ఆస్కార్ రేసులో 2 భార‌తీయ సినిమాలు

CineJosh news

ఆర్.ఆర్.ఆర్ ఒరిజిన‌ల్ మ్యూజిక్ కేట‌గిరీలో పుర‌స్కారం ద‌క్కించుకున్న త‌ర్వాత మ‌ళ్లీ భార‌తీయ సినిమాలు ఆస్కార్ బ‌రిలో స‌త్తా చాట‌లేదు. ఇప్పుడు 2025-26 సంవ‌త్స‌రం నుంచి ఆస్కార్ రేసులో నిలిచే సినిమా ఏది? అనే ఆస‌క్తి అంద‌రిలోను ఉంది. వివ‌రాల్లోకి వెళితే..

ఆస్కార్ ఉత్తమ అంతర్జాతీయ ఫీచర్ ఫిలిం విభాగంలోకి ప్రవేశించడానికి సాధారణంగా ప్రతి దేశం నుండి ఒకే సినిమాను ఎంపిక చేస్తుంటారు. కానీ 99వ అకాడమీ అవార్డ్స్ కోసం అకాడమీ ప్రవేశపెట్టిన సరికొత్త నిబంధనల మార్పు కారణంగా ఈసారి భారతదేశం నుండి ఏకంగా రెండు సినిమాలు ఆస్కార్ రేసులో నిలిచాయి. సంతోష్ దవాఖర్ దర్శకత్వంలో తెరకెక్కిన మరాఠీ థ్రిల్లర్ చిత్రం `గొంధల్` 33 పోటీదారులలో భారతదేశ అధికారిక ఎంట్రీగా ఎంపికైంది. అయితే దీనితో పాటు తేజ రియో దర్శకత్వంలో నాగాలాండ్ నేపథ్యంలో 1960ల కాలం నాటి కథతో రూపుదిద్దుకున్న `అంగ్` సినిమా కూడా టొరంటో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో `ప్లాట్‌ఫాం ప్రైజ్` గెలుచుకోవడం ద్వారా ఆస్కార్ రేసులో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది.

అంతర్జాతీయ చలనచిత్రోత్సవాలలో నిర్ణీత ఆరు ప్రధాన బహుమతులు గెలుచుకున్న నాన్-ఇంగ్లీష్ చిత్రాలు స్వతంత్రంగా ఆస్కార్‌కు దరఖాస్తు చేసుకోవచ్చని అకాడమీ కొత్త నిబంధనలను తెచ్చింది. ఈ కొత్త విధానం వల్ల భారతదేశం వంటి బహుభాషా సినీ పరిశ్రమ ఉన్న దేశాలకు ఒకే సినిమాను ఎంపిక చేయడంలో ఎదురయ్యే ఇబ్బందులు తొలగిపోయాయి. టొరంటో ఫెస్టివల్‌లో `అంగ్` చిత్రం విజయం సాధించడం ద్వారా గొంధల్‌తో పాటు అదే ఆస్కార్ రేసులోకి సమాంతరంగా ప్రవేశించింది. ఈ రెండు చిత్రాలు కూడా 14 మార్చి 2027న జరగనున్న 99వ అకాడమీ అవార్డ్స్ తుది నామినేషన్ల రేసులో నిలవడానికి ముందుగా డిసెంబర్ 15న ప్రకటించబోయే షార్ట్‌లిస్ట్ ప్రక్రియను ఎదుర్కొవాల్సి ఉంది.