రా వ్యవస్థాపకుడి పాత్రలో సంచలన స్టార్!
Hrithik Roshan as RN Kao in spy film
భారతీయ గూఢచార సంస్థ రా వ్యవస్థాపకుడు రామేశ్వర్ నాథ్ కావ్ నేపథ్యంతో రూపుదిద్దుకోనున్న ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌లో బాలీవుడ్ సంచలన స్టార్ హృతిక్ రోషన్ నటించబోతున్నారనే వార్త సంచలనం రేపుతోంది. దేశ భద్రతా వ్యవస్థను బలోపేతం చేయడంలో కీలక పాత్ర పోషించిన రామేశ్వర్ పితామహుడి పాత్రలో హృతిక్ పేరు ప్రముఖంగా చర్చకు రావడంతో ప్రాజెక్ట్‌పై అంచనాలు ఒక్కసారిగా ఆకాశన్నంటుతున్నాయి. అద్భుతమైన నటన, గంభీరమైన వ్యక్తిత్వంతో ఏ పాత్రనైనా సమ్మోహన పరిచే హృతిక్ ఐకానిక్ చారిత్రాత్మక రోల్‌కు సరిగ్గా సరిపోతారని సినీ ప్రేమికులు అభిప్రాయపడుతున్నారు.
ఇప్పటికే వార్, ఫైటర్ వంటి భారీ యాక్షన్ .. స్పై థ్రిల్లర్ చిత్రాల్లో స్పై ఆఫీసర్‌గా తనదైన ముద్ర వేసిన హృతిక్ రోషన్‌కు ఈ తరహా పాత్రలు చేయడం కొత్తేం కాదు. అయితే ఈసారి ఒక ఏజెంట్‌గా కాకుండా, దేశ రక్షణ కోసం రహస్య వ్యూహాలను రచించిన దిగ్గజ వ్యవస్థాపకుడి ప్రయాణాన్ని తెరపై ఆవిష్కరించే అవకాశం రావడం విశేషం. నిజ జీవితంలో చోటుచేసుకున్న ఉత్కంఠభరిత సంఘటనల ఆధారంగా ప్రతిష్టాత్మకంగా తెరకెక్కనున్న పీరియాడిక్ డ్రామాలో హృతిక్ మేకోవర్ .. అభినయం సరికొత్త స్థాయిలో ఉంటాయని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి.
ప్రస్తుతం చర్చల దశలో ఉన్న ప్రాజెక్ట్‌కు సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలోనే వెలువడే అవకాశం ఉందని బాలీవుడ్ మీడియా సమాచారం. ఒకవైపు కమర్షియల్ యాక్షన్ చిత్రాలతో అలరిస్తున్న హృతిక్ ఇలాంటి బాధ్యతాయుతమైన నిజజీవిత పాత్రను పోషిస్తే అది ఆయన కెరీర్‌లోనే మైలురాయిగా నిలిచిపోతుందని అభిమానులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
















































