సాయంత్రం 4 తర్వాత ఫోన్లు బంద్!
Sameera Reddy traded Bollywood glamour for a fulfilling life in Goa
బాలీవుడ్‌లో గ్లామర్ పాత్రలతో మెప్పించిన సమీరా రెడ్డి ఇప్పుడు గోవాలో ప్రశాంతమైన జీవితాన్ని ఎంతో ఇష్టపడుతున్నానని చెప్పారు. 2020లో గోవాకు మకాం మార్చిన తర్వాత తన ఆలోచనలు, జీవనశైలి పూర్తిగా మారిపోయాయని ఓ ఇంటర్వ్యూలో మనసు విప్పారు. ముంబైకి వెళ్లినప్పుడు తనకు ఏదో తెలియని దూరం అనిపిస్తోందని.. గోవాలోనే నిజమైన ఇంటి వాతావరణం ఉందన్నారు. మంచి స్నేహితులు, కుటుంబంతో కలిసి ఇక్కడ ఎంతో సంతోషంగా ఉన్నామని, మళ్లీ బాలీవుడ్‌కు తిరిగి వెళ్లే ఆలోచన లేదని కుండబద్దలు కొట్టారు.
సినిమాల నుంచి దూరమయ్యాక డిజిటల్ ప్రపంచం తనకు కొత్త ఉత్సాహాన్ని ఇస్తోందని సమీరా తెలిపారు. షార్ట్-ఫామ్ కంటెంట్ తీసే క్రియేటర్ల కష్టం, సృజనాత్మకత తనకు ఎంతో స్ఫూర్తినిస్తాయని, వారి నుంచే తాను చాలా విషయాలు నేర్చుకుంటున్నానన్నారు. సొంత భాషలో ప్రేక్షకులకు దగ్గరయ్యే ఇన్‌ఫ్లుయెన్సర్లే నిజమైన టాలెంట్ అని ప్రశంసించిన అమ్మడు తనను తాను హ్యాపీనెస్ క్రియేటర్ గా పిలుచుకోవడానికి ఇష్టపడతానన్నారు. అత్తగారు మంజరి వార్డే (శాసీ సాసు) కూడా ఎంతో ఉత్సాహంగా తనతో కలిసి సరదా వీడియోలు చేస్తూ ఆనందాన్ని పంచుకుంటారని వివరించారు.
సినీ రంగంలో స్టార్‌డమ్ ..ప్రజలకు నేరుగా చేరువయ్యే అవకాశం ఈ రెండింటినీ అనుభవించడం అదృష్టంగా భావిస్తున్నానని సమీరా అన్నారు. గతంలో సినిమా వాతావరణం వేరేలా ఉండేదని.. కానీ ఇప్పుడు చిన్న విషయం జరిగినా కెమెరాలు వెంటపడుతున్నారని గుర్తు చేసుకున్నారు. గోవాలో మాత్రం సాయంత్రం నాలుగు గంటలకే ఫోన్లు ఆఫ్ చేసేస్తామని.. టీవీ కూడా వీకెండ్స్‌లోనే చూస్తామన్నారు. ప్రకృతి మధ్య గడపడం, తోటపని, సైక్లింగ్ వంటి వాటితో గోవా తనకు మనసుకు నచ్చిన జీవితాన్ని ఇచ్చిందని సంతృప్తి వ్యక్తం చేశారు.















































