కొత్త తరం సంగీత దర్శకులకు శామ్ సీఎస్ సూచనలివే!
Sam CS has a special message for young music directors!సౌత్ ఇండియాలో బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌తో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న సంగీత దర్శకుడు శామ్ సీఎస్ ఓ ఇంటర్వ్యూలో నేటి సినిమా సంగీత పోకడలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుత యువత లౌడ్ మ్యూజిక్కు ఎక్కువగా అలవాటు పడటంతో చాలామంది కంపోజర్లు అదే ట్రెండ్‌ను ఫాలో అవుతున్నారని.. కానీ సంగీత దర్శకులు ఒకే తరహా శైలికి పరిమితం కాకుండా విభిన్న జానర్లలో ప్రయోగాలు చేయాలని సూచించారు.
శ్రోతలకు ఎప్పటికీ గుర్తుండిపోయే మంచి మెలోడీలు.. నాణ్యమైన సంగీతాన్ని అందిస్తే ప్రేక్షకులు తప్పకుండా ఆదరిస్తారని శామ్ సీఎస్ అభిప్రాయపడ్డారు. ఇదే క్రమంలో సమకాలీన సంగీత దర్శకుల పనితీరును ప్ర శంసించారు. అనిరుధ్ రవిచందర్ ఇటీవల అందిస్తున్న సంగీతం తనకు బాగా నచ్చుతోందన్నారు. జీవీ ప్రకాష్ కుమార్ అద్భుతమైన మెలోడీలు ఇస్తున్నారని కొనియాడారు. అలాగే సంతోష్ నారాయణన్ విభిన్నమైన శైలిలో వెర్సటైల్ మ్యూజిక్ అందిస్తున్నారన్నారు.
యువ కంపోజర్లు కూడా ఇలాంటి వైవిధ్యాన్ని చూపించాలని కోరారు. ఇళయరాజా, ఏఆర్ రెహమాన్ లాంటి దిగ్గజాలు ఇప్పటికీ నిలబడ్డారంటే వారి సంగీతంలోని ఆత్మ, మెలోడీయే కారణమని గుర్తుచేశారు. ఇక శామ్ సీఎస్ కెరీర్ విషయానికి వస్తే తెలుగు, తమిళ, హిందీ భాషల్లో వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. రామ్ పోతినేని హీరోగా రూపొందుతున్న `RAPO23` చిత్రంతో పాటు మరికొన్ని చిత్రాలకు పనిచేస్తున్నారు.
















































