రామాయణం: `జై జై రామ్`కి మిక్స్డ్ రెస్పాన్స్
Ramayana: Mixed response to Jai Jai Ramపౌరాణిక ఇతిహాసం `రామాయణం` నుంచి విడుదలైన తొలి భక్తి గీతం `జై జై రామ్` సోషల్ మీడియాలో ముఖ్యంగా ఎక్స్ (X) -రెడిట్ వేదికలపై తీవ్ర చర్చకు దారితీసింది. లెజెండరీ సంగీత దర్శకుడు ఏ.ఆర్. రెహమాన్ స్వరపరిచిన ఈ ఆధ్యాత్మిక గీతానికి అరిజిత్ సింగ్- శ్రేయ ఘోషల్ అద్భుతమైన గాత్రం అందించగా.. రణబీర్ కపూర్ - సాయి పల్లవి శ్రీరాముడు, సీతాదేవి పాత్రల్లో కనిపిస్తున్నారు. ఘనమైన వైభవమైన అయోధ్య దృశ్యాలతో కూడిన ఈ పాట ప్రేక్షకులను ఆకట్టుకున్నా.. దీనిపై వస్తున్న స్పందనలు మాత్రం మిశ్రమంగా ఉన్నాయి.
ఈ చిత్రంలో విజువల్స్ పరంగా వచ్చిన బెటర్‌మెంట్‌పై అభిమానుల నుంచి ప్రశంసలు వెల్లువెత్తాయి. గతంలో విడుదలైన ప్రమోషనల్ గ్లింప్స్‌తో పోలిస్తే సీజీఐ (CGI) - మేకింగ్ పరమైన నాణ్యత చాలా మెరుగ్గా ఉందని సోషల్ మీడియా యూజర్లు గుర్తించారు. ప్రేక్షకుల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుంటూ విజువల్ ఎఫెక్ట్స్ బృందం నిరంతరం శ్రమిస్తూ అవుట్‌పుట్‌ను మెరుగుపరుస్తుండటంపై పలువురు హర్షం వ్యక్తం చేశారు.
అయితే సంగీతం విషయంలో మాత్రం ప్రేక్షకులలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. పాటలోని గాత్రాలు `రామ్ సియా రామ్` అద్భుతంగా ఉన్నా కానీ.. కొంతమంది శ్రోతలు ఇది పూర్తిగా సాంప్రదాయ ఆధ్యాత్మిక అనుభూతిని ఇవ్వకుండా కమర్షియల్ ఫిల్మీ ఎనర్జీని కలిగి ఉందని అభిప్రాయపడ్డారు. ఈ పాట సినిమా కథలో సరిగ్గా ఇమిడిపోతుందా లేక కేవలం ప్రమోషనల్ సాంగ్‌గా మాత్రమే మిగులుతుందా అనే చర్చ కూడా నడిచింది.
ప్రధాన పాత్రల నటీనటుల ఎంపికపై కూడా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వాదనలు జరిగాయి. శ్రీరాముడి పాత్రలో రణబీర్ కపూర్ నటనను..అతడి కళ్లలో కనిపించే భావాలను కొందరు మెచ్చుకోగా.. ఇప్పటికే ఉన్న ఇమేజ్ కారణంగా అతడిని దైవిక పాత్రలో చూడటం కొంచెం కష్టంగా ఉందని మరికొందరు వాదించారు. ఇదేరీతిలో సాయి పల్లవి సీత పాత్రకు నప్పుతుందా లేదా అనే విషయమై కూడా సినీ ప్రియుల మధ్య రకరకాల చర్చలు జరిగాయి.
ఇలా భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నా..జై జై రామ్ పాట మాత్రం `రామాయణం` సినిమాపై అంచనాలను నిలబెట్టడంలో విజయవంతమైంది. విడుదల తేదీ దగ్గరపడుతున్న కొద్దీ మేకర్స్ కంటెంట్‌ను మరింత మెరుగుపరుస్తూ పాజిటివ్ బజ్‌ను క్రియేట్ చేస్తున్నారు. భారీ అంచనాల మధ్య రానున్న ఈ చిత్రం థియేటర్లలో ఏ స్థాయిలో ఆకట్టుకుంటుందనేది తుది అవుట్‌పుట్‌పై ఆధారపడి ఉంటుంది. ఈ ఏడాది దీపావళి కానుకగా నవంబర్ 6న రామాయణం-1 విడుదల కానున్న సంగతి తెలిసిందే.
















































