Advertisement

సినీజోష్‌ ఇంటర్వ్యూ: సీనియర్‌ నరేష్‌

Tue 20th Jan 2015 05:25 AM
senior naresh interview,sr naresh birthday today  సినీజోష్‌ ఇంటర్వ్యూ: సీనియర్‌ నరేష్‌
సినీజోష్‌ ఇంటర్వ్యూ: సీనియర్‌ నరేష్‌
Advertisement

1972లో ‘పండంటి కాపురం’ చిత్రంతో బాలనటుడిగా పరిచయమై ‘ప్రేమసంకెళ్ళు’ చిత్రంతో హీరోగా పరిచయమై ఆ తర్వాత నాలుగు స్తంభాలాట, రెండు జెళ్ళ సీత, చిత్రం భళారే విచిత్రం, జంబలకిడి పంబ వంటి కామెడీ చిత్రాలతో ప్రేక్షకుల్ని ఎంటర్‌టైన్‌ చేసిన హీరో, ప్రముఖ నటి, దర్శకురాలు విజయనిర్మల తనయుడు నరేష్‌. ఎన్నో చిత్రాల్లో హీరోగా నటించి తనకంటూ ఓ ప్రత్యేక ఇమేజ్‌ని ఏర్పరచుకున్న నరేష్‌ కొంత గ్యాప్‌ తర్వాత క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా తన సెకండ్‌ ఇన్నింగ్స్‌ని స్టార్ట్‌ చేసి అన్ని రకాల క్యారెక్టర్స్‌ చేస్తూ ప్రస్తుతం ప్రముఖ క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా పేరు తెచ్చుకుంటున్నారు. ఓ పక్క అందర్నీ అలరించే క్యారెక్టర్స్‌ చేస్తూనే మరో పక్క సామాజిక సేవ కూడా చేస్తూ అందరి మన్ననలు పొందుతున్నారు. తాజాగా సందీప్‌ కిషన్‌ హీరోగా కన్మణి దర్శకత్వంలో ఉషాకిరణ్‌ ఫిలింస్‌, ఆనంది ఆర్ట్‌ క్రియేషన్స్‌ సంయుక్తంగా నిర్మిస్తున్న ‘బీరువా’ చిత్రంలో ఔట్‌ అండ్‌ ఔట్‌ కామెడీ క్యారెక్టర్‌ చేస్తున్నారు. తెలుగుతోపాటు తమిళ చిత్రాల్లో కూడా నటిస్తూ బిజీ క్యారెక్టర్‌ ఆర్టిస్టు అనిపించుకుంటున్న నరేష్‌ ఈరోజు(20) పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా నరేష్‌తో ‘సినీజోష్‌’ ఇంటర్వ్యూ.

మీ సెకండ్‌ ఇన్నింగ్స్‌ ఎలా వుంది?

చాలా హ్యాపీగా వుంది. నా సెకండ్‌ ఇన్నింగ్స్‌ స్టార్ట్‌ అయి నేను స్టెబిలైజ్‌ అవడానికి ఆరేడు సంవత్సరాలు అయింది. 2014 నాకు చాలా మంచి సంవత్సరం. దృశ్యంలో ఒక అద్భుతమైన క్యారెక్టర్‌ చేయడం, ఆ సినిమా సూపర్‌హిట్‌ కావడం, నేను చేసిన క్యారెక్టర్‌కి మంచి పేరు రావడం జరిగింది. ఆ తర్వాత పరంపర అనే చిత్రం చేశాను. దానికి జకార్తా ఫిలిం ఫెస్టివల్‌ అవార్డు వచ్చింది. లక్ష్మీ రావే మా ఇంటికి, చిన్నదాన నీ కోసం చిత్రాల్లో చాలా మంచి క్యారెక్టర్స్‌ చేశాను. 2014 నా విజయ పరంపరకి నాంది పలికింది. నంబరాఫ్‌ ఫిలింస్‌ చేశాను. సేమ్‌ టైమ్‌ నంబరాఫ్‌ హిట్స్‌ కూడా వచ్చాయి. 2015 మరింత వేగవంతం అయ్యేలా కనిపిస్తోంది. బీరువా, గడ్డం గ్యాంగ్‌, పానీపూరి వంటి సినిమాలు రిలీజ్‌కి వున్నాయి. 

‘బీరువా’లో మీరు చేసిన క్యారెక్టర్‌ మీకు ఎలాంటి హెల్ప్‌ అవుతుంది?

