోండి’ అని. కాదనగలరా ‘‘అపరచాణక్య’ ఉండవల్లిగారూ!