జగన్నాటకమ్.! ఉనికి కోసం వైఎస్ జగన్ ‘ఆరాటం’.!
YS Jagan’s desperate struggle for survival!రాజకీయాల్లో గెలుపోటములు సహజం. ఎన్నికలొస్తుంటాయ్.. పోతుంటాయ్. ప్రభుత్వాలు మారుతుంటాయ్. ఇదంతా ప్రజాస్వామ్యంలో సర్వసాధారణం. నిజానికి, అదే ప్రజాస్వామ్యం తాలూకూ బ్యూటీ కూడా. గెలుపోటములకతీతంగా ప్రజలకు సేవ చేయాలనే ఆలోచనే రాజకీయం. అంతేగానీ, పదవి పోతే ప్రజల వైపు చూడం.. రాష్ట్రం దాటి పోతాం.. అనుకుంటే, అంతకన్నా హాస్యాస్పదం ఇంకోటుండదు.
గతంలో టీడీపీ అధినేత చంద్రబాబు, జన సేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా హైద్రాబాద్‌లో ఎక్కువ రోజులు వుండేవారు. అది వేరే వ్యవహారం. అప్పట్లో హైద్రాబాద్, తెలంగాణతోపాటు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి కూడా ఉమ్మడి రాజధాని. ఇప్పుడూ పవన్ కళ్యాణ్, ఎక్కువ రోజులు హైద్రాబాద్‌లో వుండొచ్చుగాక. అనారోగ్య సమస్యలు, సినీ నటుడు కావడం.. సినిమాల్నీ, రాజకీయాల్ని బ్యాలెన్స్ చేసుకోవడం.. ఇలా పవన్ కళ్యాణ్‌కి ఆ వెసులుబాటు వుంది.
వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అలా కాదు. ‘నేను అమరావతిలోనే ఇల్లు కట్టుకున్నాను తెలుసా..’ అంటూ, హైద్రాబాద్‌లోని లోటస్‌పాండ్‌ని ఖాళీ చేసేశారు. అంత అతి చేశాక, అమరావతిలోని తాడేపల్లి నివాసంలోనే వుండాలి కదా.? కాపురం విశాఖలో పెడతానంటూ, 2024 ఎన్నికలకు ముందర హడావిడి చేసి, బెంగళూరుకి జంప్ అయిపోయారు.
ఇందుకే, వైఎస్ జగన్ ‘బెంగళూరు’ ప్యాలెస్ కాపురంపై ట్రోల్స్ వస్తుంటాయి. అవన్నీ పక్కన పెడితే, గత కొంతకాలంగా టీడీపీ, జనసేన, బీజేపీ.. ఈ మూడు పార్టీల నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం ఏ అభివృద్ధి కార్యక్రమం చేపట్టినా, దాని ఘనతని వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఖాతాలో వేసేసి, ఆ వెంటనే, తన ఖాతాలోకి మార్చేసుకోవాలని వైఎస్ జగన్ ఆరాటపడుతుండడం హాస్యాస్పదంగా మారిపోయింది.
మొన్నటికి మొన్న అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం విషయంలోనూ, నిన్నటికి నిన్న వెలిగొండ ప్రాజెక్టు విషయంలోనూ, తాజాగా గోదావరి జలాల్ని ఉత్తరాంధ్రకు అందించే బృహత్ కార్యక్రమం విషయంలోనూ, వైఎస్ జగన్ పడుతున్న ‘క్రెడిట్ చోరీ’ పాట్లు నవ్వులపాలవుతున్నాయి.
వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా వున్న సమయంలో ఏ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమానికైనా రాజశేఖర్ రెడ్డి పేరు లేదంటే జగన్ పేరు పెట్టుకోవడం చూశాం. కూటమి హయాంలో పద్ధతి మారింది. అదే వైఎస్ జగన్ మోహన్ రెడ్డి జీర్ణించుకోలేకపోతున్నారు.
2014-19 మధ్యకాలంలో ‘టిడ్కో’ ఇళ్ళను పెద్దయెత్తున నిర్మిస్తే, నిర్మాణం పూర్తయినవాటిని లబ్దిదారులకు ఇవ్వలేకపోయారు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తన హయాంలో. ప్రభుత్వం అనేది నిరంతర ప్రక్రియ. ఖర్చు ప్రజలది.. సంక్షేమమైనా, అభివృద్ధి అయినా ఆ ప్రజలకు నిరంతరం అందించడమే, ప్రభుత్వంలో ఎవరున్నా చేయాల్సిన పని.
పోలవరం ప్రాజెక్టు బ్రిటిష్ హయాంలో ప్లాన్ చేయబడింది. అదిప్పటికీ పూర్తి కాలేదంటే, దానికి చాలా కారణాలున్నాయి. జాతీయ హోదా వచ్చాకనే, పోలవరం ప్రాజెక్టు పనులు వేగం పుంజుకున్నాయి. ‘నాన్న ప్రారంభించిన ప్రాజెక్ట్ నేను పూర్తి చేస్తా..’ అని చెప్పుకున్న జగన్, రివర్స్ టెండరింగ్ పేరుతో ప్రాజెక్టు భవిష్యత్తుని అగమ్యగోచరంగా మార్చేశారు.
కూటమి హయాంలో పోలవరం ప్రాజెక్టు పనులు పరుగులు పెడుతున్నాయి. వచ్చే ఏడాది పోలవరం ప్రాజెక్టుని పూర్తి చేసి, జాతికి అంకితం చేస్తామని ఏపీ సీఎం ముఖ్యమంత్రి ఇటీవలే ప్రకటించారు. దాన్ని కూడా వైఎస్ జగన్, తన ఖాతాలో, తన తండ్రి ఖాతాలో వేసేసుకుంటున్నారు.
ఇలా క్రెడిట్ కోసం ఆరాటపడే బదులు.. బెంగళూరుని వదిలి, తాడేపల్లి నివాసానికి వచ్చి, వైసీపీ నాయకులు, క్యాడర్‌కి అందుబాటులో వుంటే మంచిది కదా.! ఆ ఒక్కటి తక్క.. అంటున్నారు జగన్. సోషల్ మీడియాలో ‘అది నాదే, ఇది నా ఘనత, అదిగదిగో మా నాన్న కష్టం..’ అంటూ ట్వీట్లేస్తే, వైసీపీకి ఏం ఉపయోగం.?
తాను చేసిన పబ్లిసిటీ స్టంట్లకి ప్రజలిచ్చిన సీట్లు పదకొండు అని జగన్ ఎప్పుడు అర్థం చేసుకుంటారు? ఇంకా మొద్దు నిద్ర వీడకుండా, పగటి కలలు కంటే.. వైసీపీకి వచ్చే ఎన్నికల్లో రాబోయే సీట్లు ‘శూన్యం’ అవడం ఖాయం.
- సింధు







































