రూట్ మార్చిన భాగ్యశ్రీ బోర్సే!
I believe I can take on any character: Bhagyashri Borseకథానాయికగా తనదైన ముద్ర వేస్తున్న నటి భాగ్యశ్రీ బోర్సే వైవిధ్యమైన పాత్రలను ఎంచుకుంటూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. ఇటీవల ఆమె ఎంచుకున్న పాత్రలు ఒకదానికొకటి పూర్తి భిన్నంగా ఉండటం గమనార్హం. పీరియాడిక్ డ్రామా `కాంత` నుంచి ఇటీవల నటించిన `లెనిన్` చిత్రంలో అమాయకమైన గ్రామీణ అమ్మాయిగా కనిపించి ఆకట్టుకున్నారు. విభిన్నమైన ప్రాజెక్ట్‌లను ఎంచుకుంటూ నటనా ప్రతిభను నిరూపించుకునే దిశగా ఆమె పయనిస్తున్నారు.
ప్రస్తుతం భాగ్యశ్రీ మోహన్‌లాల్ సరసన `ఆపరేషన్ గంగ` అనే హై-వోల్టేజ్ యాక్షన్ థ్రిల్లర్‌లో నటిస్తున్నారు. ప్రస్తుతం అమ్మడు ఈ సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. నటనలోని విభిన్న కోణాలను ఆవిష్కరించేందుకు ఇలాంటి వైవిధ్యమైన పాత్రలను కావలాలనే ఎంచుకుంటున్నారా? అని అడిగినప్పుడు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు.
ఒకే రకమైన పాత్రలకే పరిమితం కావడం (టైప్‌కాస్టింగ్) అనేది నటీనటులు తమ సినిమాలను ఎలా ఎంచుకుంటారు. తమను ఎలా ప్రాజెక్ట్ చేసుకుంటారు అనే దానిపైనే ఆధారపడి ఉంటుందని భాగ్యశ్రీ స్పష్టం చేశారు. ఒకే పరిధికి పరిమితం కాకుండా వైవిధ్యమైన కథలను ఎంచుకోవడం ద్వారానే ఏ నటుడైనా టైప్‌కాస్ట్ ముద్ర నుంచి బయటపడగలరని అభిప్రాయపడ్డారు.
`కాంత` లాంటి పీరియాడిక్ ఫిలిం చేశాను. లెనిన్ చిత్రంలో క్యూట్ విలేజ్ గర్ల్‌గా నటించాను. `కింగ్‌డమ్` లో గంభీరమైన డాక్టర్ పాత్రలో కనిపించాను. గ్లామరస్ పాత్రలను కూడా చేయగలను అని భాగ్యశ్రీ చెప్పారు. నటీనటులు కొత్తగా ఏం తీసుకువస్తున్నారో? చూడటానికి ప్రేక్షకులు ఎప్పుడూ సిద్ధంగా ఉంటారని పేర్కొన్నారు.
ఒకే తరహా పాత్రలకు పరిమితమైపోతాననే భయం తనకు లేదని వ్యాఖ్యానించారు. నటిగా ముందుకు సాగుతూ విస్తృతమైన పాత్రలను పోషించడమే ప్రధాన లక్ష్యమన్నారు. ఏ పాత్రనైనా సమర్థవంతంగా పోషించగలననే నమ్మకం, ఆత్మవిశ్వాసం ఉన్నాయని ధీమా వ్యక్తం చేశారు.
















































