నో వీఐపీ.. ఓన్లీ భక్తి
Rajpal Yadav skips VIP line at Lalbaugcha Rajaబాలీవుడ్ హాస్య నటుడు రాజ్‌పాల్ యాదవ్ ముంబైలోని ప్రఖ్యాత లాల్‌బాగ్చా రాజా గణపతి మండపాన్ని సందర్శించారు. వీఐపీ లేదా ప్రత్యేక మార్గాల ద్వారా కాకుండా సాధారణ భక్తులతో కలిసి క్యూలైన్‌లో నిలబడి స్వామివారిని దర్శించుకోవడం అందరి దృష్టిని ఆకర్షించింది. గణేష్ చతుర్థి ఉత్సవాల సందర్భంగా అత్యంత రద్దీగా ఉండే మండపంలో రాజ్ పాల్ సాధారణ భక్తుడిలా ఓపికగా వరుసలో వేచి ఉండి వినాయకునికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ప్రస్తుతం రాజ్‌పాల్ యాదవ్ చెక్ బౌన్స్ కేసులకు సంబంధించి న్యాయపరమైన చిక్కులను ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. ఆయన నిర్మాణ సంస్థకు సంబంధించిన ఏడు చెక్ బౌన్స్ కేసుల్లో ఢిల్లీ హైకోర్టు విధించిన శిక్షపై ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ క్రమంలో 5 కోట్ల మొత్తాన్ని కోర్టు రిజిస్ట్రీలో డిపాజిట్ చేయాలనే షరతుపై సుప్రీంకోర్టులో లొంగిపోవడంతో మధ్యంతర ఉపశమనం దక్కింది.
కోర్టు వ్యవహారాలు , వివాదాలు కొనసాగుతున్న సమయంలో రాజ్‌పాల్ యాదవ్ లాల్‌బాగ్చా రాజాను దర్శించుకోవడం ప్రాధాన్యత సంతరించుకుంది. సెలబ్రిటీ హోదాను పక్కనపెట్టి సామాన్యులతో కలిసి లైన్లో నిలబడి స్వామివారి ఆశీస్సులు పొందడంపై పలువురు ప్రశంసలు కురిపిస్తున్నారు.
















