ఉషాకిరణ్‌ మూవీస్‌ సంస్థ మొదట నిర్మించిన చిత్రం ‘శ్రీవారికి ప్రేమలేఖ’. అప్పట్లో చాలా పెద్ద హిట్‌ అయిన సినిమా. అందుకని అది నా సొంత బేనర్‌లా భావిస్తాను. ఆ బేనర్‌లో మళ్ళీ రెండు మూడు సినిమాలు హీరోగా చేశాను. ఇప్పుడు నా సెకండ్‌ ఇన్నింగ్స్‌లో ఉషాకిరణ్‌ ఫిలింస్‌, ఆనంది ఆర్ట్‌ క్రియేషన్స్‌ వంటి రెండు పెద్ద బేనర్స్‌ కలిసి ఒక అద్భుతమైన చిత్రాన్ని నిర్మించడం, అందులో నేను ఒక ముఖ్యమైన పాత్ర పోషించడం జరిగింది. ప్రేక్షకులు, నా అభిమానులు మంచి కామెడీతో కూడిన కీ రోల్‌ ఎప్పుడు చేస్తారని ఎప్పటి నుంచో అడుగుతున్నారు. వాళ్ళు కోరినట్టుగానే ‘బీరువా’ చిత్రంలో ఎంతో ప్రాముఖ్యత వున్న క్యారెక్టర్‌ చేశాను. ఈ సినిమాలో హీరో సందీప్‌ కిషన్‌, నేను చేసే సీన్స్‌ ప్రధానంగా వుంటాయి. హీరోకి మంచి టైమింగ్‌ వుండడం, మా ఇద్దరికీ మంచి అండర్‌స్టాండిరగ్‌ కూడా వుండడం వల్ల ఒక అద్భుతమైన క్యారెక్టర్‌ ఈ సినిమాలో చేసే అవకాశం నాకు కలిగింది. నేను ఎంతో శాటిస్‌ఫై అయిన చిత్రంతో 2015 సంవత్సరాన్ని స్టార్ట్‌ చేస్తున్నాను. పర్టిక్యులర్‌గా ఈ చిత్రం నా కెరీర్‌ని పది మెట్లు ముందుకు తీసుకెళ్తుందన్న నమ్మకం నాకు వుంది. రెండు ప్రముఖ చిత్ర నిర్మాణ సంస్థలు ఎంతో టేస్ట్‌తో అంతకుమించిన క్వాలిటీతో ఈ చిత్రాన్ని నిర్మించాయి. ఈ చిత్రంలో ఎన్నో ప్రత్యేకతలు వున్నాయి. మంచి దర్శకుడు, మంచి కథ, మంచి కామెడీతో కూడిన ఈ సినిమాలో ఒక కీ రోల్‌ చెయ్యడం నాకు బాగా ప్లస్‌ అవుతుందని అనుకుంటున్నాను. 

ఇంకా మీరు చేస్తున్న, చేయబోతున్న సినిమాలు?

దీని తర్వాత గడ్డం గ్యాంగ్‌లో కూడా మంచి క్యారెక్టర్‌ చేస్తున్నాను. ఇవి కాక మరో రెండు సినిమాల్లో మెయిన్‌ క్యారెక్టర్స్‌ చేయబోతున్నాను. ఆ వివరాలు త్వరలోనే తెలియజేస్తాను. ఇవి కాకుండా హరీష్‌ శంకర్‌ డైరెక్షన్‌లో దిల్‌రాజుగారు నిర్మించే సినిమా ఈనెల 24న షూటింగ్‌ స్టార్ట్‌ కాబోతోంది. ఇవి కాకుండా తమిళ్‌లో కూడా సినిమాలు చేస్తున్నాను.

మీరు చేస్తున్న సామాజిక సేవా కార్యక్రమాలు?

అనంతపురంలో కళాకారుల ఐక్యవేదిక ప్రారంభించి మూడు సంవత్సరాలు పూర్తి కావస్తోంది. అందులో 18,000 మంది సభ్యులు వున్నారు. అందులో 10,000 మంది లబ్ది పొందారు. ఈ సంవత్సరం దానికి సంబంధించిన వెబ్‌సైట్‌ ప్రారంభిస్తున్నాం. ఈ వెబ్‌సైట్‌తో విదేశాల్లో వున్నవారి సహాయాన్ని కోరుతున్నాం. కళారంగాన్ని ప్రభుత్వం నిర్లక్ష్యం చేయడమనేది ఇప్పటివరకు ఆనవాయితీగా వచ్చింది. దానికి సంబంధించిన డిపార్ట్‌ మెంట్‌ వుంది, ఐఎఎస్‌ అధికారులు వున్నారు. కానీ, కళారంగానికి బడ్జెట్‌ అనేది లేదు. ఇప్పటికైనా ప్రభుత్వం చొరవ తీసుకొని వారికి చేయూత నివ్వాలని కోరుతున్నాను. మా ఐక్యవేదిక ద్వారా తర్వాత చేయబోయే కార్యక్రమం మా సభ్యుల పిల్లలకు ప్లస్‌ 2 వరకు ఉచిత విద్య అందించడం. మొదట వెయ్యి కుటుంబాలను టార్గెట్‌ చేస్తున్నాం అంటూ ఇంటర్వ్యూ ముగించారు సీనియర్‌ నటుడు నరేష్‌. ఈరోజు(20) పుట్టినరోజు జరుపుకుంటున్న నరేష్‌కి బర్త్‌డే విషెస్‌ తెలియజేస్తోంది ‘సినీజోష్‌’.


Loading..
Loading..
Loading..
advertisement