ఒకే వేదికపై దిగ్గజ గాయకులు!
Shah Rukh Khan curates UNIFYD music festival
బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ అంతర్జాతీయ స్థాయిలో మరో భారీ ప్రాజెక్ట్‌కు శ్రీకారం చుట్టారు. అబుదాబి వేదికగా యునిఫైడ్ ఫెస్టివల్ పేరుతో అత్యంత వైభవంగా నిర్వహించనున్న అంతర్జాతీయ మ్యూజిక్ ఫెస్టివల్‌ను ఆయన అధికారికంగా ప్రకటించారు. దక్షిణ ఆసియా సంగీత ప్రతిభను అంతర్జాతీయ వేదికపై చాటిచెప్పే లక్ష్యంతో షారుఖ్ ఈ భారీ మ్యూజిక్ ఈవెంట్‌ను క్యూరేట్ చేస్తున్నారు.
ఈ ప్రతిష్టాత్మక సంగీత మహోత్సవం 2027 మార్చి 20న అబుదాబిలోని ప్రసిద్ధ ఎతిహాద్ లైవ్ వేదికగా జరగనుంది. ఒకే రోజు జరిగే ఈ గ్రాండ్ ఈవెంట్లో భారతీయ సంగీత ప్రపంచంలోని దిగ్గజ గాయకులు అరిజిత్ సింగ్, సోనూ నిగమ్ .. పంజాబీ రాపర్ కరణ్ ఔజ్లా ప్రధాన ఆకర్షణగా నిలవనున్నారు. ప్రథమ విడత లైనప్‌లోనే ఈ ముగ్గురు అగ్ర కళాకారులు చేరడం ప్రపంచవ్యాప్తంగా ఉన్న సంగీతాభిమానుల్లో తీవ్ర ఉత్సుకతను నింపింది.
ఈ అంతర్జాతీయ వేదికపై బహుళ వేదికలను ఏర్పాటు చేయనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. పండగ సమయానికి దాదాపు 15 మందికి పైగా అంతర్జాతీయ, భారతీయ కళాకారులు ఇందులో పాల్గొననుండగా, త్వరలోనే వారి పేర్లను కూడా ప్రకటించనున్నారు. వివిధ శైలులకు చెందిన సంగీతాన్ని ఒకే వేదికపైకి తీసుకువచ్చి ప్రేక్షకులు మంత్రముగ్ధులయ్యే అనుభవాన్ని అందించడమే ఈ ఫెస్టివల్ ప్రధాన ఉద్దేశం.
















































