2026 చివరి మూడు నెలల్లో టాలీవుడ్ సందడిలా!
Tollywood set to be abuzz in the last three months of 2026!2026 సంవత్సరం ప్రథమార్ధంలో హెచ్చుతగ్గులు చూసిన తెలుగు చిత్రసీమ ద్వితీయార్థంలో మాత్రం సరికొత్త వేగంతో దూసుకుపోతోంది. ముఖ్యంగా ఏడాది చివరి మూడు నెలలైన అక్టోబర్, నవంబర్, డిసెంబర్‌లలో బాక్సాఫీస్ వద్ద సినిమాల వర్షం కురిపించేందుకు నిర్మాతలు రంగం సిద్ధం చేశారు. అక్టోబర్ 2న `డోంట్ ట్రబుల్ ది ట్రబుల్`, `సిగ్మా` సినిమాలు ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్నాయి. అక్టోబర్ 9 న వెంకటేష్-త్రివిక్రమ్ కాంబినేషన్‌లో వస్తున్న`ఆదర్శ కుటుంబం`, ఇక దసరా పండుగ కానుకగా అక్టోబర్ 15, 16 తేదీల్లో సూపర్‌స్టార్ రజనీకాంత్ `జైలర్ 2`, విజయ్ దేవరకొండ `రణబాలి`, ధనుష్ `ఓం` చిత్రాలు థియేటర్లలో హోరాహోరీగా పోటీ పడనున్నాయి.
నవంబర్ నెలలో కూడా బిగ్ బాక్స్ ఆఫీస్ పోరు కొనసాగనుంది. నవంబర్ 6న అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కించిన `రామాయణ పార్ట్-1` విడుదలకు సిద్ధమవుతుండగా, అదే రోజు తమిళ హీరో సూర్య `సీన్`, నయనతార `మహాశక్తి` చిత్రాలు ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. అనంతరం నవంబర్ 19న తరుణ్ భాస్కర్ అండ్ టీమ్ `ఈ నగరానికి ఏమైంది ట్రూ` తో అలరించేందుకు వస్తుండగా నవంబర్ 20న దుల్కర్ సల్మాన్ `ఆకాశంలో ఒకతార` బాక్సాఫీస్ వద్దకు రానుంది. ఇక నవంబర్ 27న రష్మిక మందన ప్రధాన పాత్రలో నటిస్తున్న `మైసా` చిత్రం విడుదల కానుంది.
సంవత్సరం ఆఖరి నెల అయిన డిసెంబర్ థియేట్రికల్ రన్‌లో మరింత వేడి పెంచబోతోంది. డిసెంబర్ 4న అక్కినేని నాగచైతన్య `వృషకర్మ`, విశ్వక్సేన్ `లెగసీ`, దుల్కర్ సల్మాన్ `శ్రీశ్రీ` చిత్రాలు ఒకే రోజు పోటీ పడటానికి సమాయత్తమవుతున్నాయి. ఇక ఏడాది ముగింపులో క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 24న నందమూరి బాలకృష్ణ `దాదా`, అక్కినేని నాగార్జున `కింగ్ 100` వంటి ప్రతిష్టాత్మక చిత్రాలు థియేటర్లలో సందడి చేయడానికి సిద్ధంగా ఉన్నాయి.
ఆ రకంగా 2026 చివరి 90 రోజులు టాలీవుడ్‌కు అత్యంత కీలకమైన కాలంగా మారబోతున్నాయి. స్ట్రెయిట్ తెలుగు సినిమాలతో పాటు భారీ డబ్బింగ్ చిత్రాలు, పాన్-ఇండియా ప్రాజెక్టులు బాక్సాఫీస్ బరిలో దిగుతుండటంతో థియేటర్ల దగ్గర పండుగ వాతావరణం నెలకొననుంది. ప్రథమార్ధంలో ఆశించిన స్థాయి విజయాలు లేక నిరాశ చెందిన ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లకు చివరి మూడు నెలల బాక్సాఫీస్ హంగామా భారీ ఊరటనిస్తుందని ట్రేడ్ వర్గాలు ఆశిస్తున్నాయి.
















































